తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నూనూగు మీసాలోడు.. బాక్సాఫీసును కొల్లగొట్టేశాడు - ఆర్​ఆర్​ఆర్​

'కూచిపూడికైనా.. కుంగ్‌ఫూలకైనా.. దేనికైనా రెడీ' అంటూ ఎన్టీఆర్‌ 'స్టూడెంట్‌ నెంబర్‌ 1'లో పాట పాడుకున్నారు. ఆ పాట సినిమాలోని పాత్రకే కాదు, స్వతహాగా ఎన్టీఆర్‌కీ వర్తిస్తుంది. డ్యాన్సుల్లోనైనా.. ఫైట్లలోనైనా... భావోద్వేగాలు పండించడంలోనైనా.. వినోదం పండించడానికైనా.. ఇలా దేనికైనా ఎన్టీఆర్‌ రెడీనే. తాత పోలికలతో పుట్టిన తారక్.. నటన పరంగా తాతకి తగ్గ మనవడు అనిపించుకున్నారు. తొలి అడుగుల్లోనే స్టార్‌ కథానాయకుడిగా ఎదిగారు. ఆ తర్వాత ఆటు పోట్లు ఎదురైనా.. పడి లేచిన కెరటంలా మళ్లీ నిలదొక్కుకున్నారు. ప్రస్తుతం దక్షిణాదిలో అత్యంత శక్తిమంతమైన స్టార్‌ కథానాయకుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు ఎన్టీఆర్‌. నేడు (మే 20) ఆయన పుట్టినరోజు సందర్భంగా తారక్​ జీవితంలోని కొన్ని విశేషాలను తెలుసుకుందాం.

Jr.NTR Birthday special story
నూనూగు మీసాలోడు.. బాక్సాఫీసుని కొల్లగొట్టేశాడు

By

Published : May 20, 2020, 5:31 AM IST

Updated : May 20, 2020, 7:51 AM IST

ఎన్టీఆర్ .. ఈ మూడక్షరాల పేరు ఇప్పటికీ తెలుగు నేలని ఏలుతోంది. సినిమాల్లోనూ.. రాజకీయాల్లోనూ ఎన్టీఆర్ పేరు తలవని రోజంటూ లేదంటే అతిశయోక్తి కాదేమో? అంతలా ప్రభావితం చేసిన పేరు ఎన్టీఆర్. 'ఎన్టీఆర్' పేరు ఓ బ్రాండ్ ఇమేజ్. తరాలెన్ని గడిచినా చెదిరిపోని, ఇగిరిపోని వెండితెర శ్రీగంధంలా పరిమళిస్తూనే ఉంది. ఉంటుంది. తెలుగు సినీ పరిశ్రమ ఉన్నంతవరకూ ఆ పేరు విలువ అమూల్యం. ఎన్టీఆర్ నట వైభవం ఎన్న తరమా? పౌరాణికాలు.. జానపదాలు, చారిత్రాత్మక ఇతివృత్తాలతో పాటు సాంఘీక చిత్రాల్లోనూ సత్తా చూపించిన వైనం కడు రమణీయం.

అంతేనా! శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడులాంటి ఆరాధ్యులకు ఎన్టీఆర్ ఓ కేలండర్ ఫోటో. సినీసీమలో ఆయన చూపించిన ప్రతిభ అనితర సాధ్యం. నటుడిగా, స్క్రిప్ట్ రైటర్​గా, నిర్మాతగా, దర్శకుడిగా, స్థూడియో వ్యవస్థాపకుడిగా, థియేటర్ల యజమానిగా సినీమాధ్యమాన్ని తలకెత్తుకుని పురోగమించారు. తెలుగు సినీ చరిత్రపుటల్లో ప్రఖ్యాతి గాంచారు. అలాంటి మహోన్నత కథానాయకుడి మనవడిగా జూనియర్ ఎన్టీఆర్ కూడా తాత అడుగుజాడల్లోనే నడుస్తూ తెలుగు తెరని వెలిగిస్తున్నారు.

జూనియర్​ ఎన్టీఆర్​

అచ్చం తాతలానే పౌరాణికాల్లోనూ ప్రతిభ కనబరుస్తూ దూసుకుపోతున్నారు. సాంఘీకాల్లో సరేసరి. బాక్సాఫీస్ దగ్గర కాసులు కురిపించే చిత్రాలకు కేరాఫ్​గా నిలిచారాయన. మాట్నీ ఐకాన్​గా ప్రేక్షకుల అభినందనలు అందుకుంటున్నారు. ఆ ఎన్టీఆర్ నటవారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ సినీ సామ్రాజ్యాన్ని ఏలుతున్నారు. వైవిధ్యమైన పాత్రల్లో పరకాయ ప్రవేశం చేస్తూ.. ప్రతిష్ఠాత్మకమైన సంస్థల్లో పనిచేస్తూ సమర్ధత నిరూపించుకుంటున్నారు.

ఔను .. ఆ తాత పేరే తనది. అచ్చు గుద్దినట్లు తాత పోలికలూ తనవే. సినీ జగమెరిగిన ఆ తాతను ప్రతి భంగిమలోనూ ఆవహించుకుని.. ఆ ఆవాహనే అదృష్టంగా పరిణమించి తెలుగు సినిమాలో తిరుగులేని ఈ తరం కథానాయకుడిగా ఎదిగిన ఓ మనవడి కథ ఇది. అలనాటి తాత నట వైభవాన్ని చూస్తూ పెరిగిన ఒకప్పటి ప్రేక్షకుల నుంచి.. నేటి తరం వీక్షకుల వరకూ ఎన్టీఆర్ పేరు చిరపరిచితం. నాటి ఎన్టీఆర్ నట కీర్తికి కొనసాగింపు జూనియర్ ఎన్టీఆర్. ఈ తరం మోస్ట్ ఎనర్జటిక్ హీరోగా రసజ్ఞులైన అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానం సొంతం చేసుకున్నారు.

వ్యక్తిగతం

జూనియర్ ఎన్టీఆర్.. నందమూరి హరికృష్ణ, షాలిని దంపతులకు 1983 మే 20న హైదరాబాద్ మెహదీపట్నంలో పుట్టారు. విద్యారణ్య హైస్కూల్​లో విద్యను అభ్యసించారు. సెయింట్ మేరీ కాలేజ్​లో ఇంటర్మీడియట్ పూర్తి చేసారు. ఆ తర్వాత లక్ష్మీ ప్రణతిని ఎన్టీఆర్ వివాహమాడారు. వీరికి ఇద్దరు పిల్లలు.

ఎన్టీఆర్​ అతని భార్య లక్ష్మీ ప్రణిత

బహుముఖ ప్రజ్ఞ

ఎన్టీఆర్ కూచిపూడి నృత్య కళాకారుడు. సినీ యాక్టర్. టెలివిజన్ షోల నిర్వాహకుడు. నేపథ్య గాయకుడు. ఇలా.. అభిరుచి ఉన్న అన్ని రంగాల్లోనూ కృషి చేస్తూ బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శిస్తున్నారు. బాల్యంలో కూచిపూడి నాట్యంలో శిక్షణ పొందడం ఆయన నట జీవితానికి ఎంతగానో పనికి వచ్చింది. సినిమాల్లో కూడా మంచి డ్యాన్సర్​గా పేరు తెచ్చుకున్నారు. ఎలాంటి క్లిష్టతరమైన పాటలకైనా అడుగులు కదపగల నైపుణ్యం ఆయన సొత్తు. డైలాగ్ కింగ్​గా మాటల్లో మంటలు, కళ్ళల్లో క్రోధం... అభినయంలో ఆవేశం... వెరసి ఎన్టీఆర్ అని ఆయన అభిమానులు కీర్తిస్తూ ఉంటారు. సినిమాలోకి రాకముందు వందల సంఖ్యలో కూచిపూడి నృత్యప్రదర్శనలు చేసి రసజ్ఞులను ఎంతగానో ఆకట్టుకున్నారు.

తాతే పెట్టిన పేరు

కుటుంబంలో ఏర్పడిన కొన్ని అనివార్య కారణాలతో 11 ఏళ్ల వరకూ తాత ఎన్టీఆర్​ని కలుసుకునే అదృష్టం జూనియర్ ఎన్టీఆర్​కి కలగలేదు. ఓ రోజు మనవడిని చూడాలని ఉందంటూ స్వర్గీయ ఎన్టీఆర్ కబురు పంపడం వల్ల జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ, తల్లి షాలిని ఎంతో సంబరపడ్డారు. వెనువెంటనే తాత గారి దగ్గరికి తీసుకెళ్లారు. అచ్చం తన పోలికతోనే ఉన్న మనవడిని చూసి పులకించి పోయిన ఎన్టీఆర్ ఆ కుర్రాడికి తనపేరు పెట్టారు. దాంతో.. అప్పటి నుంచి నందమూరి తారక రామారావుగా ప్రాచుర్యంలోకి వచ్చారు. తన పేరు పెట్టడమే కాదు.. తన నట వారసుడిగానూ గుర్తింపు లభించేందుకు ఎన్టీఆర్ దోహదపడ్డారు.

జూనియర్​ ఎన్టీఆర్​

బ్రహ్మర్షి విశ్వామిత్రలో భరతుడిగా తొలి అవకాశం

1991లో ఎన్టీఆర్ బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాని తీస్తున్నారు. ఆ సినిమాలో మనవడికి భరతుడి వేషం ఇచ్చి ప్రోత్సహించారు. స్వయంగా తానే మేకప్ వేసి ఎలా నటించాలో మెళకువలు నేర్పారు. ఆ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ తెరంగేట్రం చేసినట్లయింది.

బాల రామాయణంలో శ్రీ రాముడిగా

శబ్దాలయ థియేటర్స్ పతాకంపై కవి, నిర్మాత మల్లెమాల 1996లో నిర్మించిన బాల రామాయణం చిత్రంలో శ్రీరాముడిగా జూనియర్ ఎన్టీఆర్ నటించారు. చూసి చూడగానే ఆకట్టుకునే రూపంతో ప్రతి ఒక్కరి అభిమానానికి పాత్రులయ్యారు తారక్. ఉత్తమ బాలల చిత్రంగా బాల రామాయణం జాతీయ పురస్కారాన్ని అందుకుంది. ఈ చిత్రంలో నటించినవారంతా చిన్నారులే. సుమారు 3 వేల మంది ఇందులో నటించారు. జంటనగరాల్లోని 30 స్కూళ్లలో విద్యార్థులను ఎంపిక చేసింది చిత్రబృందం. దర్శకుడు గుణశేఖర్ సినీ కెరీర్​లో మచ్చుతునకగా ఈ సినిమా నిలిచిపోతుంది. విమర్శకుల ప్రశంసలను అందుకున్న ఈ చిత్రం అనేక సాంస్కృతిక సంస్థల నుంచి పురస్కారాలను అందుకుంది.

జూనియర్​ ఎన్టీఆర్​

యువ హీరోగా నిన్ను చూడాలని...!

అభిరుచి గల చిత్రాలు నిర్మించడంలో ఉషా కిరణ్ మూవీస్​కు ఓ ప్రత్యేకత ఉంది. ఎందరో కొత్త హీరోలను పరిశ్రమకి పరిచయం చేసిన చరిత్ర ఉన్న ఉషా కిరణ్ సంస్థ నిర్మాణంలో 'నిన్ను చూడాలని' సినిమాతో యువ కథానాయకుడిగా జూనియర్ ఎన్టీఆర్ కూడా పరిచయం అయ్యారు. కొత్త సినిమా చేయాలని ఆ సంస్థ ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్న తరుణంలో దర్శకుడు రాఘవేంద్రరావు జూనియర్ ఎన్టీఆర్ గురించి నిర్మాత రామోజీరావు దృష్టికి తెచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ అంతకుముందు నటించిన బాలరామాయణం గురించి ప్రత్యేక ప్రస్తావన వచ్చింది. ఎన్టీఆర్ మనవడు, బాలరామాయణం కథానాయకుడైన జూనియర్ ఎన్టీఆర్ గురించి రామోజీరావు విని ఉండడం వల్ల వెంటనే ఆయన్ని సినిమాలోకి తీసుకున్నారు.

దర్శకుడు వి. ఆర్. ప్రతాప్ ఈ సినిమాను రొమాంటిక్ డ్రామాగా మలిచారు. 2001లో నిర్మితమైన ఈ సినిమా ఎన్టీఆర్​కు మంచి గుర్తింపుని తీసుకొచ్చింది. తాతను తలపించేలా ఉన్నాడనే ప్రశంసలు ఆయనకు దక్కాయి. అదే సంవత్సరం రాజమౌళి దర్శత్వంలో 'స్టూడెంట్ నంబర్ 1' చిత్రంలో కథానాయకుడిగా జూనియర్ ఎన్టీఆర్ పనిచేశారు. తన గురువైన రాఘవేంద్రరావు.. హీరోగా జూనియర్ ఎన్టీఆర్​ను తీసుకోమని చెప్పినప్పుడు ఆయన్ని చూసిన రాజమౌళి అసంతృప్తి వ్యక్తం చేశారట. కారణం.. ఎన్టీఆర్ లావుగా ఉండడమే. తన చిత్రంలో హీరో సన్నగా, స్మార్ట్​గా ఉండాలని భావించినా .. రాఘవేంద్రరావు చెప్పడం వల్ల సర్దుకుని ఆ చిత్రం చేశారు. అయితే.. ఆ చిత్రం అటు రాజమౌళికి, ఇటు జూనియర్ ఎన్టీఆర్​కు పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి ఎంతగానో ఉపయోగపడింది.

ఎన్టీఆర్​ 'ఆర్​ఆర్​ఆర్​' లుక్​

ఎన్టీఆర్​తో రాజమౌళి హ్యాట్రిక్

2001లో 'స్టూడెంట్ నంబర్ వన్' తీసిన రాజమౌళి ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్​తో హ్యాట్రిక్ కొట్టారు. 2003లో 'సింహాద్రి', 2007లో 'యమదొంగ'లాంటి బ్లాక్​బాస్టర్ చిత్రాలు తెరకెక్కించారు. ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' పేరుతో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా మరో ప్రతిష్ఠాత్మక చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పరిశ్రమలో తనకి ఇష్టమైన హీరో జూనియర్ ఎన్టీఆర్ అని బహిరంగంగానే రాజమౌళి ప్రకటించారు. నటుడిగా కన్నా, మంచి మనసున్న ఆత్మీయుడిగా తనకెంతో దగ్గరయ్యారని ఆయన ఓ సందర్భంలో చెప్పారు. 'యమదొంగ' చిత్రం కోసం లావు తగ్గాలని సూచించగానే వర్కౌట్లు చేసి గణనీయంగా జూనియర్ ఎన్టీఆర్ లావు తగ్గారు. సినిమా అంటే ప్రేమ.. అందుకే, పాత్రల్లో ఇమిడిపోవడానికి ఎంత కష్టమైనా ఓర్చుకుంటారు.

జూనియర్​ ఎన్టీఆర్​ పుట్టినరోజు కామన్​డీపీ

నేపథ్య గాయకుడిగా

జూనియర్ ఎన్టీఆర్ నేపథ్య గాయకుడిగానూ ప్రతిభ కనబరుస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీత దర్శకత్వంలో 'యమదొంగ' సినిమాలో 'ఓలమ్మి తిక్కరేగిందా?' అన్న పాటకు గళం ఇచ్చారు. ఈ పాట తన తాతగారు ఎన్టీఆర్​పై అప్పట్లో దర్శకుడు రాఘవేంద్రరావు 'యమగోల' సినిమా కోసం చిత్రీకరించినది. మణిశర్మ సంగీత దర్శకత్వంలో 'కంత్రీ' సినిమా కోసం 'వన్ టూ త్రి నేనొక కంత్రీ', దేవిశ్రీ ప్రసాద్ దర్శకత్వంలో 'అదుర్స్' చిత్రం కోసం 'చారీ' అన్న పాటకు, నాన్నకు ప్రేమతో సినిమా కోసం 'ఫాలో...ఫాలో' అన్న పాటకు గళమిచ్చారు. ఎస్. తమన్ సంగీత దర్శకత్వంలో 'రభస' కోసం 'రాకాసి...రాకాసి' అనే పాటను ఆలపించారు. తమన్ కన్నడంలో సంగీతం సమకూర్చిన చిత్రం 'చక్రవ్యూహ' కోసం 'చెలియా..చెలియా' అన్న పాటను జూనియర్ ఎన్టీఆర్ పాడారు.

అవార్డులు-పురస్కారాలు

జూనియర్ ఎన్టీఆర్ చిత్రసీమలో కనబరిచిన ప్రతిభకు అనేక అవార్డులు, పురస్కారాలు దక్కించుకున్నారు. రామాయణం చిత్రంలో నటించినందుకు యువకళావాహిని, భరతముని ఆర్ట్స్ అకాడమీ, ఏపీ సినీ గోయెర్స్ అసోసియేషన్ ఉత్తమ బాలనటుడి అవార్డులతో సత్కరించాయి. 'స్టూడెంట్ నంబర్ వన్' సినిమాలో నటనకు గాను ఏపీ సినీ గోయెర్స్ అసోసియేషన్ ఉత్తమ నూతన నటుడిగా సత్కరించింది. 'ఆది' సినిమాలో నటనకు గాను నంది స్పెషల్ జ్యురీ అవార్డు, సినిమా అవార్డులను ఉత్తమ నటుడిగా జూనియర్ ఎన్టీఆర్ అందుకున్నారు.

'సింహాద్రి'లో నటనకు ఉత్తమ నటుడిగా సంతోషం అవార్డు స్వీకరించారు. 'రాఖీ' చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా సినిమా అవార్డు అందుకున్నారు. 'యమదొంగ' సినిమాలో నటనకుగాను ఉత్తమనటుడిగా ఫిలింఫేర్ అవార్డు, జెమినీ టీవీ అవార్డు, సితార అవార్డులు దక్కించుకున్నారు. 'కంత్రీ' సినిమాలో నటనకుగాను ఉత్తమ నటుడిగా సౌత్ స్కోప్ అవార్డు అందుకున్నారు. 'టెంపర్' సినిమాకు ఉత్తమ నటుడిగా కళాసుధ పురస్కారం, సినిమా అవార్డు అందుకున్నారు. 'స్టార్ అఫ్​ ఆ సింగింగ్ సెన్సేషన్' గా నాన్నకు ప్రేమతో సినిమాలో 'ఫాలో.. ఫాలో' పాటకు గాను జూనియర్ ఎన్టీఆర్ గాయకుడిగా మిర్చి మ్యూజిక్ అవార్డు అందుకున్నారు. అలాగే, 'చక్రవ్యూహ' కన్నడ సినిమాలో పడిన 'చెలియా..చెలియా' పాటకుగాను మళ్ళీ మిర్చీ మ్యూజిక్ అవార్డు అందుకున్నారు.

'జనతా గారేజ్' సినిమాలో నటనకు జీ సినిమా అవార్డులు కింగ్ అఫ్ బాక్సాఫీస్ పురస్కారంతో సత్కరించింది. 'నాన్నకు ప్రేమతో' సినిమాకు ఫిలింఫేర్ సౌత్ ఉత్తమ నటుడు పురస్కారంతో గౌరవించింది. 'జనతా గారేజ్​'లో ఉత్తమ నటుడిగా సైమా అవార్డు దక్కింది. 'నాన్నకు ప్రేమతో', 'జనతా గారేజ్' సినిమాల్లో ప్రదర్శించిన నటనకు ఉత్తమ నటుడిగా రెండు నందులు జూనియర్ ఎన్టీఆర్ అందుకున్నారు. 'జై లవకుశ' సినిమాలో నటనకుగాను ఫిలింఫేర్ సౌత్ ఉత్తమ నటుడిగా సత్కరించింది. ఇలా ఎన్నో అవార్డులు ఆయన అందుకున్నారు.

జూనియర్​ ఎన్టీఆర్​ పుట్టినరోజు కామన్​డీపీ

టెలివిజన్ కెరీర్

సినిమాలో ఎంతో బిజీగా ఉన్నా స్టార్ మా లో 'బిగ్ బాస్' రియాల్టీ షోకి హోస్ట్ గా వ్యవహరించి ఆ కార్యక్రమాన్ని జనబాహుళ్యంలోకి తీసుకెళ్లారు.

రాజకీయాల్లో కూడా

తెలుగు నాట నట కుటుంబమే కాకుండా రాజకీయ కుటుంబంగా కూడా ఎన్టీఆర్ కుటుంబం అవతరించింది. నందమూరి వారసులు చాలామంది రాజకీయాల్లో పనిచేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కొద్ది రోజులు రాజకీయాల్లో పనిచేసారు. అయితే, ఇటీవల జరిగిన ఎన్నికలకు ఆయన దూరంగా ఉన్నారు.

తూటాల్లాంటి మాటలు

  • ఏయ్! నరికేస్తా. నువ్వు పెద్ద రౌడీననుకుంటున్నావా? నువ్వు గూండావైతే నీకంటే పెద్ద గూండానురా! నువ్వు రౌడీవైతే నీకంటే రౌడీని. నేనెవరో తెలుసా? హంతకుడిని.

- స్టూడెంట్ నంబర్ 1

  • ఈ సీమలో మొట్టమొదట కత్తి పట్టింది మా తాత....బాంబు చుట్టింది మా తాత....వాటితో నువ్వేమిట్రా పీకేది? ఏం...మా దగ్గర లేవా కత్తులు, బాంబులు. ఇదిగో..చూడు! నీ దగ్గర ఉన్న ఆయుధాల కంటే నా ఆశయం బలమైనది. చావుకి నేనెప్పుడూ భయపడనురా! ఆ చావే నన్ను చూసి భయపడుతుంది. కత్తులంటా కత్తులు.

- ఆది

  • ఒరేయ్ ! పులిని దూరం నుంచి నుంచి చూడాలనిపించిందనుకో..చూసుకో! పులితో ఫోటో దిగాలనిపించిననుకో..కొంచెం రిస్కయినా ఫర్వాలేదు. ట్రై చేయొచ్చు. సరే... చనువిచ్చింది కదాని పులితో ఆడుకుంటే మాత్రం వేటాడేస్తది..

-యమదొంగ

  • ఒక్కటి మాత్రం గుర్తుంచుకో.. నిప్పుతో పెట్టుకుంటే కాలిపోతావ్... నీళ్లతో పెట్టుకుంటే మునిగిపోతావ్...ఈ సాంబతో పెట్టుకుంటే చచ్చిపోతావ్!

- సాంబ

ఇదీ చూడండి.. అప్పుడే అడ్వాన్స్ తీసేసుకున్నారా!

Last Updated : May 20, 2020, 7:51 AM IST

ABOUT THE AUTHOR

...view details