పవన్ కల్యాణ్ సినీ కెరీర్‌లోనే కాదు.. ఆయన అభిమానుల గుండెల్లోనూ చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రం 'గబ్బర్ సింగ్'. దర్శకుడు హరీశ్ శంకర్ అద్భుతంగా తెరకెక్కించారు. అయితే ఈ సినిమా వెనకున్న ఓ ఆసక్తికర కథను గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు పవన్. నిజానికి ఈ సినిమా నచ్చి చేయలేదని, అనివార్య పరిస్థితుల కారణంగానే ఇందులో నటించాల్సి వచ్చిందని వెల్లడించారు.
"నేను 'గబ్బర్ సింగ్'ను కొన్ని అత్యవసర పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది. మొదట దీనిని చేయాలనుకోలేదు. ఓ సినిమా విషయంలో మా అన్నయ్యకు ఆర్థిక ఇబ్బందులెదురైతే.. ఆ బాధ్యతను నేను తీసుకున్నా. వెంటనే ఏదైనా చిత్రం చేసి ఆ అప్పులు తీర్చాల్సిన అవసరం ఏర్పడింది. ఈ క్రమంలోనే తక్కువ బడ్జెట్‌లో త్వరగా పూర్తి చేయాలని భావించి ఈ సినిమా చేశాను. ఇందులో నా పాత్ర ఎలా ఉండాలి అన్నది నేనే డిసైడ్ చేసుకున్నా. పోలీస్ పని పట్ల చాలా నిబద్ధతతో ఉంటాడు. కానీ, డ్రెస్సింగ్ స్టైల్ వ్యవహార శైలి మాత్రం విభిన్నంగా ఉండాలి అనుకున్నా. దీనికి స్ఫూర్తిగా 'గుడుంబా శంకర్'లోని ఓ సీన్‌లో నేను చేసిన పోలీస్ పాత్ర తీసుకున్నా. నా డ్రెస్సింగ్ స్టైల్, వ్యక్తిత్వానికి దగ్గరగానే 'గబ్బర్‌సింగ్'లోనూ నటించాను. నిజానికి నా నుంచి వచ్చిన రెండు 'గబ్బర్‌సింగ్'లు నా ఆర్థిక అవసరాల వల్ల వచ్చినవే"
-పవన్ కల్యాణ్, కథానాయకుడు