టాలీవుడ్లో తమ నటనతో కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు సీనియర్ నటులు కోట శ్రీనివాస రావు-బాబుమోహన్. వీరి కాంబినేషన్‌కు మంచి పేరుంది. ఇప్పటికీ వీరికి సంబంధించిన కొన్ని సినిమా సన్నివేశాలు యూట్యూబ్‌లో రికార్డు వీక్షణలతో దూసుకెళ్తున్నాయి. అలాంటి ఈ జోడీ మరోసారి బుల్లితెరపై మెరిసింది. ఈటీవీలో ప్రసారమయ్యే సెలబ్రిటీ టాక్ షో 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి వీరిద్దరూ విచ్చేశారు. తమ జీవితాలలో ఎదుర్కొన్న సవాళ్లను, బాధలతో పాటు మరిన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
కైకాల మాటలతో కన్నీళ్లొచ్చాయి: కోట - ఆలీతో సరదాగా షోలో కోట శ్రీనివాస రావు
టాలీవుడ్ సెలబ్రిటీ టాక్ షో 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో తాజాగా పాల్గొన్నారు సీనియర్ నటులు కోట శ్రీనివాస రావు, బాబుమోహన్. తమ జీవితాలలో ఎదుర్కొన్న సవాళ్లను, బాధలతో పాటు మరిన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
"మీ ఇద్దరిలో ఇండస్ట్రీలో సీనియర్ ఎవరు?" అని ఆలీ ప్రశ్నించగా.. తానేనంటూ సమాధానమిచ్చారు బాబు మోహన్. అలాగే "పెద్ద గుమ్మడికాయంత ప్రతిభ ఉంటే సరిపోదు.. ఆవగింజంత అదృష్టం ఉండాలి. అదే నేను" అన్నారు కోట. అలాగే కైకాల సత్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా ఫోన్ కాల్ చేసిన సమయంలోని సంఘటనను గుర్తు చేసుకున్నారు కోట శ్రీనివాస రావు.
"ఓరోజు కైకాల సత్యనారాయణ పుట్టినరోజని ఫోన్ చేశా. ఏవండి పెద్దవారు నమస్కారం. పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పా. అప్పుడు ఆయన 'ఊరుకోవయ్యా.. నాకంటే పెద్ద యాక్టర్ నువ్వు' అన్నారు నన్ను. నాకు ఆరోజు కన్నీళ్లాగలేదు" అంటూ చెప్పుకొచ్చారు కోట.