ఆ కుర్రాడిది తెలంగాణలో ఓ మారుమూల గ్రామం.. కరీంనగర్ జిల్లాలోని హనుమాజీపేట. రైతు కుటుంబం. తండ్రిది వానాకాలం చదువయితే తల్లికి అదీ లేదు. ఊర్లో సరైన బడీ లేదు. ఓ పంతులుగారి దగ్గర ఓనమాలు దిద్దుకొని దగ్గరలోనే ఉన్న పాఠశాలలో చేరాడు. అప్పటి పరిస్థితుల మేర ఉర్దూ మాధ్యమం మాత్రమే ఉండేది. అందులోనే చేరాడు. మాతృభాషైన తెలుగును 'ఐచ్చికం'గా తీసుకున్నాడు. పల్లెటూరి వాడు కావడం వల్ల 'యాస' ఉండేది. ఓసారి పక్క జిల్లాకు చెందిన ఓ సహ విద్యార్ధి అతడి యాసను గేలి చేశాడు. దానికి అతను బాధపడలేదు. కోపం పెంచుకోలేదు. తనకి యాస ఉందా లేదా అని ఆలోచించాడు. 'యాస' లేకుండా మాట్లాడలేనా అనుకొన్నాడు. సంకల్పించుకున్నాడు. అంతే! భాషని బట్టి, యాసని బట్టి ప్రాంతాన్ని పోల్చుకోవడానికి వీలు లేకుండా మాట్లాడసాగాడు. ఉర్దూ మాధ్యమంలోనే చదివినా తెలుగు అధ్యాపకుడిగా, ఆచార్యుడిగా ఎదగడమే కాకుండా సాహిత్యంలో అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారమైన జ్ఞానపీఠాన్ని వరించాడు. 'సానుకూల దృక్పథం'తో ఆలోచించి ఆచరించాడు. ఆయనే సినారెగా వినుతికెక్కిన సింగిరెడ్డి నారాయణరెడ్డి.
వ్యక్తిగతం
1931 జులై 29న పుట్టిన సినారెకి కవిత్వం సహజాతం. చిన్నప్పుడు ఆలకించిన బుర్రకథలు, హరికథలు అతడిని సృజనాత్మకతవైపు నడిపాయి. నేర్చుకుంటే వచ్చేది కాదు కవిత్వమని ఆయనే అంటారు. పాండిత్యం కావాలంటే నేర్చుకోవాలట. చిన్నప్పుడు హిందీ పాటలు విన్నప్పుడు వాటిని తెలుగులో పాడుకున్నా సినిమా పాటల వైపు దృష్టిపెట్టలేదు ఎప్పుడూ. పద్యకావ్యాలు, గేయాలు, గజల్స్ ఇలా సాగిపోయాయి తొలిరోజులు. 'మట్టిమనిషి', 'ఆకాశం', 'కలం సాక్షిగా', 'నాగార్జున సాగరం', 'విశ్వనాథనాయుడు', 'కర్పూర వసంతరాయలు', 'విశ్వంభర' వంటి రచనలు విమర్శకులు ప్రశంసలనందుకున్నాయి. ఆ పరిణామక్రమంలో సినీరంగ ప్రముఖులైన అక్కినేని, గుమ్మడిలతో పరిచయం ఏర్పడింది. శభాష్‌రాముడు, పెళ్లిసందడి వంటి చిత్రాలకు పాటలు రాయమని ఆహ్వానించారు. అయితే కేవలం, చిత్రంలో ఒక్క పాటను మాత్రమే రాయడం ఇష్టంలేక తిరస్కరించారు.
కుటుంబం
సినారెది బాల్య వివాహం. ఆయన భార్య పేరు సుశీల. నలుగురు కుమార్తెలు గంగ, యమున, సరస్వతి, కృష్ణవేణి. భార్య మరణానంతరం ఆమె పేరు మీద ఔత్సాహిక మహిళా సాహితీకారులకు ఏటా అవార్డులు అందించారు సినారె.
ఎన్టీఆర్ చిత్రాలకు గేయరచయితగా
'కలిసి ఉంటే కలదు సుఖం' చిత్ర నిర్మాణ సమయంలో ఎన్టీఆర్‌తో పరిచయం ఏర్పడింది. సినారె గురించి విని ఉన్న ఎన్టీఆర్ ఆయనని తమ తదుపరి చిత్రం 'గులేబకావళికథ'కు పాటలు రాయమని కోరారు. అయినప్పటికీ సినారె ఒకటిరెండు పాటలయితే రాయనని మొత్తం అన్ని పాటలు రాసే అవకాశం ఇస్తేనే పనిచేస్తానని చెప్పారు. సినారె నిబద్ధతకు, ఆత్మవిశ్వాసానికి ఆశ్చర్యపోయిన ఎన్టీఆర్ 'అటులనే కానిండు' అనవలసి వచ్చింది.ఆ విధంగా సినారె 1962లో 'గులేబకావళి కథ' సినిమా ద్వారా 'రాజ'మార్గాన చిత్రరంగ ప్రవేశం చేశారు. తొలి పాట 'నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని' కూడా ప్రేమగీతమే. అయితే ఆయన ఒక అంశానికే పరిమితం కావాలని అనుకోలేదు. బహుశ అందుకేనేమో అంతకుముందు ఒకటీ అరా పాటలు రాయమన్నా రాయలేదు. పూర్తి చిత్రం అంటే అన్ని అంశాలనూ స్పృశించవచ్చు.
తెలుగుజాతి మనదీ..
'వచ్చిండన్నా, వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్న... యాసలు వేరుగ ఉన్న మన భాష తెలుగు భాషన్నా' అంటూ సాగే 'తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది' పాట (తల్లా పెళ్లామా) అందరికీ గుర్తొచ్చింది. ఆ తర్వాత ఆయనే ప్రజాభిప్రాయాన్ని మన్నిస్తూ ఓ ఇంటర్వ్యూ ''తెలుగు జాతి మనది 'రెండు'గ వెలుగు జాతి మనది'' అన్నారు. అంటే ఆయన ఉద్దేశం భేదభావాలు ఉండరాదనే. దీన్ని ఎవరు కాదనగలరు? ఈ విషయాన్ని ఆయన చాలా పాటల్లో చాటారు కూడా. 'గాలికీ కులమేదీ.. మింటికి మరుగేదీ..' అన్నారు. 'పాలకు ఒకటే వర్ణం. అది తెలివర్ణం.. వీరులకెందుకు కుల భేదం? అది మనసుల చీల్చెడు మత భేదం' అంటూ నిరసించారు. అలా ఆయన దాదాపు ఎన్నో పాటలకు ప్రాణం పోశారు.
పురస్కారాలు
- 1988లో ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం
- ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి
- కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
- భారతీయా భాషా పరిషత్ పురస్కారం
- రాజలక్ష్మీ బహుమతి
- సోవియట్-నెహ్రూ అవార్డు
- అసాన్ అవార్డు
- పద్మశ్రీ పురస్కారం
- పద్మ భూషణ్
- ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగు సాహిత్య డాక్టరేటు డిగ్రీ
- ఉత్తమ పాటల రచయిత - ఇదిగో రాయలసీమ గడ్డ, సీతయ్య చిత్రానికి నంది పురస్కారం
- 2011లో తెలుగు విశ్వవిద్యాలయం నుంచి సాంస్కృతిక రంగంలో విశిష్ట పురస్కారం
- డా. బోయి భీమన్న జీవన సాఫల్య బహుమతి - 2 లక్షల నగదు, ప్రశంస పత్రం (బోయి భీమన్న సాహిత్య పీఠం,తెలుగు విశ్వవిద్యాలయం, 19.09.2014)
- ఆంధ్ర, కాకతీయ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మీరట్, నాగార్జున విశ్వ విద్యాలయాలు ఆయనకు గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశాయి.