Karthikeya 2 Shooting: తెలుగులో ఫ్రాంఛైజీ సినిమాల జోరు కొనసాగుతోంది. అందులో భాగంగా రూపొందుతున్న మరో చిత్రం 'కార్తికేయ2'. 'కార్తికేయ'తో విజయాన్ని అందుకున్న నిఖిల్ - చందు మొండేటి కలయికలోనే రూపొందుతోంది. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ముఖ్యపాత్రని పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మాతలు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం యూరప్ దేశాల్లో జరుగుతోంది. స్పెయిన్, పోర్చుగల్, గ్రీస్‌లో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నట్టు సినీ వర్గాలు తెలిపాయి.
"ప్రేక్షకుల్ని ఆసక్తికి గురిచేసే మరో కొత్త రకమైన కథతో చందు మొండేటి తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఇప్పటికే సింహభాగం చిత్రీకరణ పూర్తయింది. హిమాచల్ ప్రదేశ్‌లో కీలకమైన సన్నివేశాల్ని తెర కెక్కించాం. ప్రస్తుతం యూరప్‌లో అందమైన ప్రాంతాల్లో చిత్రీకరణ జరుగుతోంది. ఏప్రిల్ తొలి వారంలో ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడిస్తామ"ని సినీ వర్గాలు తెలిపాయి. ఇందులో అనుపమ ముగ్ధ అనే యువతిగా కనిపించనుంది.
'ఆర్'.. ఎవరికీ భయపడని గ్యాంగ్‌స్టర్:వైవిధ్యభరితమైన చిత్రాలతో కన్నడతో పాటు తెలుగు ప్రేక్షకుల్లోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు ఉపేంద్ర. ఇప్పుడాయన దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి 'ఆర్' అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ విషయాన్ని వర్మ సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ మేరకు కొన్ని మోషన్ టీజర్లను ట్విటర్లో షేర్ చేశారు. భారతదేశ చరిత్రలో ఓ నమ్మశక్యం కాని ప్రత్యేకమైన గ్యాంగ్‌స్టర్ కథతో ఈ సినిమా రూపొందనున్నట్లు తెలియజేశారు.
"బెంగళూరులో స్ట్రీట్ ఫైటర్‌గా జీవితాన్ని ప్రారంభించిన 'ఆర్'.. ముంబయిలోని మాఫియానే కాకుండా దుబాయ్‌లో ఉన్న 'డీ' కంపెనీ అధినేత, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంనీ భయభ్రాంతులకు గురి చేశాడు. ఇప్పుడా శక్తిమంతమైన 'ఆర్' పాత్రలో ఉపేంద్ర నటిస్తున్నారు. ప్రపంచంలో ఎవరికీ భయపడని డేర్‌డెవిల్ గ్యాంగ్‌స్టర్ 'ఆర్'" అని వర్మ తన వరుస పోస్ట్‌లలో రాసుకొచ్చారు.