సాయి పల్లవి గురించి ఆసక్తికర విషయాలు! - Sai Pallavi news
అందం, అభినయంతో దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా వెలుగొందుతోంది సాయి పల్లవి (sai pallavi). ఈమె తొలిసారి హీరోయిన్గా నటించిన 'ప్రేమమ్' (మలయాళం) విడుదలై నేటికి సరిగ్గా 6 ఏళ్లు. ఈ నేపథ్యంలో ఆమె గురించిన ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
సాయి పల్లవి
చూడగానే మన పక్కింటి అమ్మాయిలా, తనదైన అల్లరితో సందడి చేస్తూ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఆకట్టుకొనే అందం, అందుకు తగ్గ అభినయమున్న ఇలాంటి అమ్మాయి చిత్రపరిశ్రమలో ఒక్కటే పీస్ అన్నంతగా కుర్రకారుకు మనసులను దోచేసింది. ఈ ముద్దుగుమ్మ 2015లో మలయాళ చిత్రం 'ప్రేమమ్'తో వెండితెర అరంగేట్రం చేసింది. ఈ చిత్రం విడుదలైన నేటికి సరిగ్గా 6 ఏళ్లు. ఈ సందర్భంగా పల్లవి గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
- సాయి పల్లవి వెండితెరకు పరిచయం కాకముందే ఈటీవీలో ప్రసారమయ్యే ఢీషో (Dhee 4)లో కంటెస్టెంట్‌గా పాల్గొంది. అయితే ఈ షోలో పాల్గొనేందుకు ఆమె తల్లి మొదట ఒప్పుకోలేదు. తన కెరీర్ ఏమైపోతుందో అని భయపడింది. కానీ ఆ తర్వాత అంగీకారం తెలిపింది.
- ఈ ఢీషోలో 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' (వర్షం), 'వింటున్నావా' (ఏ మాయ చేసావె), 'కుచ్చి కుచ్చి కూనమ్మ' (బొంబాయి), 'భూ భూ భుజంగం' (అరుంధతి) వంటి పాటలకు అదిరిపోయే ప్రదర్శనలిచ్చింది.
- స్కూల్ డేస్ నుంచి ఓనమ్ పండగను జరుపుకొనేది సాయి పల్లవి. అందువల్ల చాలామంది ఆమెను కేరళ రాష్ట్రానికి చెందిందని అనుకుంటారు. కానీ కాదు.
- సాయి పల్లవి వెండితెరపై ప్రధాన పాత్రల్లో నటించడానికి ముందు కంగనా రనౌత్ నటించిన ధామ్ ధూమ్ చిత్రంలో సహాయ నటిగా కనిపించింది.
- వెండితెరపై ప్రధానపాత్రల్లో సాయిపల్లవి నటించిన మొదటి చిత్రం 'ప్రేమమ్' (మలయాళం). ఈ సినిమాలో మలర్ పాత్రతో కుర్రకారు మనసుల్ని మాయ చేసింది. అయితే ఇందులో సాయి పల్లవిపై వచ్చే 'మలరే' సాంగ్‌ను ఆమెకు తెలియకుండా చిత్రీకరించారు. ఆమెపై ఈ పాట చిత్రీకరించారని తెలిసిన తర్వాత తన ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. ఈ చిత్రం తెలుగు రీమేక్ కూడా ఇదే టైటిల్‌తో తెరకెక్కింది.
- 'ఫిదా'తో తెలుగు, 'దియా' చిత్రంతో తమిళంలో అడుగుపెట్టింది.
- సాయి పల్లవి జార్జియాలోని తబ్లిసీ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చేసింది. మొదటి నుంచి కార్డియాలజిస్ట్ కావాలన్నది పల్లవి కోరిక.
- రూ.2 కోట్ల ఫెయిర్‌నెస్ ప్రకటనను వదులుకుంది. అందమనేది క్రీముల్లో ఉండదనేది ఆమె నమ్మకం. అందుకే ఆ ప్రకటనను వదులుకున్నానని తెలిపింది.
- సాయి పల్లవి మేకప్‌కు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వదు. చాలా తక్కువ మేకప్‌తోనే నటిస్తుంది. దీనికి గల కారణాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది పల్లవి. 'ప్రేమమ్' దర్శకుడు ఆల్ఫొన్సో తనను మేకప్ లేకుండా చేయమన్నాడని.. అది తన ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని చెప్పుకొచ్చింది.
- సాయి పల్లవి తమిళనాడు కోటగిరిలోని బడగ కమ్యూనిటీ చెందింది. ఈ కమ్యునిటీ నుంచి స్టార్‌గా ఎదిగిన తొలి అమ్మాయి పల్లవి కావడం విశేషం.
- ఎప్పుడూ సింపుల్‌గా కనిపించే సాయి పల్లవి చేతికి ఉడెన్ చైన్‌ను ధరిస్తుంటుంది. సంప్రదాయ, పాశ్చాత్య.. ఇలా ఏ దుస్తుల్లో ఉన్నా ఈ చైన్ మాత్రం ఉండాల్సిందే. అయితే తను ఆ చైన్ ఎందుకు పెట్టుకుంటుందో మాత్రం క్లారిటీ లేదు. అది తన సెంటిమెంట్ అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.