కరోనా దెబ్బకు ఈ ఏడాది చిత్ర పరిశ్రమ మొత్తం కుదేలైపోయింది. 7నెలల కాలంలో దాదాపు రూ.1100 కోట్లు నష్టపోయింది. మిగిలిన రెండు నెలలైనా బాక్సాఫీస్ ముందు కాసుల చప్పుడు వినిపిస్తుందా అంటే.. అదీ అనుమానంగానే కనిపిస్తోంది. అక్టోబరు 15నుంచే థియేటర్లు తెరచుకోవచ్చని అనుమతులిచ్చినా.. ఎక్కడా పూర్తి స్థాయిలో సినిమా సందడి మొదలు కాలేదు. నవంబరు నుంచి థియేటర్లు తెరచుకుంటాయనే నమ్మకం.. పరిశ్రమ వర్గాల్లో కనిపిస్తుంది. హాళ్లు తెరచుకున్నా.. వెండితెరపై సందడి చేసేందుకు కొత్త చిత్రాలేవి సిద్ధంగా లేవని తెలుస్తోంది.
ఓటీటీ వైపు మొగ్గు..
యాభై శాతం సీటింగ్ సామర్థ్యంతో థియేటర్లు నిర్వహించాల్సి రావడం, అది గిట్టుబాటు అవుతుందో లేదో అన్న భయాలతో చాలా మంది నిర్మాతలు ఇప్పటికీ సాహసించడం లేదు. ఇప్పుడీ భయాలతోనే దీపావళి సీజన్‌పైనా నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ క్రమంలోనే ఓటీటీ వైపు మొగ్గు చూపుతున్న సినిమాల జాబితా మరింత పెరుగుతోంది. ఇప్పటికే సూర్య 'ఆకాశం నీ హద్దురా', అక్షయ్ కుమార్ 'లక్ష్మీ', నయనతార 'అమ్మోరు తల్లి', కీర్తి సురేష్ 'మిస్ ఇండియా', జయం రవి 'భూమి', పాయల్ రాజ్‌పూత్ 'అనగనగా ఓ అతిథి' వంటి చిత్రాలు ఓటీటీ విడుదలకు ముహూర్తాలు ఖరారు చేసుకున్నాయి.
ఒకవేళ నవంబరు మధ్య నుంచి వెండితెర వినోదాలకు తెరలేపినా.. థియేటర్లలో రీరిలీజ్ చిత్రాలు, చిన్న సినిమాల హంగామానే కనిపిస్తుంది. ఇన్నాళ్లూ ఓటీటీ వినోదాలకు అలవాటు పడిన సినీప్రియుల్ని థియేటర్లకు రప్పించాలంటే.. వీటి సామర్థ్యం అసలు సరిపోదనే చెప్పాలి. స్టార్ల ఆకర్షణ, కథా బలం ఉన్న కొత్త చిత్రాలు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాల్సి ఉంటుంది.