కరోనా వల్ల దేశం మొత్తం అతలాకుతలమైపోతోంది. సినిమా పరిశ్రమ ఇందుకు మినహాయింపేం కాదు. షూటింగ్‌లు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి.. కొత్త చిత్రాల విడుదలలు వాయిదా పడ్డాయి. సినిమా తారలు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. అందులో జూ.ఎన్టీఆర్ కూడా ఒకరు. ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆయన ఓ ఆంగ్ల ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు ఆసక్తిరమైన విషయాలు పంచుకున్నారు. రాజమౌళికి జక్కన్న అనే పేరు పెట్టింది తానే అన్నారు. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ‘పాన్ ఇండియా’ సినిమా గురించి మాట్లాడుతూ.. పాన్ ఇండియా అనే పదం అంటే తనకు నచ్చదని.. ఒక మంచి సినిమాను దేశంలో ఉన్న అనేక భాషల్లో చూపించడమే తమ ఉద్దేశమని అన్నారు. పాన్ అంటే వంట పాత్ర తనకు గుర్తుకొస్తుందని ఆయన చెప్పారు.
'ఆర్ఆర్ఆర్' పనులు 2018 నవంబర్‌లోనే మొదలయ్యాయి. రాజమౌళి గురించి అందరికీ తెలిసిందే కదా.. ఆయన పరిపూర్ణత లేకుంటే అసలే ఒప్పుకోరు. అందుకే తన సినిమాకు చాలా సమయం తీసుకుంటారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’లో దాదాపు మెజార్టీ భాగం చిత్రీకరణ పూర్తయింది. కరోనా వల్ల నెలల పాటు వాయిదా పడింది.
* 'ఆర్‌ఆర్‌ఆర్' ఓటీటీలో విడుదల చేసే ఆలోచన ఏమాత్రం లేదు. బాహుబలి, జురాసిక్ పార్క్, అవెంజర్స్ వంటి సినిమాలను ఓటీటీలో చూస్తారా? ఇది కూడా అంతే. కొన్ని సినిమాలను థియేర్లలలోనే చూడాలి. ఓటీటీలో విడుదల చేయాలనే ఉద్దేశం లేదు. పెద్ద స్క్రీన్‌పై సమూహంగా చూస్తూ ఆస్వాదించే సినిమా ఇది అని తారక్ అన్నారు.