అనుష్క, కాజల్, తమన్నా, శ్రుతిహాసన్ తదితర సీనియర్ నాయికలు ఇంకా జోరుమీద ఉన్నారు. సమంత, ప్రియమణి, శ్రియ తదితర భామలు పెళ్లి తర్వాతా వరుస అవకాశాలతో అదరగొడుతున్నారు. రష్మిక, పూజా హెగ్డే, కీర్తి సురేష్, సాయి పల్లవి, రకుల్‌ప్రీత్ సింగ్, రాశీ ఖన్నా స్టార్లుగా హవా చూపుతున్నారు. నివేదా థామస్, అనుపమ పరమేశ్వరన్, నివేదా పేతురాజ్, నిధి అగర్వాల్, నభా నటేష్.. ఇలా నవతరం హీరోలకి తగ్గ భామలూ బోలెడంతమంది ఉన్నారు. అయినా సరే... ఈ ఏడాది కొత్తందాలకి ఎర్రతివాచీ పరిచేసింది తెలుగు చిత్రసీమ. అమృత అయ్యర్, కేతికాశర్మ, ప్రియా భవాని శంకర్, కృతిశెట్టి, వర్ష బొల్లమ్మ... ఇలా పలువురు అవకాశాల్ని దక్కించుకున్నారు. వరుణ్‌తేజ్ చిత్రం కోసం బాలీవుడ్ నుంచి సయీ మంజ్రేకర్ వచ్చింది. బాలకృష్ణ - బోయపాటి కలయికలో రానున్న చిత్రం కోసం ఓ కొత్తందం దిగుమతి కాబోతోంది.
సినిమా విడుదలకు ముందే...
తొలి అవకాశం విషయంలో అదృష్టం ముఖ్య పాత్ర పోషిస్తుందేమో కానీ... మలి అవకాశానికి మాత్రం విజయమే ప్రాతిపదిక అంటుంటాయి సినీ వర్గాలు. అయితే కొంతమంది కథానాయికల అందం.. విజయాలతో సంబంధం లేకుండా ఆకర్షిస్తుంటుంది. దాంతో చాలామంది ఫలితాలతో సంబంధం లేకుండా కొంతకాలం మెరుస్తుంటారు. కానీ తొలి సినిమా విడుదల కాకమునుపే, మరో కొత్త అవకాశం అందుకుంటున్నారు నాయికలు. అందులో అమృత అయ్యర్ ఒకరు. ఆమె అనువాద చిత్రం 'విజిల్'తో మెరిసింది. అందులో చేసింది చిన్న పాత్రే అయినా..ఆమె అందం తెలుగు పరిశ్రమని ఆకట్టుకుంది. దాంతో వరుసగా అవకాశాలు వెల్లువెత్తాయి. '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?' చిత్రంలో నటించిందామె. రామ్ చిత్రం 'రెడ్'లోనూ ముఖ్య పాత్ర పోషించింది. ఇటీవల నాగశౌర్యకి జోడీగా మరో చిత్రం కోసం ఎంపికైనట్టు సమాచారం.