హీరో సుశాంత్ మరణించినప్పటి నుంచి బాలీవుడ్ చుట్టూ వివాదాలు, విమర్శలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే సినీ పరిశ్రమలో డ్రగ్ మాఫియా నడుస్తోందంటూ అనేక వార్తలు వినిపించాయి. ఈ విషయంపై నటి కంగనా రనౌత్ కొంతకాలంగా ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాలను వెల్లడిస్తోంది. ఇప్పుడు మరో ట్వీట్‌తో ఆసక్తికర చర్చకు తెరలేపింది.
ఇటీవలే బాలీవుడ్ ప్రముఖ హీరోలు మత్తుపదార్థాలకు బానిసలుగా మారినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే రణ్‌బీర్ కపూర్, రణ్వీర్ సింగ్, అయాన్ ముఖర్జీ తదితరులను డ్రగ్ టెస్టులు కోరింది కంగన.
"రణ్వీర్ సింగ్, రణ్‌బీర్ కపూర్, అయాన్ ముఖర్జీ, విక్కీ కౌశల్.. డ్రగ్టెస్టులకు వారి రక్త నమూనాలను ఇవ్వాలని అభ్యర్థిస్తున్నా. మీరు కొకైన్కు బానిసలుగా మారినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. అవన్నీ అసత్యమని నిరూపించాలని నేను కోరుకుంటున్నా. ఒకవేళ మీరు ఈ పుకార్లను ఛేదిస్తే.. లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలుస్తారు".
-- కంగనా రనౌత్, సినీ నటి
సినీ పరిశ్రమలో మాదకద్రవ్యాలు సర్వ సాధారణమైపోయాయని ట్విట్టర్లో పేర్కొంది కంగన. డ్రగ్స్ వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ఆమె అభిమానులను హెచ్చరించింది. మరోవైపు సుశాంత్ సింగ్ మృతి కేసు విచారణలో భాగంగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ).. రియా సహా మరో ఇద్దరిపై కేసు నమోదు చేసింది.