కొందరు తారామణులు వివాహానంతరం నటనను కొనసాగిస్తుంటే.. మరికొందరు పెళ్లి తర్వాత కొంత బ్రేక్ తీసుకుని రీఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పుడు నటి జెనీలియా అదే చేయబోతుంది. త్వరలోనే టాలీవుడ్లో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలిసింది. హీరో రామ్ పోతినేనితో కలిసి ఓ సినిమా చేయనుందని సమాచారం. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని.. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని తెలుస్తోంది.
దక్షిణాదికి ప్రత్యేకం..
జెనీలియా.. 'సత్యం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తొలి సినిమాతో తనదైన అందం, అమాయకత్వం, నటనతో ఆకట్టుకుందీ భామ. తెలుగులో 'బొమ్మరిల్లు', 'రెడీ' వంటి పలు చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. తమిళ, హిందీ తదితర భాషల్లోనూ నటించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. కెరీర్ పీక్ స్టేజీలో ఉన్నప్పుడు హిందీ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత నటనకు దూరమైంది.