"వలస కూలీల కష్టాలు కన్నీళ్లు తెప్పించాయి. మనమంతా వాళ్లకి అండగా నిలవాల్సిన సమయమిది. బుధవారం నుంచి వాళ్ల కోసం బస్సులు ఏర్పాటు చేసి ఇళ్లకి పంపించే బాధ్యతని తీసుకున్నా" అన్నారు కథానాయకుడు మంచు మనోజ్. బుధవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా మనోజ్ ముచ్చటించారు.
- ప్రతిసారీ నా పుట్టినరోజుని అభిమానుల మధ్యే జరుపుకుంటుంటా. కానీ ఈసారి మన తోటి మనుషులు కష్టాల్లో ఉన్నారు. ఇలాంటి సమయంలో పది మందికి సాయం చేయాలి. వలస కూలీల వ్యథలు చూసి మనసు చలించింది. హైదరాబాద్‌లో ఇరుక్కుపోయిన కూలీల కోసం బస్సులు పెట్టి, అనుమతులు తీసుకుని, వారికి ఆహారం అందించి ఇంటికి పంపే బాధ్యతని తీసుకున్నా.
- లాక్‌డౌన్ విరామంలో 'అహం బ్రహ్మాస్మి' కోసం కత్తి ఫైటు, కర్ర ఫైటు సాధన చేస్తున్నా. ఈ చిత్రం కోసం తొలిసారి పీటర్ హెయిన్స్‌తో కలిసి పని చేస్తున్నా. ఫైట్ల కోసమే యాభై రోజులు కేటాయించాం.
- మనందరిలోనూ దేవుడున్నాడు, తట్టి మేల్కొలపాలంతే అని చెప్పే చిత్రం 'అహం బ్రహ్మాస్మి'. ఒక మనిషిలో అన్ని రకాల కోణాలుంటాయి. కానీ, దేన్ని బయటకు తీసుకొస్తాడనేదే ముఖ్యం. అదే ఇందులో చూపించబోతున్నాం. ప్రస్తుతం ఈ సినిమాపైనే నా దృష్టంతా. దీని తర్వాతే మరో చిత్రం గురించి ఆలోచిస్తా.