భూమికి అధిక స్థాయిలో ప్రాణవాయువును అందించే అమెజాన్ అడవులు... ఇటీవల కాలంలో తరచుగా అగ్నిప్రమాదాలకు గురవుతున్నాయి. బ్రెజిల్‌లో ఉన్న ఈ వన్య ప్రాంతం ప్రతి ఏడాది రికార్డు స్థాయిలో దగ్ధం అవుతోంది. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం దాదాపు 85 శాతం ఎక్కువగా మంటలకు ఆహుతైందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) వెల్లడించింది. పర్యావరణ వేత్తలు, శాస్త్రవేత్తలు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ఈ విషయంపై స్పందిస్తున్నారు. ఇప్పటికైనా మేల్కొని అమెజాన్‌ని కాపాడుకుందామని పిలుపునిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ హీరోలు మహేశ్ బాబు, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ నెటిజన్లకు సోషల్‌మీడియా వేదికగా సందేశాన్నిచ్చారు.
"20 శాతం ఆక్సిజన్ అందించే అమెజాన్ అడవులు మంటల్లో కాలిపోతున్నాయి. ఈ వార్త చాలా బాధాకరం. ఇప్పటికైనా మేల్కొని అమెజాన్ రెయిన్ ఫారెస్ట్‌ని కాపాడుకుందాం. జీవ వైవిధ్యం చాలా దెబ్బతింటోంది. మన భూమిని రక్షించుకోవడానికి మన వంతు కృషి చేద్దాం. పచ్చని వాతావరణం కోసం ఒక అడుగు ముందుకు వేయండి. దీనిని మన ఇంటి నుంచి ప్రారంభిద్దాం".
- మహేశ్‌బాబు, సినీ నటుడు
ప్రపంచంలోని అతిపెద్ద అడవులు, మనకు 20 శాతం ఆక్సిజన్ అందించే అడవులు, పది లక్షల మంది ప్రజలకు, లక్షలాది వన్యప్రాణులకు ఆధారమైన అడవులు కాలిపోతున్నాయి. దీని వల్ల వాతావరణంలో ఎన్నో మార్పులు రాబోతున్నాయి. ఈ ఘటన నా హృదయాన్ని ఎంతో బాధిస్తోంది.
-అల్లు అర్జున్, హీరో