కామెడీ సినిమాలో నటించాలనే కోరిక చాలా రోజులుగా ఉందని తన మనసులో మాటను చెప్పారు నటి సాయిపల్లవి. సరైన కామెడీ స్ప్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. తనదైన శైలి నటన, డ్యాన్స్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు పల్లవి. ఇటీవలే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన 'లవ్‌స్టోరీ' చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చి విజయాన్ని అందుకున్నారు. ఈ నేపథ్యంలో కాస్త బ్రేక్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇన్‌స్టాలో సరదాగా అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగానే తన మనసులోని మాటను బయటపెట్టారు.
"కామెడీ జోనర్లో ఓ సినిమా చేయాలని ఉంది. అలాంటి పాత్ర చేసినప్పుడు ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో చూడాలి. ప్రాపర్ కామెడీ స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్నా" అని చెప్పారు. ఇంట్లో ఉన్నప్పుడు, ఖాళీ సమయాల్లో ఏం చేస్తారని మరో నెటిజన్ అడగగా.. బాగా తిని హాయిగా నిద్రపోతానని తెలిపింది. ఇటీవల చూసిన సినిమాల్లో 'డ్యూన్'(హాలీవుడ్), 'సర్దార్ ఉద్ధమ్'(హిందీ) నచ్చాయని చెప్పారు. పకృతి ఒడిలో సేద తీరడం ఇష్టమని వెల్లడించారు. ఫిజికల్ ఫిట్నెస్తో పాటు మానసిక ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇస్తారని చెప్పుకొచ్చారు.