తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సినీ రంగంలో ప్రతిభకు కొలమానం ఏంటి? - సుశాంత్ సింగ్ రాజ్​పుత్ ఆత్మహత్య

సమాజంలో బతకడానికి తెగువ అక్కర్లేదు.. కానీ సమాజంలో గెలవాలంటే మాత్రం గుండె ధైర్యం కావాలి అనేది స్వామి వివేకానంద తత్వం. అయితే ఆ గుండె ధైర్యాన్ని అణచివేసే విధంగా వ్యవస్థలో కొన్ని శక్తులు నిరంతరం అడ్డుపతూనే ఉంటాయనేది గడచిన కొన్నిరోజులుగా దేశవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో నడుస్తున్న చర్చ. సుశాంత్ సింగ్ ఆత్మహత్య తర్వాత ఈ విషయాలపై జోరుగా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక కథనం.

సోషల్ డిమాండ్స్: ప్రతిభకు కొలమానం అదేనా?
నెపోటిజమ్

By

Published : Jun 19, 2020, 3:59 PM IST

నెపోటిజమ్, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం, వారసత్వం ఇలా పేర్లు ఏవైనా కావచ్చు ఆయా రంగాల్లో ప్రతిభ నిరూపించుకోవాలనే తపన ఉన్నా, సరైన నేపథ్యం లేని వాళ్ల పాలిట ఇవే శరాఘాతమవుతున్నాయనేది మెజారిటీ ప్రజల అభిప్రాయం. బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్​పుత్ ఆత్మహత్య నేపథ్యంలో మళ్లీ తెరపైకి వచ్చిన ఈ వాదన.. ప్రస్తుతం పెద్ద దుమారమే రేపుతోంది.

కళ విశ్వవ్యాప్తం. కానీ ప్రతిభ వ్యక్తిగతం. విజయం సాధించాలనే తపన. చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం. పట్టువిడవని పోరాటమే ఎందరినో ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతుంది. కానీ ఈ పోరాటం నడిమధ్యలోనే కొంతమంది స్వార్థపరుల కుట్రలకు అమాయకులు, సున్నిత మనస్కులు సమిధలుగా మారుతున్నారనే విషయాన్ని బలపరుస్తున్న తార్కాణాలు అనేకం. అలాంటి విశ్లేషణలకు బలం చేకూర్చేలా కొన్నిరోజులుగా నెపోటిజమ్ వాదన సామాజిక మాధ్యమాల్లో హోరెత్తుతోంది. ప్రత్యేకించి సినీ పరిశ్రమలో, ముఖ్యంగా బాలీవుడ్ లాంటి వేల కోట్ల రూపాయల విలువ చేసే మార్కెట్​లో ఓ వ్యక్తి బలమైన కుటుంబ నేపథ్యం లేకుండా నిలదొక్కుకోవటం అంటే అసాధారణమనే అభిప్రాయం ప్రజల్లో బలంగా పాతుకుపోయింది. ఇటీవలే బాలీవుడ్ యువహీరో సుశాంత్ రాజ్​పుత్ ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి పాల్పడిన వైనం మరోసారి ఈ వాదనను తెరపైకి తీసుకువచ్చింది.

ఎలాంటి నేపథ్యం లేకుండా కేవలం తన కష్టంతో ఎదిగిన సుశాంత్.. ఆత్మహత్య చేసుకునే స్థితికి వెళ్లిపోవటానికి బాలీవుడ్​లోని కొంతమంది వ్యక్తుల కుట్రపూరిత ఆలోచనలు, ఆధిపత్యధోరణి, నెపోటిజమే కారణమని సినీ ప్రేమికులు, సుశాంత్ అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. 'జస్టిస్ ఫర్ సుశాంత్ సింగ్ రాజ్​పుత్', 'బాయ్​కాట్ బాలీవుడ్' అంటూ ట్రెండ్ చేస్తున్నారు.

సుశాంత్ సింగ్ రాజ్​పుత్ మరణం వెనక దాగిఉన్న నిజానిజాలను వెలికి తీసేలా ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపించాలని కేవలం సుశాంత్ కుటుంబ సభ్యులు, బంధువులే కాదు.. దేశవ్యాప్తంగా ఎంతోమంది సామాజిక మాధ్యమాల ద్వారా కోరుతున్నారు. సుశాంత్ చేసినవి 11 సినిమాలే అయినా 'కై పోచే', 'ఎంఎస్ ధోని', 'చిచ్చోరే'లతో తనలోని అత్యుత్తమ నటనను కనబరిచాడు. అయినా అతడికి పెద్దగా ఆఫర్లు లేకపోవటం, విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలకూ అవార్డులు దక్కకపోవడం లాంటి అంశాలు సుశాంత్​ను మానసికంగా కుంగదీశాయని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

బాలీవుడ్​ను తమ గుప్పిట్లో పెట్టుకున్న కొంతమంది బడానటులు, దర్శక నిర్మాతలు, నిర్మాణ సంస్థలు సుశాంత్​కు వస్తున్న పేరును చూసి కావాలనే అతడిని లక్ష్యంగా చేశాయని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. 'కై పోచే'కు ఉత్తమ తొలిపరిచయ నటుడిగా అవార్డు రావాల్సి ఉన్నా, 'ఎంఎస్ ధోని' చిత్రంలో భారత మాజీ కెప్టెన్ పాత్రలో అందరూ ఆశ్చర్యపడేలా జీవించినా ఆత్మహత్యలు వద్దంటూ అద్భుతమైన సామాజిక సందేశాన్ని 'చిచ్చోరే' చిత్రంతో అందించినా కావాలనే వాటిని ప్రజలకు చేరువ కానీయకుండా ఆ శక్తులు అడ్డుకున్నాయని రకరకాల ఉదాహరణలతో పోస్టులను పెడుతున్నారు. ప్రత్యేకించి నెపోటిజమ్ కారణంగా యువతరం నటీనటులు ఎదుర్కొంటున్న కష్టాలు అలాగే కొనసాగితే సినీ పరిశ్రమకు ఎదురయ్యే ఇబ్బందులను స్వయంగా సుశాంతే వివరించిన వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

సుశాంత్ అభిమానులు, సినీ ప్రేమికులు సామాజిక మాధ్యమాల వేదికగా చేపట్టిన ఈ ఉద్యమంలో ప్రముఖ సినీతారలు తమ అభిప్రాయాలను ధైర్యంగా పంచుకుంటున్నారు. తానూ నెపోటిజమ్ బాధితుడనేనని ట్వీట్ చేసిన ప్రకాశ్​రాజ్, మొండి ధైర్యంతో ఆ దెబ్బల తాలుకూ గాయాలను తాను తట్టుకోగలిగినా సుశాంత్ వల్ల అది కాలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన చేతిలోని సినిమాలు లాగేసుకున్న వ్యక్తులెవరోనని అన్న సుశాంత్.. తన భుజంపై తలవాల్చి బాధపడిన విషయాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని దర్శక నిర్మాత శేఖర్ కపూర్ ట్వీట్ చేశారు. అతడు బాధలో ఉన్నాడని తెలిసినా ఆఖరి ఆరు నెలలు తనతో ఉండలేకపోయాయని ట్విట్టర్ వేదికగా ఆయన పంచుకున్నారు. మహారాష్ట్ర కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ మాట్లాడుతూ 'ఎంఎస్ ధోని' చిత్రం తర్వాత సుశాంత్ ఏడు సినిమాలకు సంతకాలు చేసినా, ఆరు నెలల్లో పలువురు వ్యక్తులు అతడి చేతిలో ఒక్క సినిమా లేకుండా చేశారని మండిపడ్డారు. ఇక నెపోటిజమ్​పై ఎప్పటినుంచో పోరాడుతున్న నటి కంగనా రనౌత్ తీవ్రస్థాయిలో తన స్వరాన్ని వినిపించింది. బాలీవుడ్​ను శాసిస్తున్న కుటుంబాలు, వ్యక్తులు, సినీ నిర్మాణ సంస్థల పేర్లతో సహా చెబుతూ ఆగ్రహం వ్యక్తం చేసింది. సుశాంత్ ఆత్మహత్య వాళ్లంతా కలిసి చేసిన హత్యగా అభివర్ణించింది.

సుశాంత్ సింగ్ రాజ్​పుత్ ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులేవైనా, నెపోటిజమ్​తో బాధపడిన సందర్భాలను అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు. అతడి పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని సినీ పరిశ్రమపై కొంతమంది వ్యక్తుల గుత్తాధిపత్యం రూపుమాపేలా యువతరానికి, బలమైన కుటుంబ నేపథ్యం లేని ప్రతిభావంతులకు సమాన అవకాశాలు కల్పించగలిగేలా ప్రక్షాళన రావాల్సిన అవసరం ఉందని నినదిస్తున్నారు. అదే సుశాంత్​కు సరైన నివాళిగా తమ స్వరాన్ని బలంగా వినిపిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details