దర్శకులు కథలతో సిద్ధంగా ఉండాలి కానీ నందమూరి బాలకృష్ణ విరామం లేకుండా సినిమాలు చేస్తారు. వేగంలో ఆయనకు ఆయనే సాటి. బరిలోకి దిగారంటే మెరుపు వేగంతో సినిమాలు పూర్తవ్వాల్సిందే. ఒక పక్క రాజకీయాలతో బిజీగా గడుపుతున్నా సరే... సినిమాలతో క్రమం తప్పకుండా అభిమానుల్ని అలరిస్తుంటారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్న బాలయ్య కోసం కొత్తగా రెండు కథలు సిద్ధంగా ఉన్నాయి.
నందమూరి బాలకృష్ణ.. బరిలో దిగితే! - balakrishna latest news
అగ్రకథానాయకుడు బాలకృష్ణ కోసం రెండు కొత్త కథలు సిద్ధంగా ఉన్నాయి. వాటిలో ఒకటి మల్టీస్టారర్.. అందులో యువహీరో నాగశౌర్యతో కలిసి బాలయ్య నటించనున్నట్లు తెలిసింది.
అందులో ఒకటి ఇద్దరు కథానాయకులు కలిసి చేసే సినిమా. ఓ కొత్త దర్శకుడు సిద్ధం చేసిన ఆ కథలో బాలకృష్ణతోపాటు, నాగశౌర్య నటిస్తారని తెలిసింది. 'బలరామయ్య బరిలో దిగితే..' పేరుతో మరో కథ కూడా ఆయన కోసం సిద్ధమైంది. సంతోష్ శ్రీనివాస్ సిద్ధం చేసిన కథ అది.
బాలకృష్ణ - సంతోష్ శ్రీనివాస్ కలయికలో ఈ కథను తెరపైకి తీసుకెళ్లేందుకు ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ కథలకు బాలయ్య పచ్చజెండా ఊపేసి బరిలోకి దిగారంటే అభిమాన వర్గాల్లో కావల్సినంత సందడి నెలకొనడం ఖాయం.