తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నవ్వుల నారాయణుడి గిలిగింతలు

సినీ లోకం, ప్రేక్షక లోకం కలసి వల్లిస్తున్న నారాయణ మంత్రపుష్పం.. మన సినీ తెర ముంగిట నవ్వుల పువ్వుల నందివర్ధనం... తెలుగు సినీ ఫిల్మీ నెగిటివ్‌ మీద తన హాస్యపు పాజిటివ్‌ రంగులద్దిన మనోడు, మన్నికయినోడు ఎంఎస్‌ నారాయణుడు.. నేడు ఈ నారాయణుడి వర్థంతి. మరి ఆయన విశ్వరూపం చూసేద్దామా..

M. S. Narayana became very popular for his comedian roles in Tollywood
నవ్వుల నారాయణుడి ప్రస్థానం

By

Published : Jan 23, 2020, 12:00 PM IST

Updated : Feb 18, 2020, 2:30 AM IST

ఎంఎస్‌ నారాయణ తెలుగు సినీ ప్రియులకు అందించిన నవ్వుల మందు. రెండున్నర గంటల సినిమాలో మధ్య మధ్య వచ్చే ఎంఎస్‌ నారాయణ తన హావభావాలు, ఛలోక్తులు, జోకుల కేకులతో అలరిస్తే.. హాల్లో నుంచి బయటకి వచ్చిన తరువాత కూడా ఆ హాస్య నటనని గుర్తు చేసుకుని మరీ నవ్వే జనా సుఖినోభవంతు.. సూత్రం నిజమైనది కదా. కొన్నాళ్లు అధ్యాపకుడిగా పిల్లలకి పాఠాలు చెప్తూ.. సినిమా మీద అమితమైన ఇష్టంతో సెలవు రోజుల్లో చెన్నయ్‌ చెక్కేసి దర్శకులని కలుసుకుని కథలు చెప్తూ.. చెప్తూ... అనూహ్యంగా తెరపైకి ఎక్కిన నటుడు ఎంఎస్‌ నారాయణ.

పాత్రల్లో పరకాయ ప్రవేశం

నవ్వుల నారాయణుడి ప్రస్థానం
సాధారణంగా.. ఇండస్ట్రీలో కెరీర్‌ని చిన్నతనంలోనే ప్లాన్‌ చేసుకుంటారు. అక్కడే సినీ కష్టాలు అనుభవిస్తూ, కన్నీళ్లు దిగమింగుతూ.. అవకాశాల వేటలో సాగిపోతూ... ఎప్పుడో విజయాన్ని అందుకుంటారు. కానీ..ఎంఎస్‌ నారాయణ లేటుగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి.. ఘాటు ఘాటైన తాగుబోతు పాత్రల్ని ఎడాపెడా వేసేసి.. తెలుగు చిత్రాల్లో తాగుబోతు పాత్రలకు తానే బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎక్కడలేని పేరు తెచ్చుకుని.. అంతటితో ఆగకుండా.. అందివచ్చిన అనేకానేక పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి.. అభిమానుల్లో తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఇప్పుడు ఆయన మనమధ్య లేరు. కానీ... ఆయన నటించిన పాత్రలు తెలుగు తెర ఉన్నంతవరకూ ప్రేక్షకుల్ని పలకరిస్తూనే ఉంటాయి. పరవశింపచేస్తూనే ఉంటాయి.

ఇదీ నారాయణ నడిచొచ్చిన దారి

1951 ఏప్రిల్‌ 16న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని నిడమర్రు గ్రామంలో ఎంఎస్‌ నారాయణ పుట్టారు. ఇంటిపేరు మైలవరపు... ఒంటి పేరు సూర్యనారాయణ... వెరసి ఎంఎస్‌ నారాయణ. తాను పుట్టి పెరిగిన పల్లె అంటే ప్రాణం. పెద్దయిన తరువాత మొదట చూసిన అతి పెద్ద నగరం భీమవరం. చిన్నతనంలో అందరు పిల్లల్లాగే... పల్లెలోని కాలువల్లో ఈతకొట్టడం.. పెద్దలకు దొరక్కుండా అల్లరి చేయడం చేస్తూనే.. చక్కగా చదువుకుని అధ్యాపక వృత్తిలో స్థిరపడ్డారు ఎంఎస్‌ నారాయణ. రచనలు చేయడం, నటించడం లాంటి మంచి వ్యసనాల బారిన పడ్డారాయన. కథలు రాశారు. సినిమా కథలు అల్లారు. ఉన్న ఉద్యోగం వదులుకోకుండా సినీ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అలా ఆయన చెన్నయ్‌ వెళ్లి కథలు వినిపిస్తున్న ఎంఎస్‌ నారాయణలో మంచి నటుడు ఉన్నాడని మొదట కనిపెట్టిన దర్శకుడు రవిరాజా పినిశెట్టి.

నవ్వుల నారాయణుడి ప్రస్థానం

వరుసగా తాగుబోతు పాత్రలు
ఎంఎస్‌ నారాయణ కథ చెప్పే తీరు వింటూనే... అప్పట్లో ఆయన తీస్తున్న ఎం.ధర్మరాజు సినిమాలో చెవిటి పాత్రను ఇచ్చారు. ఆ పాత్ర వెయ్యాలా...వద్దా? అని సంశయిస్తున్న సమయంలో నటుడిగా రాణిస్తావంటూ వెన్ను తట్టి మరీ ప్రోత్సహించి ఎంఎస్‌ నారాయణని తెరపైకి తీసుకువచ్చిన దర్శకుడు రవిరాజా పినిశెట్టి. ఆ తరువాత వరుసగా ఏడు చిత్రాల్లో రవిరాజా అవకాశం ఇచ్చారు. ఏడో సినిమా రుక్మిణి. ఆ సినిమాలో నాగబాబు దగ్గర వేషం వేశారు ఎంఎస్‌ నారాయణ. ఎంఎస్‌ నారాయణ చేస్తున్న పాత్రలని చూసిన ఈవీవీ సత్యనారాయణ 'మా నాన్నకు పెళ్లి' చిత్రంలో తాగుబోతు పాత్ర ఇచ్చారు. ఆ తాగుబోతు పాత్రలో ఎంఎస్‌ నారాయణ జీవించేసరికి... వరుసగా తాగుబోతు పాత్రలే ఆయన్ని వరించాయి. ఆ వరుస పాత్రల్లో వైవిధ్యం ఎలా చూపించారు..? అని మీడియా అడిగిన ప్రశ్నకు ఎంఎస్‌ నారాయణ బదులు ఇస్తూ తాగుబోతు పాత్రల్లో కాస్త తింగరితనం, మరికాస్త అమాయకత్వం, ఒక్కోసారి అతి తెలివితేటల్ని ప్రదర్శించడంతో ప్రేక్షకులు అభిమానించారని చెప్పారు.

నవ్వుల నారాయణుడి ప్రస్థానం

'మా నాన్నకు పెళ్లి'తో గుర్తింపు
'మా నాన్నకు పెళ్లి' చిత్రం ఎంఎస్‌ నారాయణ నట జీవితాన్ని మలుపు తిప్పింది. కమెడియన్‌గా బిజీ ఆర్టిస్ట్‌ని చేసింది. వరుస ఆఫర్లు రావడం వల్ల ఎంఎస్‌ నారాయణ కాల్షీట్లు ఖాళీ లేని పరిస్థితి వచ్చింది. అదే సమయంలో పుష్పక విమానంలాంటి తెలుగు పరిశ్రమకు ఎంఎస్‌ నారాయణ రూపంలో కొన్నేళ్లపాటు నవ్వించగల సమర్ధుడైన హాస్య నటుడు దొరికాడు. చేస్తున్న ప్రతి పాత్ర ఎంఎస్‌ నారాయణలోని హాస్య నటుడికి ఆయుష్షు పెంచుతూ వచ్చింది. తెరపై ఎంఎస్‌ నారాయణ కనిపిస్తే చాలు... సినిమా హాళ్లలో ఈలలు, కేకలు... గోలలు. ప్రేక్షకుల పెదాలపై నవ్వుల పువ్వులు. అలా ఎంఎస్‌ నారాయణ హవా జోరందుకుంది. కేవలం హాస్యంతోనే ఆగిపోకుండా... సహాయ పాత్రల్లోనూ ఎంఎస్‌ నారాయణ ప్రతిభ చూపించారు. 1997లో 'మా నాన్నకు పెళ్లి' తరువాత మరి వెనక్కి తిరిగి చూసుకోని ఎంఎస్‌ నారాయణ ఖాతాలోకి ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చి చేరాయి. 'సమరసింహారెడ్డి', 'రామసక్కనోడు', 'సర్దుకుపోదాం రండి', 'ఆనందం', 'నువ్వు నాకు నచ్చావు', 'ఆది', 'ఇంద్ర', 'సొంతం', 'శివమణి', 'అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి', 'బన్నీ', 'అందరివాడు', 'చిరుత', 'రెడీ', 'డార్లింగ్‌', 'దూకుడు'... ఇలా ఎన్నో చిత్రాల్లో మరిచిపోలేని పాత్రలు ఎంఎస్‌ నారాయణ ఎగరేసిన విజయ కేతనాలు. 'బద్రీనాధ్‌', 'జులాయి', 'దరువు', 'షాడో', 'కెవ్వు కేక', 'అత్తారింటికి దారేది', 'బాద్షా', 'ఆగడు', 'రేసు గుర్రం', 'పటాస్‌', 'సన్నాఫ్‌ సత్యమూర్తి'...లాంటి చిత్రాల్లో ఎంఎస్‌ నారాయణ నటన అమోఘం. ప్రత్యేకించి...'దూకుడు' సినిమాలో ఎంఎస్‌ నారాయణ పోషించిన పాత్రని ఇప్పటికీ ప్రేక్షకులు తలచుకుని తలచుకుని నవ్వుకుంటారు.

నవ్వుల నారాయణుడి ప్రస్థానం

ఎంఎస్‌ నారాయణకి నచ్చిన పాత్రలు
ఎన్నో పాత్రలు వేసినా నటుడిగా ఎంఎస్‌ నారాయణకి దర్శకుడు బి.గోపాల్‌ రూపొందించిన 'రవన్న' చిత్రంలోని సర్పంచ్‌ పాత్ర ఎంతో ఇష్టం. ఆ సంగతి ఆయనే ఓసారి చెప్పారు. అలాగే, 'రామసక్కనోడు' సినిమాలో ఆటో డ్రైవర్‌ పాత్ర కూడా నచ్చిన పాత్రగా ఆయన చెప్పుకున్నారు. ఆ పాత్ర స్వభావాన్ని మూలశంకతో బాధపడుతున్న పాత్ర అని వివరించారు. ముఖంలోని... ఆ బాధను వ్యక్తం చేయాల్సిందిగా దర్శకులు సూచించడం.. ఆ సూచనల్ని పాటించడం కారణంగా ఆ పాత్ర రక్తి కట్టిందని ఆయన ఓ సందర్భంలో విడమరిచారు. అలాగే...'సర్దుకుపోదాం రండి'...చిత్రంలోని జగపతి బాబు మామ పాత్ర కూడా తనకు నచ్చిందని ఆయన చెప్పడం గమనార్హం.

దర్శకుడిగా రెండు చిత్రాలు
ఎంఎస్‌ నారాయణ దర్శకుడిగా రెండు చిత్రాలు చేశారు. ఒకటి 'కొడుకు'... రెండు 'భజంత్రీలు'. ఈ రెండు చిత్రాలు ఆశించిన విజయాన్ని చవి చూడలేదు. సినిమా తీయడం కాదు... మార్కెటింగ్‌ చేసుకోవడం కూడా ఓ కళే. ఆ కళలో బాగా వెనుకబడ్డానని... ఆ రెండు చిత్రాలు తెలియచేశాయని ఎంఎస్‌ నారాయణ వైఫల్యాన్ని కూడా హుందాగా స్వీకరించారు. అధ్యాపకుడిగా పిల్లలకు పాఠాలు చెప్పిన ఎంఎస్‌ నారాయణ సినీ రంగంలో దర్శకుల సూచనలు కూడ పాఠాలుగానే స్వీకరించారు. నాలెడ్జి ఈజ్‌ పవర్‌ అంటారు. కానీ, లెర్నిగ్‌ ఈజ్‌ పవర్‌ అని ఎంఎస్‌ నారాయణ చెప్పేవారు. రచయితగా కూడా 8 చిత్రాలకు పనిచేశారు. 'ప్రతిష్ట', 'అలెగ్జాండర్‌', 'పేకాట పాపారాఫు', 'ప్రయత్నం'... ఇలా ఎనిమిది చిత్రాలకు పనిచేశారు.

నవ్వుల నారాయణుడి ప్రస్థానం

అవార్డులు-పురస్కారాలు
ఎంఎస్‌ నారాయణ సినీ సృజనకు మెచ్చి అయిదు నందులు ఆయన ఇంటికి నడిచొచ్చాయి. 1999లో 'రామసక్కనోడు', 1997లో 'మా నాన్నకు పెళ్లి', 'సర్దుకుపోదాం రండి', 2003లో 'శివమణి', 2011లో 'దూకుడు' చిత్రాలకు గాను ఎంఎస్‌ నారాయణ నంది అవార్డుల్ని అందుకున్నారు. దూకుడు సినిమాకిగాను ఫిలిం ఫేర్‌ అవార్డు కూడా ఆయన్ని వరించింది. అదే సినిమాలో అదే పాత్రకి సినిమా అవార్డు కూడా దక్కింది. తన చిత్రాలను మనకు మిగిల్చి... 2015 జనవరి 23న ఎంఎస్‌ నారాయణ శాశ్వతంగా దూరమయ్యారు.

ఇదీ చదవండి: 'సరిలేరు నీకెవ్వరు'లో కొత్త సీన్స్​.. రేపటి నుంచే!

Last Updated : Feb 18, 2020, 2:30 AM IST

ABOUT THE AUTHOR

...view details