హైదరాబాద్ మహానగరంలో సినిమా థియేటర్ల తీరు మారబోతోంది. కరోనా వ్యాప్తి చెందకుండా థియేటర్లలో అనేక చర్యలు తీసుకునేందుకు యజమానులు సిద్ధమయ్యారు. తిరిగి సినిమా ప్రదర్శనలు మొదలైతే థియేటర్‌లో ఓ సీటు వదిలి మరో సీటులో కూర్చునే విధానాన్ని రూపొందిస్తున్నారు. రెండురోజుల్లో నగరంలోని ఓ ప్రముఖ థియేటర్లో ఈ విధానాన్ని ప్రదర్శించాలని అనుకుంటున్నారు. ఈ వైరస్ నేపథ్యంలో రెండు రోజుల క్రితం జంటనగరాల్లోని దాదాపు వందమంది థియేటర్ యజమానులు వీడియో కాన్ఫరెన్సు ద్వారా తమ సమస్యలపై చర్చించుకున్నారు. ప్రభుత్వం ప్రదర్శనలకు అనుమతి ఇవ్వడానికి ముందే థియేటర్లలో వైరస్ నిరోధానికి తమంతట తామే కొన్ని చర్యలు తీసుకుని ప్రభుత్వ పెద్దలను కలిసి నివేదికను అందజేయాలని నిర్ణయించుకున్నారు.
ఇవీ చేయబోయే మార్పులు
- ఆన్‌లైన్‌లో టికెట్లను బుక్ చేసుకున్నప్పుడే ఓ సీటు తర్వాత మరో సీటు అందుబాటులో ఉండకుండా సాంకేతిక మార్పులు చేయబోతున్నారు. ఒకటో నంబరు సీటు బుక్ చేసుకుంటే రెండో నంబరు ఆన్‌లైన్‌లో కనిపించదు. ప్రభుత్వం అనుమతిస్తే మాత్రం ఒక కుటుంబంలోని వ్యక్తులకు ఒకేచోట సీట్లు కావాలంటే కేటాయించే అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారు.
- ప్రతి ఆట ముగియగానే అన్ని సీట్లను శానిటైజ్ చేసి ఎర్ర రిబ్బన్ పెడతారు. సాధారణంగా ఓ ఆట పూర్తయిన పది నిమిషాల్లోనే మరో షో మొదలవుతోంది. ఇకముందు 45 నిమిషాల తర్వాతే మొదలుపెడతారు. దీన్నిబట్టి రోజుకు నాలుగు ఆటలకు బదులు మూడే ప్రదర్శించే అవకాశం ఉంటుందని థియేటర్ యజమాని ఒకరు తెలిపారు.
- కాగితం రూపంలో టిక్కెట్లు ఇచ్చే విధానాన్ని పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయించారు. ఇక క్యూఆర్‌కోడ్‌తో టికెట్‌ను సెల్‌ఫోన్‌కు పంపిస్తారు. దీన్ని స్కాన్ చేసి హాలు లోపలికి పంపిస్తారు.
- తినుబండారాల స్టాల్స్ వద్ద, మరుగుదొడ్ల దగ్గర, భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆవరణలో ఎక్కడా గుమిగూడకుండా చర్యలు తీసుకుంటారు.
- ఇవే కాకుండా ప్రభుత్వం సూచించే అన్ని నిబంధనల అమలుకు కార్యాచరణ రూపొందిస్తారు.