తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'మన్మథుడు 2' పోర్చుగల్ షెడ్యూల్ పూర్తి

నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధానపాత్రల్లో నటిస్తోన్న చిత్రం 'మన్మథుడు 2'. ప్రస్తుతం పోర్చుగల్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. వీలైనంత త్వరగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తోందట చిత్రబృందం.

మన్మథుడు

By

Published : May 14, 2019, 5:30 AM IST

Updated : May 14, 2019, 6:58 AM IST

వేగంగా సినిమాలను తెరకెక్కించే దర్శకుల జాబితాను తిరగేస్తే తెలుగులో తొలుత అందరికీ గుర్తొచ్చే పేరు పూరి జగన్నాథ్‌దే. ఎంత పెద్ద స్టార్‌ హీరోతో చేసినా సరే రెండు మూడు నెలల్లో చిత్రీకరణకు గుమ్మడికాయ కొట్టేయగలడు పూరి. ఇప్పుడిదే బాటలో నడుస్తున్నాడు ఓ యువ దర్శకుడు. 'అందాల రాక్షసి'తో నటుడిగా వెండితెరపై మెరిసి.. 'చిలసౌ' చిత్రంతో దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే ఓ భారీ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు రాహుల్‌ రవీంద్రన్‌. తాజాగా నాగార్జునతో ఈ యువ దర్శకుడు తెరకెక్కిస్తున్న చిత్రం 'మన్మథుడు 2'. ’

నెలన్నర క్రితమే పోర్చుగల్‌లో చిత్రీకరణ మొదలై అక్కడి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది ఈ చిత్రం. ఈ నేపథ్యంలోనే సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర అంశం బయటకొచ్చింది. ఈ ప్రాజెక్టు ఇటీవలే పట్టాలెక్కడంతో చిత్రీకరణ పూర్తయి తెరపైకి రావడానికి కనీసం ఓ ఐదు నెలల సమయమైనా అవసరమవుతుందని అంతా భావించారు. ఇక సరైన తేదీలు దొరికితే ఏ దసరాకో, క్రిస్మస్‌కో ఈ కొత్త బొమ్మ తెరపై చూడొచ్చనుకున్నారు. కానీ, తాజా సమాచారం ప్రకారం ఇంతకన్నా ముందుగానే 'మన్మథుడు 2' బాక్సాఫీస్‌ వద్ద సందడి చేయబోతున్నాడట.

ఆగస్టులో 'సైరా నరసింహారెడ్డి', నాని 'గ్యాంగ్‌ లీడర్‌', బన్నీ - త్రివిక్రమ్‌ల సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జులైలో పెద్దగా పోటీ వాతావారణం ఉండదు. కాబట్టి ఈ నెలలోనే ‘మన్మథుడు 2’ను థియేటర్లలోకి తీసుకురావాలని ప్రణాళికలు రచిస్తున్నాడట రాహుల్‌. నాగ్‌ ఆలోచన కూడా ఇదేనట. ఇందుకు తగ్గట్లుగానే చిత్రీకరణను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. ఒకవేళ ఇదే నిజమైతే.. నాగ్‌ అభిమానులకు ఇదొక సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ అని చెప్పుకోవచ్చు. రాహుల్‌ తన తొలి సినిమా 'చిలసౌ'ను కేవలం నెల రోజుల్లోనే తెరకెక్కించడం విశేషం.

ఇవీ చూడండి.. కథలో చాలా మార్పులు చేశాం: శిరీష్

Last Updated : May 14, 2019, 6:58 AM IST

ABOUT THE AUTHOR

...view details