'శివమణి' సినిమాలో నాగార్జున ఫోన్ నంబరు అనుకుని హాస్యనటుడు ఎంఎస్ నారాయణకు కొంతమంది విపరీతంగా కాల్స్ చేస్తారు. ప్రతి ఒక్కరూ 'శివమణి ఉన్నాడా?' అని అడుగుతూ ఉంటారు. ఆ నంబరు శివమణిది కాదు తనదే అని ఎంఎస్ ఎంత చెప్పినా వినిపించుకోరు. దాంతో విసిగిపోయిన అతడు చివరికు, శివమణిని తానే చంపేసినట్లు కాల్స్ చేసిన వారికి చెబుతాడు. నటి రియా చక్రవర్తి విషయమై ఇలాంటి సన్నివేశమే ముంబయికి చెందిన ఓ వ్యక్తికి ఎదురైంది.
సీన్ రిపీట్
సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి అనుకుని ఓ వ్యక్తికి విపరీతంగా కాల్స్ చేస్తున్నారు. కొందరైతే సందేశాల్లోనే దూషిస్తున్నారు. తాను రియాను కాదని ఎంత చెప్పినా వినకుండా, తనను కాలర్స్ విసిగిస్తున్నారని ముంబయికి చెందిన ఓ వ్యక్తి మొరపెట్టుకున్నాడు. ఇప్పటివరకు తన మొబైల్లో దాదాపు 150 నంబర్లను బ్లాక్‌లిస్టులో పెట్టినట్లు ఓ పత్రికకు వివరించాడు.
రియా ఉందా?
ముంబయి మిర్రర్ నివేదిక ప్రకారం.. రియా నంబరుకు బాధితుడి చరవాణి నంబరుకు కేవలం ఒక అంకె తేడా. దీంతో పొరపాటున ఆమె నంబర్ అనుకుని ఈ వ్యక్తికి చేస్తున్నారు. వారం రోజుల నుంచి అసభ్యకర సందేశాలు పంపిస్తున్నారు. ఫలితంగా అతడు తన చరవాణిని స్విచ్ఛాఫ్ చేయాల్సి వచ్చింది.
"గత కొన్నిరోజులుగా 'రియా ఉందా?' అని ఫోన్లు వస్తున్నాయి. బాలీవుడ్ నటి రియా కోసం చేస్తున్నారని నాకు మొదట అర్థం కాలేదు. కానీ, కొన్ని రోజుల తర్వాత ఆమె కోసమేనని గుర్తించాను. కొందరి నుంచి అసభ్యకర సందేశాలతో పాటు వాట్సప్ వీడియోకాల్స్ వస్తున్నాయి. రాంగ్ నంబర్ అని చెప్పినా.. నా ఫొటో ఒకసారి పంపమని కాలర్స్ అంటున్నారు. అప్పటి నుంచి కాల్స్‌ను పట్టించుకోలేదు. అలా నాకు విసుగు వచ్చేసింది" అని బాధితుడు వెల్లడించాడు.
నంబరు అలా తెలిసింది
ఓ టీవీ ఛానెల్లో రియా, సుశాంత్‌లకు సంబంధించిన కాల్ రికార్డింగ్స్, వాట్సప్ చాటింగ్‌లు ప్రసారం చేశారని తెలుస్తోంది. అందులో కనిపించిన రియా నంబరుకు బాధితుడి చరవాణి నంబరుకు ఒక్క సంఖ్య తేడా ఉంది. దానిని గమనించిన పలువురు నెటిజన్లు.. హీరోయిన్ అనుకుని అతడికి కాల్స్ చేయడం మొదలుపెట్టారు.