కథానాయకుడిగా తెలుగు, తమిళ చిత్రాల్లో అలరించిన నటుడు సురేశ్. ఒకప్పుడు వరుస చిత్రాలతో ప్రేక్షకులను రంజింప చేసిన ఆయన ఇటీవల పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఒదిగిపోతున్నారు. అప్పట్లో సురేశ్ ఎంచుకున్న కథలు చూసి, తెలుగు చిత్ర పరిశ్రమలో మరో శోభన్‌బాబు అవుతాడని అనుకున్నానని ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. 'పరుచూరి' పలుకులు పేరుతో ఆయన యువ దర్శకులకు పాఠాలు చెప్పడం సహా ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. తాజాగా సురేశ్‌తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.
"నేను సురేశ్‌తో 'మరో క్విట్ ఇండియా' సినిమా చేశా. దాంట్లో వాణీ విశ్వనాథ్ కథానాయిక. చిన్న సినిమా కావటం వల్ల ఖర్చు తగ్గించుకునేందుకు అందరం కలిసి చిన్న రూమ్‌లో సర్దుకుపోయేవాళ్లం. అందులోనే నేనూ, వాణీ విశ్వనాథ్, సురేశ్ ఉండేవాళ్లం. సరదాగా కబుర్లు చెప్పుకుంటుంటే, సురేశ్ కల్పించుకుని 'ఈ అమ్మాయి(వాణీ విశ్వనాథ్)'తో జాగ్రత్తండీ కేరళలో ఒక వీధినే కొనేసింది. ఎందుకంటే ఇక్కడ తెలుగులో స్టార్ హీరోయిన్‌గా అవకాశాలు కొట్టేస్తోంది' అని సురేశ్ సరదాగా ఆటపట్టించేవారు. రాఘవేంద్రరావు నవ్విస్తే ఆనందపడతారు. సురేశ్ నవ్వించి ఆనందపడతారు. సురేశ్ సెట్లో ఉన్నాడంటే ఒకటే నవ్వులు. అతని డ్యాన్స్ గమనిస్తే సురేశ్ బాడీలోనే డ్యాన్స్ ఉంటుంది. కానీ, అతను ఎక్కువగా తమిళంలో సినిమాలు చేశారు. అవే సినిమాలు వరుసగా తెలుగులోకి చేసి ఉంటే, మరో శోభన్‌బాబు అయ్యేవారు. వాణీ విశ్వనాథ్ - సురేశ్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే అదే 'టేక్'లా ఉండేది. ఆ తర్వాత సురేశ్ మాతో 'తోడికోడళ్ళు' చిత్రం చేశారు. తొలుత ఈ చిత్రంలో వెంకటేష్, రోజా, మీనా, శారదలు నటించాల్సి ఉంది. చిన్న సినిమా కావడం వల్ల వాళ్లు ముందుకు రాలేదు. ఆ తర్వాత ఈ సినిమాకి బోయిన సుబ్బారావు దర్శకత్వం చేశారు. కథను సరిగ్గా జడ్జి చేసే వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. రామానాయుడు కథ విని బాగుందంటే ఇక దానికి తిరుగుండదు. 'తోడికోడళ్ళు' కథను తమిళంలో శివాజీ గణేష్ తనయుడు ప్రభు రీమేక్ చేసుకున్నారు. చాలా బాగా ఆడింది. ఏదైనా సరే 'ఫస్ట్ థాట్ ఈజ్ బెస్ట్ థాట్' అని అన్న ఎన్టీఆర్ కూడా అనేవారు.