స్టార్ అనే పదానికి బలం ఏమిటో.. మాస్ ఇమేజ్ అంటే ఎలా ఉంటుందో ఆయన్ని చూస్తే అర్థమవుతుంది. సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించడం ఆయనకే చెల్లింది. హీరో అనే పదానికి సరికొత్త నిర్వచనం చెప్పి పవర్‌స్టార్‌గా సినీ పరిశ్రమలో స్థానం సంపాదించారు. ఇప్పటికీ అంతే స్థాయిలో ఆదరణ పొందుతున్నారు. ఆయనే కొణిదెల పవన్ కల్యాణ్. నేడు (సెప్టెంబరు 2) 50వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ప్రత్యేక కథనం.
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు పవన్. క్రమక్రమంగా సినిమాల్లో ఆకాశమంత ఎత్తుకు ఎదిగారు. ఆయన్ని కథానాయకుడిగా ఎంత మంది అభిమానిస్తారో, వ్యక్తిగా అంతకంటే ఎక్కువగా ఆరాధిస్తారు. నిర్మాత, యుద్ధ కళాప్రావీణ్యుడు, దర్శకుడు, రచయిత, రాజకీయ నాయకుడిగా ఇలా భిన్నరంగాల్లో రాణిస్తూ తనదైన రీతిలో రాణిస్తున్నారు పవర్ స్టార్.
కుటుంబ నేపథ్యం
కొణిదెల వెంకటరావు, అంజనా దేవి దంపతులకు 1971 సెప్టెంబరు 2న బాపట్లలో జన్మించారు పవన్ కల్యాణ్. ఆయనకు ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నయ్యలు. పెద్దన్నయ్య చిరంజీవి, నటుడు, నిర్మాత అయిన నాగేంద్ర బాబు రెండో అన్నయ్య.
నటనా జీవితం
కంప్యూటర్స్‌లో డిప్లమా చేసిన పవన్ కల్యాణ్... సినిమా అంటే పెద్దగా ఆసక్తి లేకపోయినా అన్నయ్య చిరంజీవిని చూసి నటన పట్ల ఇష్టాన్ని పెంచుకున్నారు. స్వతహాగా సిగ్గరి కావడం వల్ల అరంగేట్రం చేసేందుకు చాలా ఆలోచించారు. కానీ తన వదిన, చిరంజీవి సతీమణి సురేఖ ప్రోద్బలంతో కథానాయకుడిగా మారారు.
1996లో విడుదలైన 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' పవన్ తొలి చిత్రం. ఆ సినిమా మోస్తరుగా ఆడినా.. ప్రేక్షకుల ఆదరణ పొందారు పవన్. అందులో ప్రదర్శించిన యుద్ధవిద్యలు, సాహసోపేతమైన విన్యాసాలు వారికి ఎంతగానో నచ్చాయి. ఆ తర్వాత వచ్చిన 'గోకులంలో సీత', 'తొలి ప్రేమ', 'తమ్ముడు', 'సుస్వాగతం', 'బద్రి', 'ఖుషి' చిత్రాలతో ఆయన రేంజ్ పెరిగి ఆకాశమంత ఇమేజ్ సొంతం చేసుకున్నారు.
'జల్సా', 'గబ్బర్ సింగ్' చిత్రాలతో సరికొత్త రికార్డులు సృష్టించారు పవన్ కల్యాణ్. 'అత్తారింటికి దారేది'.. వసూళ్లలో అప్పటి వరకు తెలుగు సినీపరిశ్రమలో ఉన్న రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది.
అటు దర్శకత్వం.. ఇటు నిర్మాణం
'జానీ' సినిమాకు దర్శకత్వం వహించి ప్రధాన పాత్రలో నటించారు పవన్. అతి పిన్న వయసులోనే దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన కథానాయకుల్లో పవన్ కల్యాణ్ ఒకరు. అదే విధంగా పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై 'గబ్బర్ సింగ్', 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రాల్ని నిర్మించారు.