కమల్ హాసన్... విలక్షణ నటుడు. తను నటించే సినిమాల్లో ఏదో ఒక ప్రత్యేకత ఉండాలని, రొటీన్ పాత్రలకు అది భిన్నంగా ఉండాలని కోరుకునే వ్యక్తి. అందుకే అతడు సంచలన దర్శకుడు బాలచందర్‌కు సరైన జోడీ అయ్యాడు. కమల్ హాసన్ కేవలం నటుడే కాదు మంచి కథకుడు, స్కీన్ర్ ప్లే రచయిత, నిర్మాత, దర్శకుడు.. చివరికి అజ్ఞాత సంగీత దర్శకుడు కూడా. ఈరోజు (నవంబర్ 7) కమల్ హాసన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా కమల్ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుందాం..
కమల్ హాసన్ అసలు పేరు పార్థసారథి శ్రీనివాసన్. 1954 నవంబర్ 7న తమిళనాడులోని రామనాథపురానికి చేరువలో ఉన్న పరమక్కుడి పట్టణంలో జన్మించాడు. తండ్రి డి.శ్రీనివాసన్ న్యాయవాద వృత్తిలో ఉండేవారు. కమల్ తల్లి రాజలక్ష్మి మంచి డ్యాన్సర్. చిన్నప్పటి నుంచి కమల్ చదువుకుంటూనే కొన్ని సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు పోషిస్తూ ఉండేవాడు. అలా తన తొలి వెండితెర పరిచయం 1970లో విడుదలైన 'మాణవన్' చిత్రం ద్వారా జరిగింది. అందులో కమల్ కుట్టి పద్మిని చేసే డ్యాన్స్ సన్నివేశంలో ఆమెతో కలిసి కనిపిస్తాడు. 'అణ్నై వేలంకణ్ణి' సినిమాలో కాసేపు ఏసు క్రీస్తుగా కనిపిస్తాడు. 1975లో బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన 'అపూర్వ రాగంగ్' (తెలుగులో తూర్పు-పడమర) సినిమా హీరోగా మంచి బ్రేక్ ఇచ్చింది. రజనీకాంత్ ఈ సినిమాతోనే తెరంగేట్రం చేశాడు.
ఆస్పత్రి నుంచే బాల నటుడిగా...
1960లో ఎ.వి.ఎం. అధినేత మెయ్యప్ప చెట్టియార్ తమిళంలో 'కళత్తూర్ కన్నమ్మ' సినిమా నిర్మించారు. భీమ్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సావిత్రి, జెమిని గణేశన్ నాయికా నాయకులు. అందులో ఒక బాలుడి పాత్ర కోసం అన్వేషిస్తున్న మెయ్యప్పకు మద్రాసు జనరల్ ఆస్పత్రిలో ఒక పిల్లాడు కనిపించాడు. అయితే అది మెయ్యప్పకు కాదు.. వాళ్లావిడకు. ఐదేళ్ల వయసులో పరమక్కుడికి చెందిన ఆ బాలుడికి సైనస్ సమస్య తలెత్తగా మద్రాసు జనరల్ ఆస్పత్రిలో చేర్చి వైద్యం ఇప్పిస్తున్నప్పుడు ఆ అబ్బాయి కలివిడిగా హాస్పిటల్ మొత్తం చుట్టి వస్తూ, అందరినీ పలకరిస్తూ, ముద్దుముద్దు మాటలు వల్లిస్తూ ఉండేవాడు. ఈ పిల్లాడికి వైద్యం అందించే డాక్టర్ వద్దకు మెయ్యప్ప చెట్టి భార్య కూడా వైద్య సలహా నిమిత్తం వస్తుండేది. ఈ బాలుడు ఆమెకు కూడా తారసపడి కబుర్లు చెప్పాడు. ఆమె తన భర్తకు ఈ అబ్బాయి గురించి చెప్పింది. ఆ కుర్రాడ్ని స్టూడియోకి తీసుకెళ్లి స్కీన్ర్ టెస్టులు చేసి సంతృప్తి వ్యక్తం చేశారు స్టూడియో సిబ్బంది. ఇంకేముంది ఆ బాలుడు 'కళత్తూర్ కన్నమ్మ' సినిమాలో నటించాడు. ఆ బుడతడే మాస్టర్ కమల్ హాసన్. ఈ సినిమాను తెలుగులో 'మావూరి అమ్మాయి' పేరుతో ఎం.ఆర్.ఎం సంస్థ పేరిట మెయ్యప్ప కుమారులు కుమరన్, శరవణన్ అనువదించి 1960 అక్టోబరులో విడుదల చేశారు. తొలి ప్రయత్నంలోనే ఉత్తమ బాలనటుడుగా రాష్ట్రపతి చేతుల మీదుగా బంగారు పతకం అందుకున్నాడు.
బాలచందర్ దర్శకత్వంలో 1976లో 'మన్మథ లీలై' అనే సినిమా వచ్చింది. అందులో కమల్ హీరో. ఈ సినిమాతోనే జయప్రద, వై.విజయ, హేమా చౌదరి తొలిసారి వెండితెరకు పరిచయమయ్యారు. తర్వాత వచ్చిన ముత్తురామన్ సినిమా 'ఒరు ఊధప్పు కన్ సిముట్టిగిరదు'లో కమల్, సుజాత నటించారు. కమల్‌కు మూడవసారి ఫిలింఫేర్ బహుమతి తెచ్చిపెట్టిన చిత్రమిది. అలాగే దర్శకుడు ముత్తురామన్‌కు కూడా ఉత్తమ దర్శకుడిగా ఫిలింఫేర్ బహుమతి లభించింది. ఈ రెండు సినిమాలతో కమల్ తమిళ చిత్రరంగంలో స్థిరపడిపోయారు.
తెలుగులో కమల్‌ది మరోచరిత్ర..
కమల్ తెలుగులో నటించిన తొలి స్ట్రెయిట్ సినిమా 'అంతులేని కథ' (1976). అప్పుడే 'మన్మథలీల' డబ్బింగ్ వెర్షన్ కూడా విడుదలైంది. ఈ రెండు సినిమాలు ఆంధ్రరాష్ట్రంలో శతదినోత్సవాలు చేసుకున్నాయి.
'మరోచరిత్ర' సినిమా రెండవ స్ట్రెయిట్ చిత్రం. బాలచందర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కమల్ సరసన సరిత నటించగా, మాధవి ఒక ప్రత్యేక పాత్రను పోషించడం విశేషం. ఈ సినిమా రికార్డుల మీద రికార్డులు సృష్టించింది. గాయకుడు బాలుకి జాతీయ బహుమతి తెచ్చిపెట్టింది. కమల్ నటించిన ఎక్కువ తెలుగు సినిమాలకు బాలు డబ్బింగ్ చెప్పేవారు. తర్వాత కమల్ మరెన్నో మరపురాని చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.