తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కుర్రకారు గుండెల్ని మాయ చేసే 'మల్లీశ్వరి'

ఓవైపు మైమరపించే ముగ్ధమనోహర రూపం. మరోవైపు విమర్శకులను కూడా మెప్పించే నటనా కౌశలం. అన్నింటికీ మించి అద్భుతమైన డ్యాన్స్‌ ప్రతిభ. ఇవన్నీ ఎవరిలో ఉన్నాయనుకుంటున్నారు. తనే బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్. హిందీ పరిశ్రమలో అగ్ర కథానాయికగా వెలుగొందుతున్న కత్రిన పుట్టినరోజు ఈరోజు.. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం.

కుర్రకారు గుండెల్ని మాయ చేసే 'మల్లీశ్వరి'
కుర్రకారు గుండెల్ని మాయ చేసే 'మల్లీశ్వరి'

By

Published : Jul 16, 2020, 5:34 AM IST

పాల సంద్రం నుంచి పుట్టికొచ్చిన క్షీరసాగర కన్యనో..

దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవకన్యనో..

తేనె చుక్కలు, గులాబీ రేకులు రంగరించి బ్రహ్మ చేసిన సమ్మోహన రూపమో..

ఏమైతేనేం.. తను మాత్రం కుర్రకారు గుండెల్ని గుల్లచేసే మల్లీశ్వరే..

వెండితెరపై తన సొగసులతో పండువెన్నెలలు కురిపించే ముద్దులొలికే చంద్రబింబమే..

సినీ ప్రియుల హృదయాలకు ఆమె ఇండియన్‌ లేడీ మైకెల్‌ జాక్సన్‌..

అంతేనా.. అందం, అభినయం కలగలిసిన చూడచక్కని నాట్యమయూరం.. ఆమే బాలీవుడ్‌ ముద్దుగుమ్మ కత్రినా కైఫ్‌.

ఆమె 'షీలా షీలాకీ జవానీ..' అంటూ చిందేస్తుంటే బాలీవుడే కాదు.. దేశం మొత్తం ఆ డ్యాన్స్‌కు ఫిదా అయిపోయారు. ‘'చికినీ చమేలి..'’తో చితక్కొట్టినా,'ధూమ్‌−3'లో 'కమ్లి కమ్లి..' అంటూ అదిరిపోయేలా కాలు కదిపి కుర్రకారును ఉర్రూతలూగించినా కత్రినాకే చెల్లింది. దేశం మొత్తం మీద ఉన్న గొప్ప డ్యాన్సర్లలో ఒకరిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కత్రినా. ఓవైపు మైమరపించే ముగ్ధమనోహర రూపం. మరోవైపు విమర్శకులను కూడా మెప్పించే నటనా కౌశలం. అన్నింటికీ మించి అద్భుతమైన డ్యాన్స్‌ ప్రతిభ. ఇవే కత్రినాకు బాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి. అగ్రకథానాయికగా వెలుగొందేలా చేస్తున్నాయి.

తండ్రి ప్రేమకు దూరమైన ముద్దుగుమ్మ..

వెండితెరపై తన అందచందాలతో కనువిందు చేస్తూ.. భారత సినీ ప్రియులను హృదయాలను దోచేసే పొడుగుకాళ్ల సుందరి కత్రినా కైఫ్‌ పుట్టింది హాంగ్‌కాంగ్‌లో. 1983 జులై 16న మహ్మద్‌ కైఫ్, సుసన్నే కైఫ్‌ దంపతులకు జన్మించారు. తండ్రి కశ్మీర్‌లో పుట్టిపెరిగిన బ్రిటీష్‌ వ్యాపారవేత్త కాగా తల్లి బ్రిటన్‌కు చెందిన సామాజిక కార్యకర్త, లాయరు. కత్రినా చిన్నతనంలోనే ఆమె తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడం వల్ల తల్లి వద్దే పెరిగారు. ఆమె తన తండ్రి ప్రేమకు దూరమైనందుకు ఎన్నోసార్లు బాధపడ్డారట. "నా స్నేహితులు వాళ్ల తండ్రి వద్ద పొందుతున్న ప్రేమను చూసి ఎంతో బాధపడేదాన్ని.." అంటూ కత్రినే ఓ సారి ఈ విషయాన్ని బయట పెట్టారు.

పరాజయంతో మొదలైన సినీ కెరీర్‌..

నటనపై మక్కువతో చిన్నతనం నుంచే మోడలింగ్‌ వైపు అడుగులు వేసిన కత్రినా తొలిసారి ‘కింగ్‌ ఫిషర్‌ క్యాలెండర్‌’లో కనిపించి బాలీవుడ్‌ దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత లండన్‌ ఫ్యాషన్‌ వీక్‌లో పాల్గొన్న సందర్భంలో కత్రినాను చూసిన బాలీవుడ్‌ నిర్మాత కైజద్‌ గుస్తాద్‌ తన సినిమాలో అవకాశమిచ్చారు. అలా 2003లో తొలిసారి 'బూమ్‌' చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు కత్రిన. అయితే ఆ సినిమా ఘోరపరాజయాన్ని చవిచూసింది. ఆ తర్వాత తెలుగులో వెంకటేష్‌కు జోడీగా 'మల్లీశ్వరి' చిత్రంలో నటించి మెప్పించి టాలీవుడ్‌ ప్రేక్షకులను అలరించారు. ఆ చిత్రం కమర్షియల్‌గా విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో జమిందారి వారసురాలి పాత్రలో కత్రిన నటనకు సర్వత్రా ప్రశంసలు దక్కాయి. కానీ దురదృష్టవశాత్తూ టాలీవుడ్‌లో అవకాశాలు మాత్రం దక్కించుకోలేకపోయారు.

తర్వాత రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో 'సర్కార్‌' (2005) చేసినప్పటికీ తన కెరీర్‌కు అది ఏమాత్రం ఉపయోగపడలేదు. ఇలాంటి సమయంలో సల్మాన్‌ ఖాన్‌కు జోడీగా కత్రిన నటించిన 'మైనే ప్యార్‌ క్యూ కియా?' (2005) బాక్సాఫీస్‌ వద్ద భారీ హిట్‌గా నిలవడం వల్ల ఆమెకు అవకాశాలు వరుస కట్టాయి. ఆ తర్వాత 'హమ్‌కో దీవాన్‌ కర్‌ గయే' (2006), 'వెల్‌కమ్‌'(2007), 'రేస్‌' (2008), 'న్యూయార్క్‌'(2009) వంటి వరుస హిట్‌లతో బాలీవుడ్‌లో మోస్ట్‌వాంటెడ్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు కత్రిన.

ప్రత్యేక గీతాల్లో

'బాడీగార్డ్‌' చిత్రంతో ప్రత్యేకగీతాల్లో కనిపించడం మొదలు పెట్టిన కత్రిన.. ఆ తర్వాత వాటిలోని డ్యాన్సులతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా 'అగ్నిపథ్‌'లోని 'చిక్ని చమేలి..', 'బాంబే టాకీస్‌'లోని 'షీలా షీలాకీ జవానీ..', 'ధూమ్‌−3'లోని 'కమ్లి. కమ్లి..' గీతాల్లో కత్రిన వేసిన స్టెప్పులకు కుర్రకారు మొత్తం ఉర్రూతలూగిపోయింది.

తెలుగు, హిందీతో పాటు తమిళ్, మలయాళ సినిమాల్లోనూ నటించిన కత్రిన.. ఇప్పటివరకు మూడు ఫిలింఫేర్‌ అవార్డులు, మూడు జీ సినిమా పురస్కారాలు, రెండు స్క్రీన్‌ అవార్డులు, ఒక ఐఫా పురస్కారాన్ని దక్కించుకున్నారు. ఈస్ట్రన్‌ ఐస్‌లో 'సెక్సీయస్ట్‌ ఆసియన్‌ ఉమెన్‌'గా నాలుగు సార్లు ఎంపికయ్యారు. అంతేకాక మీడియా కత్రినా కైఫ్​ను అత్యంత ఆకర్షణీయమైన సెలబ్రిటీగా గుర్తించింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే అగ్రకథానాయికల్లో కత్రినా కైఫ్‌ ఒకరు. ప్రస్తుతం రోహిత్ శెట్టి దర్శకత్వంలో 'సూర్యవంశ్' చిత్రంలో నటిస్తున్నారు కత్రిన.

కసితో డ్యాన్స్‌ నేర్చుకున్న కత్రిన..

కత్రిన డ్యాన్స్‌ అనగానే యువతరం మదిలో 'షీలా కీ జవానీ', 'కాలా ఛష్మా', 'చిక్నీ ఛమేలీ' గీతాలు మెదులుతాయి. వెండితెరపై కిర్రాకు పుట్టించే డ్యాన్సర్‌గా పేరుతెచ్చుకుంది కత్రిన. ఇంతలా అదరగొట్టేలా డ్యాన్స్‌ వేసే కత్రినను ఓ డ్యాన్స్‌ మాస్టర్‌ "ఈమె డ్యాన్స్‌లో జీరో" అన్నాడట. సల్మాన్‌ ఖాన్‌తో 'వాంటెడ్‌'లో నటిస్తున్నప్పుడు ఆ సినిమా కొరియోగ్రాఫర్‌ సల్మాన్‌తో కత్రిన డ్యాన్సర్‌గా జీరో అని చెప్పాడట. అది తెలుసుకున్న ఆమె షాక్‌ గురయిందట. దానికి ముందు 'మల్లీశ్వరి' సినిమా సందర్భంగా కూడా ఇలాంటి అనుభవమే ఎదురైందట. ఆ చిత్ర పాటల్లో ఆమె సరిగా డ్యాన్స్‌ చేయకపోవడం వల్ల కొరియోగ్రాఫర్‌ రాజుసుందరం ముఖంలో ఎప్పుడూ అసంతృప్తి కనిపించేదట. కానీ కత్రినను ఆయన ఒక్కమాట అనేవారు కాదు. ఈ రెండు సంఘటనలు కత్రినలో డ్యాన్స్‌ బాగా చేయాలనే కసిని రగిలించాయట. ఈ విషయాన్ని కత్రిననే వివరించింది. “కథక్‌ గురువు వీరు కృష్ణన్‌ దగ్గర రోజూ ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు డ్యాన్స్‌ నేర్చుకున్నాను” అని ఈ సందర్భంగా కత్రినా ఆ రోజులను గుర్తుచేసుకుంది. ముఖ్యంగా కొరియోగ్రాఫర్‌ బాస్కో సీజర్‌ కలిగించిన ఆత్మ విశ్వాసంతోనే తనపై నుంచి జీరో డ్యాన్సర్‌ అనే ముద్రను నెమ్మదిగా చెరిపేసుకున్నట్లు తెలిపింది కత్రిన.

ABOUT THE AUTHOR

...view details