KS Sethumadhavan: మలయాళ దిగ్గజ దర్శకుడు కేఎస్ సేతు మాధవన్ (90) శుక్రవారం ఉదయం కన్నుమూశారు. కమల్ హాసన్ వంటి లెజెండరీ యాక్టర్‌ను మలయాళంలో పరిచయం చేసింది ఆయనే. కమల్‌తో కలిసి తమిళంలో 'నమ్మవర్' అనే సినిమా కూడా తీశారు సేతు మాధవన్.
మలయాళం సహా తమిళం, తెలుగు, హిందీ భాషల్లో 60కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు సేతు మాధవన్. జాతీయ అవార్డు, కేరళ ప్రభుత్వ అవార్డు సహా ఎన్నో అవార్డులను దక్కించుకున్నారు. మలయాళంలో 1960లో 'జ్ఞాన సుందరి' అనే చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు సేతు మాధవన్.
1990లో తెరకెక్కించిన 'మరుపాక్కమ్' అనే సినిమాకు జాతీయ అవార్డు అందుకున్నారు సేతు మాధవన్. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్‌ను కూడా 'నాలై నమత్తే' సినిమాలో డైరెక్ట్ చేశారాయన.
10 సినిమాలకు జాతీయ అవార్డులు
సేతు మాధవన్ దర్శకత్వం వహించిన చిత్రాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి. ఆయన సినిమాల్లో పది చిత్రాలకు జాతీయ అవార్డులు వచ్చాయి. అందులో తెలుగులో తీసిన 'స్త్రీ' అనే సినిమాకు కూడా ఉంది.
తెలుగులో 'స్త్రీ'..
సేతుమాధవన్ తెలుగులో దర్శకత్వం వహించిన సినిమా 'స్త్రీ'. 1995లో విడుదలైన ఈ సినిమా ప్రత్యేక గుర్తింపు పొందింది. పాలగుమ్మి పద్మరాజు రాసిన పడవ ప్రయాణం అనే కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించారు సేతుమాధవన్. ఈ చిత్రాన్ని రెండు భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు వరించాయి. ఉత్తమ తెలుగు సినిమా కేటగిరి, స్పెషల్ మెన్షన్ కేటగిరి కింద సినిమాలో నటించిన రోహిణికి అవార్డులు వచ్చాయి.
భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం, 2వ ప్రేగ్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలోనూ ఈ సినిమా ప్రదర్శితమైంది.
ఇదీ చూడండి:Sirivennela: మసకేసిన వెన్నెల గీతం