'సవ్యసాచి' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది నిధి అగర్వాల్. తొలి సినిమాతోనే హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుని.. 'ఇస్మార్ట్ శంకర్'లో గ్లామర్ డాల్‌గా కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది. 'హీరో' చిత్రంలో తళుక్కుమన్న ఈ బ్యూటీ.. పవన్‌కల్యాణ్‌తోనూ ఓ సినిమా చేస్తోంది. ఈ సందర్భంగా తన మనసులోని ముచ్చట్లను పంచుకుంటోందిలా..
ఆ హోర్డింగులపై నేనుండాలని..
నాన్న వ్యాపారవేత్త. అమ్మ ఫ్యాషన్ డిజైనర్. నాన్నకు ఐశ్వర్యారాయ్ అంటే అభిమానం. ఆమె హోర్డింగులు కనిపిస్తే చూస్తూ అలా ఉండిపోయే వారాయన. అప్పుడే.. నేనూ ఆ హోర్డింగుల్లో కనిపించాలనీ, సినిమాల్లోకి వెళ్లాలనీ నిర్ణయించుకున్నా. ఇంట్లోనూ ప్రోత్సహించడం వల్ల మోడలింగ్ ప్రారంభించా. బిజినెస్ మేనేజ్‌మెంట్ చదువుతూనే ఆడిషన్లకు వెళ్లేదాన్ని.
ఇక్కడే పుట్టా
మా అమ్మవాళ్లది హైదరాబాదే. నేనూ ఇక్కడే పుట్టా. బెంగళూరులో పెరిగా. ప్రస్తుతం సినిమాల కోసం ముంబయిలో ఉంటున్నా. వేసవి సెలవుల్లో హైదరాబాద్‌లోని అమ్మమ్మ ఇంటికి వచ్చేదాన్ని. తెలుగు పదాలు చాలావరకూ అప్పుడే తెలుసు. సినిమాల్లోకి వచ్చాక మాట్లాడటమూ నేర్చుకున్నా.
సినిమాల్లో అవకాశం
స్కూల్లో ఉన్నప్పుడే కథక్, బెల్లీ డ్యాన్స్ నేర్చుకున్నా. హిందీ సినిమా 'మున్నా మైఖేల్'తో పరిశ్రమలోకి వచ్చా. అందులో టైగర్ ష్రాఫ్‌తో కలిసి నటించేందుకు డ్యాన్స్ తెలిసిన అమ్మాయే కావాలనడం వల్ల ఆడిషన్‌కు 300 మంది వచ్చారు. వారిలో నాకు అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తుంటా.
కథనే నమ్ముతా
హీరోలూ, డైరెక్టర్లూ చిన్నా పెద్దా అని చూసుకోను. కథను మాత్రమే నమ్ముతా. నా పాత్రకు వందశాతం న్యాయం చేస్తా. వర్షంలో కళ్లు తెరిచి హావభావాలు పలికించడం కష్టం. అందుకే రెయిన్ సాంగ్స్ అంటే కొంచెం భయం.
యాక్టర్‌గా డాక్టర్
చాలామంది డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యామంటారు. నేను మొదట్నుంచీ యాక్టరే కావాలనుకున్నా... అయ్యాను. కానీ, ఇప్పటివరకూ 'ఇస్మార్ట్ శంకర్', 'హీరో'తో పాటు ఓ తమిళ చిత్రంలోనూ డాక్టర్‌గా నటించా. అందుకే, యాక్టరై డాక్టరయ్యావంటూ స్నేహితులు ఆటపట్టిస్తుంటారు.
వాటిని పట్టించుకోను
మోడలింగ్ చేస్తున్నప్పుడే ఇన్‌స్టాలో నాకు పది లక్షలమంది ఫాలోవర్లు ఉన్నారు. ఇప్పుడైతే కోటిన్నరకుపైగానే. ట్రోల్స్‌ను అస్సలు పట్టించుకోను.
ఎవరికీ తెలియనివి..
మొదట్లో నాది ఎడమచేతి వాటమైనా అమ్మానాన్నలు కుడి చేయి అలవాటు చేయించారు. ఇంకోటి స్కూల్లో ప్రపోజ్ చేసిన అబ్బాయిలనూ గొడవ పడిన అమ్మాయిలనూ చాలామందిని చెంపదెబ్బలు కొట్టా.