చిరంజీవి మంచి నటుడు, అద్భుతంగా డ్యాన్స్ చేస్తాడని సీనియర్ నటుడు మంచు మోహన్‌బాబు అన్నారు. బాలకృష్ణ తొలిసారి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న షో 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే'(balakrishna unstoppable show). తెలుగు ఓటీటీ 'ఆహా'లో ఈ షో ప్రసారమవుతోంది. దీపావళి సందర్భంగా బాలకృష్ణ తొలి ఇంటర్వ్యూను మోహన్‌బాబు(mohan babu balakrishna)తో చేశారు. ఈ సందర్భంగా బాలయ్య అడిగిన పలు ప్రశ్నలకు మోహన్‌బాబు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. అంతేకాదు, మోహన్‌బాబు కూడా బాలకృష్ణను ఎదురు ప్రశ్నించి సమాధానాలు రాబట్టారు. మధ్యలో మంచు విష్ణు, మంచు లక్ష్మి సందడి చేశారు.
అందుకే చిరంజీవి బాగున్నాడు!
షోలో భాగంగా 'చిరంజీవిపై మీకున్న అభిప్రాయం ఏంటి?' అని మోహన్‌బాబును అడగ్గా 'చిరంజీవి(mohan babu about chiranjeevi) మంచి నటుడు, అద్భుతంగా డ్యాన్స్ చేస్తాడు. వ్యక్తిగతంగా అతనిపై ఎలాంటి చెడు అభిప్రాయం లేదు. అల్లు రామలింగయ్యగారి కుమార్తె సురేఖను పెళ్లి చేసుకున్నాడు. ఆయనతో కలిసి ఎన్నో సినిమాలు చేశా. సురేఖ నాకు సోదరిలాంటిది. అంటే మన ఇంటి అమ్మాయిని చిరంజీవి(mohan babu about chiranjeevi) పెళ్లి చేసుకున్నాడు. కాబట్టే అతను బాగున్నాడు' అని సమాధానం ఇచ్చారు. ఇక మద్యం సేవించే అలవాటుపై మోహన్‌బాబు మాట్లాడుతూ.. 'మద్రాసులో ఉన్న రోజుల్లో కోడంబాకం బ్రిడ్జ్ కింద సారా దుకాణాలు ఉండేవి. ఒక స్నేహితుడితో కలిసి వెళ్లి అక్కడ సారా తాగేవాడిని. ఆ విధంగా జీవితం ప్రారంభమై, లేని రోజుల్లోనూ తాగాను. ఇప్పుడు భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి మంచి విస్కీ తాగుతున్నా' అని అన్నారు.
ఆ మాట చెప్పిన గొప్ప మనిషి ఎన్టీఆర్
'మీరు నటించిన సినిమాల్లో అస్సలు చూసుకోలేని సినిమా ఏది' అని బాలకృష్ణ అడిగితే, ''‘పటాలం పాండు' చేసిన తర్వాత నా భార్య నిర్మల వారం రోజులు మాట్లాడలేదు' అని చెప్పారు. తన బ్యానర్‌లో వరుసగా సినిమాలు ఫ్లాప్ అయితే, మహాబలిపురంలో భూములు అమ్మి అందరికీ డబ్బులు చెల్లించినట్లు మోహన్‌బాబు తెలిపారు. ఆ తర్వాత 'అల్లుడుగారు', 'అసెంబ్లీ రౌడీ', 'బ్రహ్మ', 'పెదరాయుడు' వరుస విజయాలతో నిలబడ్డానని వివరించారు. 'సక్సెస్ ఈజ్ పబ్లిక్ అఫైర్.. ఫెయిల్యూర్ ఈజ్ పర్సనల్ ఫ్యునరల్' అన్నట్లు తనకు తానుగా ఇబ్బంది పడ్డాను తప్ప ఎవరూ సాయం చేయలేదని గంభీర స్వరంతో చెప్పారు. 'అన్నయ్యా.. మీతో కలిసి సినిమా చేస్తా' అని అడిగితే 'రాజకీయాల్లో ఫెయిల్ అయ్యాను. నా సినిమాలు ఎవరు చూస్తారు. అనవసరంగా డబ్బులు పోగొట్టు కోవద్దు' అని సలహా ఇచ్చిన గొప్ప మనిషి ఎన్టీఆర్(mohan babu ntr movie) అని మోహన్‌బాబు చెప్పారు.
క్రమశిక్షణ లేదని బయటకు పంపారు
'చంద్రబాబు(mohan babu chandrababu naidu) మాట విని అన్నయ్యను కాదనుకుని వచ్చాను. ఆ తర్వాత స్నేహితుడు రజనీకాంత్‌తో వెళ్లి కలిసినప్పుడు 'మోహన్‌బాబూ.. నువ్వు కూడానా' అని అన్నయ్య ఎన్టీఆర్ అనేసరికి నోట మాట రాలేదు. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకు క్రమశిక్షణ లేదని చంద్రబాబు నన్ను బయటకు పంపారు అని చెప్పుకొచ్చారు. 'అవునూ, ఎన్టీఆర్ తర్వాత మీరెందుకు తెదేపా పగ్గాలు చేపట్టలేదు' అంటూ బాలకృష్ణని, మోహన్‌బాబు ఎదురు ప్రశ్నించారు. 'అప్పట్లో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఇలా వారసత్వ రాజకీయాలు నడుస్తున్నాయి. దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం. ఆ సమయంలో వంశపారంపర్య రాజకీయాలు మనమే చేస్తే బాగుండదు. పార్టీ అనేది ప్రజల కోసం నిలబడాలి' అని బాలకృష్ణ బదులిచ్చారు. చంద్రబాబు కూడా పంచాయతీ స్థాయి నుంచి పైకి ఎదిగిన వ్యక్తనీ, మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయనీ బాలకృష్ణ తెలిపారు.