ఇది వరకు తమన్ అంటే... ఫాస్ట్ బీట్ గీతాలే గుర్తొచ్చేవి. ఇప్పుడు రూటు మార్చి మెలోడీకి అధిక ప్రాధాన్యం ఇస్తూ సినిమాలు చేస్తున్నాడు. సంగీత ప్రపంచంలో ఇటీవల కాలంలో అతడిదే హవా. ఈ నెలలో విడుదలవుతున్న రెండు పెద్ద చిత్రాలు 'వెంకీమామ', 'ప్రతిరోజూ పండగే'లకు సంగీతం అందించింది తమనే. సంక్రాంతికి రానున్న 'అల వైకుంఠపురములో' చిత్రానికీ అతడే స్వరాలు సమకూరుస్తున్నాడు. 'వెంకీమామ' ఈనెల 13న విడుదలవుతోంది. ఈ సందర్భంగా తమన్ చెప్పిన ముచ్చట్లివీ.
ఈ మధ్య జోరు పెంచినట్టున్నారు?
అవును. వైవిధ్యమైన కథలు వస్తున్నాయి.
మీరు బాణీలు స్వరపరిచే విధానం కూడా మారినట్టుంది?
అవును. 'సరైనోడు' తర్వాత ఏడాది పాటు విరామం తీసుకున్నాను. ఎలాంటి సినిమాలు చేయాలి? ఎలాంటి పాటలు చేయాలి? అనే విషయంలో నాలో నేను తర్జన భర్జనలు పడ్డాను. 'మహానుభావుడు', 'తొలిప్రేమ' చిత్రాలతో నా సంగీతంలో మార్పు కనిపించింది.
విమర్శల్ని మీరు ఎలా స్వీకరిస్తారు?
పొగిడేవాళ్లే కాదు.. తిట్టేవాళ్లూ ఉండాలి. ఎవరూ ఊరికే తిట్టరు కదా? వాళ్లని మెప్పించడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. చిన్నప్పుడు అమ్మ తిట్టకపోతే మనం తప్పుల్ని సరిదిద్దుకునే వాళ్లమా?
'వెంకీమామ'లో మిమ్మల్ని ఆకట్టుకున్న అంశాలేంటి?
ఇప్పుడు నేను చేస్తున్న 'వెంకీమామ', 'ప్రతిరోజూ పండగే', 'అల.. వైకుంఠపురములో' ఇవన్నీ చాలా మంచి కథలు. 'వెంకీమామ'తో అయితే చాలా అనుబంధం పెంచుకున్నా. ఆర్.ఆర్, ఎలాంటి ఎఫెక్ట్స్ లేకుండా సినిమా చూస్తున్నప్పుడే నన్ను చాలా కదిలించేసింది. "ఈ సినిమా ఇలానే ఇవ్వు.. నేను మంచి ఆర్.ఆర్ ఇస్తా" అని దర్శకుడు బాబితో చెప్పాను. వెంకీ, చైతూ పోటీ పడి నటించారు. నిజ జీవితంలో వాళ్ల అనుబంధం ఎంత బలంగా ఉంటుందో తెరపై కనిపిస్తుంది.