కీర్తీసురేశ్.. వెండితెరకు పరిచయమైన చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోలతో నటించే అవకాశాన్ని అందుకున్న ప్రతిభావని. 'సర్కారు వారి పాట'లో మహేశ్‌బాబుతో జోడీ కట్టే ఛాన్స్ కొట్టేసిన ఈ మలయాళీ కుట్టి ఇప్పటవరకూ తాను కలిసి నటించిన హీరోల గురించి వివరిస్తోందిలా..
పవన్‌కల్యాణ్ వ్యక్తిత్వం నచ్చుతుంది
ఒకప్పుడు మా అమ్మ, చిరంజీవితో కలిసి 'పున్నమి నాగు'లో నటిస్తే నేనేమో పవన్‌కల్యాణ్‌తో 'అజ్ఞాతవాసి' చేశా. నా మూడో సినిమా తనతో కలిసి చేస్తున్నానని తెలిసినప్పుడు ఎగిరి గంతేసినంత పనిచేశా. అంతకన్నా ముందే ఆయన సినిమాలు చూసి చాలా విషయాలు నేర్చుకున్నా. అందరూ ఆయన్ని పవర్‌స్టార్ అని ఎందుకు అంటారో తనతో కలిసి నటిస్తున్నప్పుడు అర్థమయ్యింది. మా సినిమా పూర్తయ్యాక నేను తన నటనకే కాదు వ్యక్తిత్వానికి కూడా ఫిదా అయ్యానంటే నమ్మండి. అవకాశం వస్తే మరోసారి పవన్‌కల్యాణ్‌తో కలిసి తెర పంచుకోవాలని ఉంది.
నాని రుణం తీర్చుకోలేను
నాకు 'నేను లోకల్' సినిమా అవకాశం వచ్చినప్పుడు మా అక్క.. 'తెలుగులో నానిని నేచురల్ స్టార్ అంటారు. నిజంగా అతని నటన చాలా సహజంగా ఉంటుంది..' అని చెబితే కాస్త భయపడ్డా. కానీ షూటింగ్ మొదలయ్యాక ఎలాంటి కష్టమైన సన్నివేశాన్నయినా నాని చాలా సులువుగా నటించడం చూసి 'అలా ఎలా చేస్తాడబ్బా' అనుకునేదాన్ని. షూటింగ్ విరామంలో నేను రకరకాల ప్రశ్నలు వేస్తూ ఎంత విసిగించినా చాలా ఓపిగ్గా సమాధానాలు చెప్పేవాడు. 'మహానటి'లో నన్ను తీసుకోవాలనుకున్నప్పుడు నాని నాకు ఫోన్ చేసి ఆ సినిమా గురించి చెబుతూనే 'నీకు మంచి గుర్తింపు వస్తుంది. నువ్వు చేస్తే బాగుంటుంది' అని చెప్పాడు. నేను మహానటిగా జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నానంటే నా మొదటి థ్యాంక్స్ నానికే చెబుతా. అతని రుణం ఎప్పటికీ తీర్చుకోలేను.
సూర్యకు పెద్ద అభిమానిని!