Oscar Awards 2022: గుండెలు ఉప్పొంగే క్షణాలవి. ఏళ్ల నిరీక్షణకు తెరపడే సమయమది. కలను.. కళతో నిజం చేసుకొన్న వేడుకది. ప్రపంచంలోని సినిమా వాళ్లు కళ్లప్పగించి చూసే వేదికది. అదిరిపోయే లైటింగే చిన్నబోయేలా మెరిసే మోములు... కళ్లు చెదిరే అలంకరణే తలవంచే అందాలు... ముత్యాల హారాలే ముడుచుపోయేలా నవ్వులు.... ఇదంతా దేనిగురించి అంటారా? 94వ ఆస్కార్ పురస్కార వేడుక గురించి కాకపోతే.. ఇంకేంటి?
ప్రపంచ చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా చెప్పుకొనే అకాడమీ అవార్డుల(ఆస్కార్) ప్రదానోత్సవం ఆదివారం(భారతదేశంలో సోమవారం తెల్లవారుజామున) రాత్రి ఘనంగా జరిగింది. కరోనా పరిస్థితులతో రెండేళ్లుగా సందడిలేని ఈ వేడుక ఈ ఏడాది పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్లో జరిగిన 94వ అకాడమీ అవార్డుల వేడుకలో వివిధ విభాగాల్లో 'డ్యూన్' చిత్రం హవా కొనసాగింది.
అప్పుడు తగ్గి... ఇప్పుడు నెగ్గి:"ఓడిపోతే ఆగిపోకూడదు.. గెలిచే వరకూ పోరాటడుతూనే ఉండాలి" అనే సూత్రం ఈ సారి ఉత్తమ నటుడిగా ఆస్కార్ గెలిచిన విల్‌స్మిత్‌కు సరిగ్గా సరిపోతుంది. రెండు సార్లు 'ఆస్కార్'ను సాధించలేకపోయిన హాలీవుడ్ నటుడు విల్‌స్మిత్ మూడో ప్రయత్నంలో విజయం అందుకున్నాడు. భారతీయ సినీ అభిమానులకు సుపరిచితుడైన ఆయన ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు. ఎందరో జీవితాల్ని తెరపైకి తీసుకొచ్చిన ఈ ఉత్తమ నటుడి గురించి తెలుసుకుందాం.
'బ్యాడ్ బాయ్స్', 'మెన్ ఇన్ బ్లాక్', 'ఐ యామ్ లెజెండ్', 'ఎనిమీ ఆఫ్ ది స్టేట్' వంటి విభిన్న తరహా కథలతో అలరించిన స్మిత్ నటించిన తొలి బయోపిక్ 'అలీ'. ఈ చిత్రం ప్రముఖ బాక్సర్ మహ్మద్ అలీ జీవితాధారంగా తెరకెక్కింది. అలీ పాత్రలో ఒదిగిపోయి, విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమాతోనే ఉత్తమ నటుడిగా తొలిసారి ఆస్కార్‌కు, గ్లోబల్ గోల్డ్ అవార్డ్‌కు నామినేట్ అయ్యాడు.
తొలిసారి..:అతడు నటించిన రెండో బయోపిక్ 'ది పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్'. అమెరికన్ బిజినెస్‌మ్యాన్, మోటివేషన్ స్పీకర్ క్రిస్ గార్డ్నర్ జీవితకథాంశాలతో ఈ సినిమా రూపొందింది. తండ్రీకొడుకుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో స్మిత్ భావోద్వేగాలు చూస్తే కళ్లు చెమ్మగిల్లాల్సిందే. అంతగా హృదయాల్ని హత్తుకున్నాడు కాబట్టే ఉత్తమ నటుడిగా రెండోసారి ఆస్కార్ నామినేషన్‌కు ఎంపికయ్యాడు.
రెండోసారి..:నైజీరియన్- అమెరికన్ ఫిజిషియన్ బెన్నెత్ ఒమలు జీవితాధారంగా తెరకెక్కిన 'కన్క్యూషన్' సినిమాకు ఉత్తమ నటుడిగా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్‌కు నామినేట్ అయ్యాడు స్మిత్. ఇలా.. పలు ప్రతిష్ఠాత్మక అవార్డులకు నామినేట్ అయి విజేతగా నిలవకపోయినా స్మిత్ ఎప్పుడూ నిరాశ పడలేదు. "ప్రయత్నిస్తే ఎప్పటికైనా అనుకున్న ఫలితం వస్తుంద"నే నమ్మకంతోనే మరొకరి జీవిత కథను తెరపైకి తీసుకొచ్చాడు.
ఎట్టకేలకు..:ఉత్తమ నటుడిగా స్మిత్‌కు ఆస్కార్‌ను అందించిన ఆ చిత్రమే 'కింగ్ రిచర్డ్'. ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణులు వీనస్, సెరీనా విలియమ్స్ తండ్రి, కోచ్ రిచర్డ్ విలియమ్స్ జీవిత కథతో రూపొందింది. వీనస్, సెరీనాలను టెన్నిస్ క్రీడాకారిణులుగా తయారు చేయడంలో రిచర్డ్ ఎలా కృషి చేశారు? అన్నది ఇందులో భావోద్వేగభరితంగా చూపించారు. టైటిల్ పాత్రలో విల్‌స్మిత్ జీవించిన తీరు ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ప్రపంచమంతా తన గురించి మాట్లాడుకునేలా చేసింది. బాలీవుడ్ చిత్రం 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' (హిందీ)లో స్మిత్ అతిథిగానూ స్మిత్ సందడి చేశాడు.
మూడో దర్శకురాలు:ఉత్తమ దర్శకత్వ విభాగంలో ఆస్కార్ అందుకున్న మూడో మహిళ జేన్ క్యాంపియన్. కత్రియన్ బిగెలో, క్లోయి ఝవోల తర్వాత ఆమె ఈ అవార్డ్ అందుకొన్నారు. న్యూజిలాండ్‌కు చెందిన జేన్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం 'స్వీటీ'. తర్వాత ఈమె రూపొందించిన 'పియానో' చిత్రానికి ఉత్తమ స్క్రీన్‌ప్లే విభాగంలో ఆస్కార్ గెలిచారు. ఇప్పుడు 'ది పవర్ ఆఫ్ డాగ్'తో ఉత్తమ దర్శకురాలిగా నిలిచారు.
పదేళ్ల నిరీక్షణ ఫలించింది:'ది ఐస్ ఆఫ్ టెమీ ఫేయ్' చిత్రానికి ఉత్తమ నటిగా ఆస్కార్ అందుకున్న జెస్సికా చాస్టెయిన్... ఈ క్షణం కోసం పదేళ్లు నిరీక్షించింది. అమెరికాకు చెందిన 45 ఏళ్ల జెస్సికా నటిగా, నిర్మాతగా 20 ఏళ్లుగా సినిమా రంగంలో ఉంది. స్త్రీవాద చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. 2011లో 'ద హెల్ప్', 2012లో 'జీరో డార్క్ థర్టీ' సినిమాలకు ఆస్కార్ బరిలో నిలిచినా అవార్డు అందలేదు. టీవీలో మతప్రచారకురాలిగా పేరొందిన టెమ్మీ ఫేయ్ బేకర్ జీవితకథే 'ది ఐస్ ఆఫ్ టెమ్మీ ఫేయ్'. సినిమాలో టెమ్మీ 30 ఏళ్ల జీవితాన్ని చూపారు. దానికి తగ్గట్టు మేకప్, ప్రోస్థెటిక్స్ వేసుకుని అద్భుతంగా నటించింది జెస్సికా. ఈ సినిమాకే ఉత్తమ మేకప్, హెయిర్‌స్టైలింగ్ విభాగాల్లో ఆస్కార్ అవార్డులూ రావడం విశేషం. ఈ సినిమాకి ఈమె నిర్మాత.
ఉత్తమ చిత్రం 'కోడా' బృందం మనకు నిరాశే:ఈ 94వ ఆస్కార్ చలన చిత్రోత్సవాల్లో సూర్య నటించిన 'జై భీమ్' చిత్రం ఉత్తమ ఇంటర్నేషనల్ ఫిల్మ్ విభాగంలో పోటీకి వెళ్లింది. ఈ సినిమా తుది జాబితాలో చోటు సంపాదించలేకపోయింది. ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ విభాగంలో మన దేశం నుంచి ఓ డాక్యుమెంటరీ నామినేషన్ దక్కించుకుంది. అదే రింటు థామస్, సుష్మిత్ ఘోష్ సంయుక్తంగా తెరకెక్కించిన 'రైటింగ్ విత్ ఫైర్'. ఇదీ పురస్కారం అందుకోలేకపోయింది.
ఇదీ చూడండి:విల్‌స్మిత్ ఆస్కార్‌ను వెనక్కి తీసేసుకుంటారా?