తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సినిమాలు వదిలేద్దామనుకున్నా.. నాగ్​ అండగా నిలిచారు'

Nagarjuna Bangarraju movie: గడిచిన నాలుగేళ్లలో చాలా ఒడుదొడుకులను ఎదుర్కొన్నట్లు గుర్తుచేసుకున్నారు దర్శకుడు కల్యాణ్​కృష్ణ. ఆ సమయంలో సినిమాలు వదిలేద్దామన్నా ఆలోచన వచ్చిందని, అప్పుడు హీరో నాగార్జున తనకు అండగా నిలిచారని అన్నారు. ఆయన దర్శకత్వం వహించిన 'బంగార్రాజు' సినిమా జనవరి 14న రిలీజ్​ కానుంది. ఈ సందర్భంగా కెరీర్​ సహా చిత్ర విశేషాలను తెలిపారాయన. ఆ సంగతులను చూసేద్దాం..

bangarraju release date
బంగార్రాజు రిలీజ్​ డేట్​

By

Published : Jan 9, 2022, 6:41 AM IST

Nagarjuna Bangarraju movie: "ఉరుకులు పరుగులుగా వరుస సినిమాలు చేయాలని నాకేమీ తొందర లేదు. అలా చేస్తే నాణ్యమైన చిత్రాలు రావు. అందుకే కాస్త నిదానంగానైనా సరే మంచి చిత్రాలే చేయాలనుకుంటున్నా" అన్నారు కల్యాణ్‌కృష్ణ కురసాల. 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రంతో తొలి ప్రయత్నంలోనే అందరి దృష్టినీ ఆకర్షించిన దర్శకుడాయన. ఇప్పుడా సినిమాకు సీక్వెల్‌గా 'బంగార్రాజు'ను రూపొందించారు. నాగార్జున, నాగచైతన్యతో కలిసి నటించిన చిత్రమిది. నాగ్‌ సరసన రమ్యకృష్ణ నటించగా.. చైతన్యకు జోడీగా కృతి శెట్టి నటించింది. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు కల్యాణ్‌కృష్ణ. ఆ సంగతులు ఆయన మాటల్లోనే..

"2014 జనవరిలో తొలిసారి 'సోగ్గాడే చిన్ని నాయనా' స్క్రిప్ట్‌తో నాగార్జునను కలిశా. ఆయనకు కథ నచ్చడం వల్ల వెంటనే సినిమా పట్టాలెక్కించి.. 2016 జనవరిలో విడుదల చేశాం. అదే సమయంలో దీనికి సీక్వెల్‌గా 'బంగార్రాజు'ను తీసుకురావాలన్న ఆలోచన వచ్చింది. మేమీ ప్రాజెక్ట్‌ను మొదటి నుంచీ నాగచైతన్యతోనే చేయాలని అనుకున్నాం. అయితే నాగార్జున ఈ సీక్వెల్‌ చేయడానికి ముందు చైతన్యతో ఓ సోలో సినిమా చేయమని అడిగారు. దాంతో మా ఇద్దరి కలయికలో 'రారండోయ్‌ వేడుక చూద్దాం' చేశాం. ఆ తర్వాత చైతూ బిజీ అవ్వడం వల్ల.. నేను రవితేజతో 'నేల టిక్కెట్‌' చేశాను. దాని తర్వాత నుంచి పూర్తిగా 'బంగార్రాజు' స్క్రిప్ట్‌పైనే పనిచేశాను. ఈ కథ కుదరడానికి కాస్త సమయం పట్టడం.. ఈలోపు కొవిడ్‌ పరిస్థితుల వల్ల వరుస లాక్‌డౌన్‌లు రావడం వల్ల ప్రాజెక్ట్‌ కాస్త ఆలస్యమైంది".

'బంగార్రాజు' కథ ఇదే..

"సోగ్గాడే చిన్ని నాయనా సినిమా ఎక్కడైతే ముగిసిందో.. 'బంగార్రాజు' కథ అక్కడి నుంచే మొదలవుతుంది. లావణ్య త్రిపాఠి పాత్ర మినహా తొలి భాగంలో ఉన్న పాత్రలే కంటిన్యూ అవుతాయి. మూడు తరాల పాత్రల మధ్య కథ సాగుతుంటుంది. నాగచైతన్య పెద్ద బంగార్రాజు మనవడుగా కనిపిస్తారు. నాగార్జున, చైతన్య పాత్రలకు సమ ప్రాధాన్యం ఉంటుంది. ఇందులో రమ్యకృష్ణ, కృతిశెట్టి ప్రధాన నాయికలుగా నటించగా.. మీనాక్షి దీక్షిత్‌, వేదిక, దర్శన, ఫరియా, దక్ష నగార్కర్‌, సిమ్రత్‌ కౌర్‌ కీలక పాత్రలు పోషించారు"

అదే అసలు సవాల్‌..

"ఈ చిత్ర విషయంలో నాకు సవాల్‌ అనిపించినది సమయమే.ఆగస్ట్‌లో చిత్రీకరణ ప్రారంభించాం. సంక్రాంతి కల్లా సినిమా సిద్ధం చేయాలనుకున్నాం. సమష్టి కృషి వల్లే ఇంత తక్కువ సమయంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాగలుగుతున్నాం. గ్రాఫిక్స్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంది. 35 నిమిషాలు గ్రాఫిక్స్‌ ఉంటాయి".

ఆ ఆలోచన లేదు

"బంగార్రాజు’కు కొనసాగింపుగా మరో చిత్రం చేయాలన్న ఆలోచన ఇప్పటికైతే లేదు. గడిచిన నాలుగేళ్లలో చాలా ఒడుదొడుకులు ఎదుర్కొన్నా. ఆ సమయంలో సినిమాలు వదిలేద్దామన్నా ఆలోచన వచ్చింది. ఇంట్లో వాళ్లు నన్ను కూర్చోబెట్టి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. నాగార్జున నాకెంతో మద్దతుగా నిలిచారు. 'నువ్వలాంటి నిర్ణయం తీసుకోకు' అని చెప్పారు. స్టూడియో గ్రీన్‌ నిర్మాణంలో తర్వాతి సినిమా ఉంటుంది"

ఇదీ చూడండి: 'లయన్'​ బాలయ్యతో 'లైగర్'​.. సంక్రాంతికి గర్జన

ABOUT THE AUTHOR

...view details