తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నటనలో గట్టి.. మలయాళ మమ్ముట్టి

తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో దాదాపు 400కు పైగా చిత్రాల్లో నటించి సినీ ప్రియుల మదిలో సూపర్​ స్టార్​గా చెరగని ముద్ర వేశారు మమ్ముట్టి. నేడు ఈ విలక్షణ నటుడి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన జీవితంపై ప్రత్యేక కథనం మీకోసం.

Mammutti
మమ్ముట్టి

By

Published : Sep 7, 2020, 5:22 AM IST

తెలుగు చిత్ర ప్రేక్షకులకు మమ్ముట్టి పేరు సుపరిచితమే. తెలుగులో ఈయన చేసిన సినిమాలు నాలుగంటే నాలుగే. అందులో ఒకటి విడుదలకు కూడా నోచుకోలేదు. అయినప్పటికీ, తెలుగు ప్రేక్షకులకు మమ్ముట్టి పేరు బాగా తెలుసు. నాలుగు దశాబ్దాల సినిమా కెరీర్​లో 400 చిత్రాలకు పైగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. మలయాళ సినిమాల్లో ఎక్కువగా నటించిన మమ్ముట్టి అడపాదడపా తమిళ, తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లీష్‌ ప్రేక్షకులను కూడా పలకరించారు.

కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'స్వాతి కిరణం' అనే సినిమాతో టాలీవుడ్​కు పరిచయమైన మమ్ముట్టి ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల ఆదరణను పొందగలిగారు. ఈ విలక్షణ నటుడి పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన వ్యక్తిగత జీవితంతో పాటు సినీ కెరీర్​పై ఆసక్తికర అంశాలు కొన్ని మీకోసం.

కుటుంబ నేపథ్యం

మమ్ముట్టి అసలు పేరు మహ్మద్‌ కుట్టి ఇస్మాయిల్‌ పెనిపరంబిల్‌. ట్రావెన్​కోర్ (ఇప్పటి కేరళ)లో 1951 సెప్టెంబర్‌ 7న జన్మించారు. ముస్లిం మధ్య తరగతి కుటుంబానికి చెందినవారు మమ్ముట్టి. తండ్రి ఇస్మాయిల్‌ సామాన్య రైతు. తల్లి ఫాతిమా గృహిణి. మమ్ముట్టి ఈ దంపతులకు పెద్ద కుమారుడు. ఈయనకు ఇద్దరు సోదరులు, ముగ్గురు సోదరీమణులు ఉన్నారు. మమ్ముట్టి ప్రాథమిక విద్య కొట్టాయంలో కులశేఖర మంగళం అనే ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగింది. ఆ తరువాత ఎర్నాకులం ప్రభుత్వ పాఠశాలలో చదివారు. ప్రీ డిగ్రీ విద్యను సెక్రెడ్‌ హార్ట్‌ కళాశాలలో, మహారాజస్‌ కాలేజీలో డిగ్రీ విద్యను అభ్యసించారు. ఎర్నాకులంలోని ప్రభుత్వ లా కళాశాలలో ఎల్‌.ఎల్‌.బి విద్యను అభ్యసించారు. మంజేరిలో రెండు సంవత్సరాల పాటు లా ప్రాక్టీస్‌ చేశారు.

వివాహం

మమ్ముట్టి భార్య పేరు సల్ఫాత్‌. 1979లో వీరికి వివాహమైంది. వీరికి ఒక కుమార్తె సురుమి, ఒక కుమారుడు దుల్కర్‌ సల్మాన్‌ ఉన్నారు. 'ఓకే బంగారం', 'మహానటి' సినిమాల్లో నటించిన దుల్కర్‌ సల్మాన్‌ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. మమ్ముట్టి సోదరుడు ఇబ్రహీం కుట్టి కూడా మలయాళ టీవీ సీరియల్స్​లో, సినిమాల్లో నటించారు. ఈయన కుమారుడు మఖ్బూల్‌ సల్మాన్‌ కూడా నటుడే.

ఇండస్ట్రీలోకి ఎంట్రీ

మమ్ముట్టి కుటుంబానికి సినీ నేపథ్యం లేదు. కానీ, సినిమాల్లో నటించాలన్న లోతైన కోరిక ఎలా వచ్చిందో మమ్ముట్టికి కూడా తెలియదట. ఈ పరిశ్రమలో తనని తాను నిరూపించుకోవాలని ఎప్పుడూ అనుకునే వారట మమ్ముట్టి. ఈ రోజు పరిశ్రమలో ఇంతటి స్థాయిని చేరుకుంటారని కలలో కూడా అనుకోలేదట. సమాజంలో మార్పులు తీసుకొచ్చే శక్తి నటుడికి ఉందన్నది మమ్ముట్టి విశ్వాసం. అందుకే సినిమాల్లోకి వచ్చానని అంటారు మమ్ముట్టి. కళాశాలలో చదువుతున్నప్పుడే 'అనుభవంగల్‌ పాలిచకల్‌' అనే సినిమాలో తొలిసారి స్కీన్ర్‌ పై కనిపించారు. ఈ సినిమా తరువాత కె.నారాయణన్‌ దర్శకత్వంలో 'కాలచక్రం' అనే సినిమాలో ఓ పాత్రని పోషించారు. ఆ తర్వాత ఎం.టీ.వాసుదేవన్‌ నాయర్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'దేవలోకం' సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు. అయితే, ఈ సినిమా ఇప్పటికీ రిలీజ్‌ కాలేదు.

'థ్రిష్ణ'తో మొదటి విజయం

వాసుదేవన్‌ రచయితగా ఆజాద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'విల్కనుండు స్వప్నంగల్‌' అనే సినిమాలో మమ్ముట్టి పోషించిన పాత్రకు ప్రత్యేక గుర్తింపు లభించింది. కెజీ జార్జ్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన 'మేళ' సినిమాలో ఓ సర్కస్‌ ఆర్టిస్ట్, ఐ.వి.శశి డైరెక్షన్‌లో రూపుదిద్దుకున్న 'థ్రిష్ణ' సినిమాలో దాస్‌ పాత్రలో మమ్ముట్టి నటనకు ఎంతో పేరు వచ్చింది. హీరోగా ఆయన పెద్ద హిట్‌ అందుకున్న సినిమా ఇది.

ఆ తరువాత శశి, మమ్ముట్టి కాంబినేషన్‌లో 'ఇన్స్పెక్టర్‌ బలరాం' వంటి ఎన్నో విజయవంతమైన సినిమాలు వచ్చాయి. 'యవనిక' అనే ఇన్వెస్టిగేటివ్‌ థ్రిలర్‌లో పోలీసు అధికారి పాత్రలో మమ్ముట్టి నటించారు. మలయాళ సినిమా పరిశ్రమలో హీరోగా మమ్ముట్టికి సుస్థిర స్థానం అందించిన సినిమా ఇది.

5 సంవత్సరాలలో 150 సినిమాలకు పైగా

ఏ హీరో దక్కించుకోని ఘనత మమ్ముట్టికి దక్కింది. 1982 నుంచి 1986 వరకు.. ఈ ఐదేళ్లలో మమ్ముట్టి హీరోగా ఏకంగా 150 సినిమాల్లో నటించారు. ఆశ్చర్యంగా.. ఒక్క 1986 లోనే మమ్ముట్టి హీరోగా నటించిన 35 సినిమాలు రిలీజ్‌ అయ్యాయి.

సినీ కెరీర్‌ డీలా

1980 దశకంలో మమ్ముట్టి కెరీర్‌ కాస్త తగ్గుముఖం పట్టిందని చెప్పాలి. చాలా చిత్రాల్లో మమ్ముట్టి ఫ్యామిలీ మ్యాన్​గా, వ్యాపార వేత్తగా నటించారు. 1987లో విడుదలైన 'న్యూ దిల్లీ' చిత్రం ఓ నటుడిగా మమ్ముట్టి సినిమా కెరీర్‌ ఊపందుకుంది. ఇర్వింగ్‌ వాలెస్‌ రచించిన 'ది ఆల్మైటీ' అనే నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. బాధిత జర్నలిస్ట్‌గా మమ్ముట్టి ఈ సినిమాలో నటించారు. ఆ తరువాత మమ్ముట్టి నటించిన ఎన్నో సినిమాల్లోని పాత్రలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. మలయాళ సినిమా చరిత్రలోనే అంత్యంత భారీ విజయాలను అందుకున్న ఘనత మమ్ముట్టిది. విజయవంతమైన 'ఒరు సీబీఐ డైరీ కురిప్పు' సినిమా సీక్వెల్​లోనూ మమ్ముట్టి నటించి ప్రేక్షకులను అలరించారు.

హద్దులు లేని నటన

మలయాళ సినిమాల చరిత్రను తిరగరాసిన మమ్ముట్టి కేవలం ఆ చిత్ర పరిశ్రమకే పరిమితం కాలేదు. తమిళ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌ సినిమాల్లోనూ తళుక్కుమని ప్రేక్షకులను మెప్పించారు. 'మౌనం సమ్మతం' అనే సినిమాతో తమిళ పరిశ్రమకి ఎంట్రీ ఇచ్చిన మమ్ముట్టి.. దర్శకులు బాలచందర్, మణిరత్నాలతో కలసి పని చేశారు. మణిరత్నం దర్శకత్వం వహించిన 'దళపతి'లో రజినీకాంత్‌తో స్కీన్ర్‌ పంచుకున్నారు. ఈ చిత్రంలో ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. రాజీవ్‌ మీనన్‌ దర్శకత్వంలో ఐశ్వర్యా రాయ్, టబు, అజిత్‌ వంటి భారీ తారాగణం ఉన్నప్పటికీ, 'ప్రియురాలు పిలిచింది' చిత్రంలో మమ్ముట్టి నటన ప్రేక్షకులను ప్రత్యేకంగా ఆకట్టుకొంది. ఇలా తమిళంలో ఎన్నో సినిమాల్లో నటించారు మమ్ముట్టి. తెలుగులో 'స్వాతి కిరణం' చిత్రం మమ్ముట్టి కెరీర్‌లో ప్రత్యేకమైంది. తన శిష్యుడు తనకన్నా బాగా పాడుతాడని గమనించి అసూయా ద్వేషాలతో రగిలిపోయే భిన్నమైన పాత్రలో ఆయన రాణించారు. ఇటీవలే 'మమాంగం' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

అవార్డులు, గౌరవాలు, గుర్తింపులు

ఈ విలక్షణ నటుడి ఖాతాలో మూడు జాతీయ సినిమా అవార్డులు, ఏడు కేరళ రాష్ట్ర సినిమా అవార్డులు, 13 ఫిలింఫేర్‌ అవార్డులు, 11 కేరళ సినిమా విమర్శకుల అవార్డులు, అలాగే 5 ఏషియా నెట్‌ సినిమా అవార్డులు ఉన్నాయి. 1998లో భారత సినిమా పరిశ్రమకు ఎంతో విలువైన సేవలు అందించినందుకుగానూ భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో ఆయనను సత్కరించింది. కాలికట్‌ విశ్వవిద్యాలయం, కేరళ విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్‌ డిగ్రీలను పొందారు.

ABOUT THE AUTHOR

...view details