ప్రతిభ ఉన్నవారిని సినీపరిశ్రమ పట్టించుకోవట్లేదని విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పేయీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల బాలీవుడ్ యువ కథానాయకుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత బాలీవుడ్‌లో బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం, ప్రతిభకు ప్రోత్సాహమేదనే అంశాలు మరోసారి చర్చకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా వచ్చి ప్రతిభతో ఆకట్టుకున్న పలువురు సినీ ప్రముఖులు బాలీవుడ్‌లో జరుగుతున్న వ్యవహారం గురించి తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఈ క్రమంలో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని రాణిస్తున్న మనోజ్ బాజ్‌పేయీ కూడా ప్రతిభ గల నటులకు పరిశ్రమలో స్థానం గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
"ప్రతిభావంతులు కనిపించగానే వారిని నిర్లక్ష్యం చేయడమో.. పక్కన పెట్టేయడమో జరుగుతోంది. సినీ పరిశ్రమ ప్రతిభను వృథా చేస్తోంది. ఇక్కడ తమ ప్రతిభకు ప్రోత్సాహం లభించని వారు ఇతర దేశాల్లో అంతర్జాతీయ నటులుగా గుర్తింపు పొందుతున్నారు. అయినా మనం వారిని పట్టించుకోవట్లేదు. ప్రతిభ లేకున్నా సినీ పరిశ్రమలో ఉన్నారంటే వారు అదృష్టవంతులే. నేను ఎవర్నీ కించపర్చట్లేదు. నేనూ సినీ పరిశ్రమలో భాగమే. ఇది వరకు నేను చాలా ఇంటర్వ్యూల్లో చెప్పా. ఈ విషయంపై పరిశ్రమ మళ్లీ ఒకసారి పునఃసమీక్ష చేసుకోవాల్సిన అవసరముంది. లేకపోతే సామాన్యుల వద్ద సినీ పరిశ్రమ గౌరవం కోల్పోతుంది."