తెలంగాణ

telangana

ETV Bharat / sitara

టాలీవుడ్​ సెలబ్రిటీలు.. తొలి 'ప్రేమ' అనుభూతులు

కాలేజీ రోజుల్లో చేసే చిలిపి పనులూ, మనసును గిలిగింత పెట్టే చిన్నపాటి క్రష్‌లూ, అందుకునే లేదా ఇచ్చే ప్రేమలేఖలూ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. తమకూ అలాంటి మధురానుభూతులు ఉన్నాయని చెబుతున్నారు ఈ నటీనటులు..

hollywood celebrities first crushes and their love stories
టాలీవుడ్​ సెలబ్రిటీలు.. తొలి 'ప్రేమ' అనుభూతులు

By

Published : Feb 14, 2021, 8:00 AM IST

అమ్మా నేనూ నవ్వుకున్నాం - రాశీఖన్నా

నేను కాలేజీలో చదివే రోజుల్లో ఓ సీనియర్‌ ప్రేమలేఖ రాశాడు. అతను నాకు ఇవ్వడానికి ప్రయత్నిస్తే... నేను తప్పించుకోవాలనుకున్నా. చివరకు ఎలాగోలా నా వెంటపడి మరీ ప్రేమలేఖ, గులాబీపువ్వు ఇచ్చి వెళ్లిపోయాడు. నాకు మొదటినుంచీ అతనంటే ఇష్టంలేదు కానీ... ఆ లెటర్‌ మాత్రం చదివా. చాలా అద్భుతంగా అనిపించింది. దాంతో ఇంటికి తీసుకెళ్లి అమ్మకూ చూపించా. మా అమ్మ కూడా దాన్ని చదివాక మేమిద్దరం కలిసి చాలాసేపు నవ్వుకున్నాం. ఆ తర్వాత అమ్మ అతనంటే ఇష్టమైతే చెప్పమని పదేపదే అడిగినా నాకు ఆసక్తిలేదని చెప్పేశా. తర్వాత అతనేమయ్యాడో తెలియదు మరి.

రాశీఖన్నా

ఒక్క ప్రేమలేఖ కూడా రాయలేదు - విజయ్‌ దేవరకొండ

చెబితే ఎవరూ నమ్మరు కానీ... నేను ఇప్పటి వరకూ ఎవరికీ ప్రేమలేఖ రాయలేదు. ఎందుకంటే నేను పదో తరగతి వరకూ బాయ్స్‌ హాస్టల్‌లోనే ఉన్నా. అక్కడ రాసే అవకాశం లేదు. ఇంటర్‌లో కో-ఎడ్యుకేషన్‌లో చేరినా... అమ్మాయిలంటే భయం. దాంతో వాళ్లతో ధైర్యంగా మాట్లాడేవాడిని కూడా కాదు. అమ్మాయిలతో పరిచయం ఎలా పెంచుకోవాలనే విషయం ఆలోచించేలోపే రెండేళ్లు గడిచిపోయాయి. డిగ్రీలో ధైర్యం వచ్చింది కానీ... ప్రేమలేఖ రాసే సమయం మాత్రం ఉండేది కాదు. కానీ ఇప్పుడు చాలామంది అమ్మాయిల నుంచి నాకు ఉత్తరాలు వస్తుంటాయి. వాటిని మా వాచ్‌మెన్‌ తెచ్చి ఇస్తుంటాడు. అవి చూసినప్పుడు నవ్వొస్తుంది కానీ... తీరిగ్గా ఉన్నప్పుడు అన్నింటినీ తప్పకుండా చదువుతా.

విజయ్ దేవరకొండ

ఈమెయిల్‌ చేసేవాడిని - నాగచైతన్య

నేను ఎక్కువగా కాలేజీ కన్నా బయటే గడిపేవాడిని. ఆ రోజుల్లో చిన్నచిన్న క్రష్‌లూ, ప్రేమల్లాంటివి మామూలే కానీ ఆ విషయాలు ఎప్పుడైనా ఇంట్లో తెలిస్తే మాత్రం గొడవలయ్యేవి. అయితే... మా రోజులు వచ్చేసరికి లవ్‌లెటర్‌లు ఆగిపోయి ఈమెయిల్స్‌ మొదలయ్యాయి. దాంతో అందరు అబ్బాయిల్లానే నేను కూడా కొందరికి ఈమెయిల్స్‌ పంపేవాడిని. అలా పంపినవారిలో ఒకరిద్దరి నుంచి సమాధానం వచ్చింది కానీ... మిగతావాళ్లు నాతో మాట్లాడటం మానేసేవారు. ఏదేమైనా అవన్నీ ఎప్పటికీ మంచి అనుభూతులే.

అక్కినేని నాగచైతన్య

శాంతాక్లాజ్‌కు ఉత్తరాలు రాసేదాన్ని - పూజాహెగ్డే

టీనేజీలోకి రాకముందు నేను బోలెడు ఉత్తరాలు రాసేదాన్ని... ఎవరికో తెలుసా శాంతాక్లాజ్‌కు. ఆయన నుంచి ఒక్కసారైనా సమాధానం వస్తుందని కూడా ఆశించేదాన్ని కానీ ఒక్కరోజు కూడా రాలేదు. కాస్త పెద్దయ్యాక శాంతాక్లాజ్‌ అంటూ ఎవరూ ఉండరని అర్థమయ్యాక రాయడం మానేశా. అయితే... విచిత్రంగా నాకెవ్వరూ ఉత్తరాలు రాయలేదు. ఎందుకంటే నేను మొదటి నుంచీ టామ్‌బాయ్‌లా ఉండేదాన్ని. అబ్బాయిలతో సమానంగా బాస్కెట్‌బాల్‌ ఆడేదాన్ని. కాస్త పొడుగ్గా కూడా ఉండటం వల్ల నన్నెవరూ అమ్మాయిలా చూసేవారు కాదేమో! బహుశా అందుకే నాకు ప్రేమలేఖలు వచ్చి ఉండవు.

హీరోయిన్ పూజా హెగ్డే

దాన్ని భద్రంగా దాచుకున్నా - కీర్తి సురేష్‌

నేను చదువుకునే రోజుల్లో ఒక్కరు కూడా లవ్‌లెటర్‌ రాయలేదు కానీ... నటినయ్యాక మొదటి ప్రేమలేఖను అందుకున్నా. అది కూడా చాలా విచిత్రంగా జరిగింది. ఓ రోజు నగల దుకాణం ప్రారంభోత్సవానికి వెళ్లా. అక్కడ ఒకతను నన్ను అదేపనిగా గమనిస్తున్నాడు. నాకు మొదట కాస్త ఇబ్బందిగా అనిపించినా పెద్దగా పట్టించుకోలేదు. చివరకు అతను అందరినీ తోసుకుంటూ గబగబా నా దగ్గరకు వచ్చి ఓ పెద్ద గిఫ్ట్‌ ఇచ్చేసి వెళ్లిపోయాడు. ఇంటికెళ్లాక దాన్ని తెరిచి చూస్తే... అందులో నాకు సంబంధించిన ఫొటోలతో రూపొందించిన ఓ ఆల్బమ్‌తోపాటూ లెటర్‌ కూడా ఉంది. దాన్ని తెరిస్తే... తన వివరాలు తెలియజేస్తూ, ఆఖరున నన్ను పెళ్లి చేసుకోవాలనుందంటూ రాశాడు. నవ్వు వచ్చినా... అది నేను అందుకున్న మొదటి ప్రేమలేఖ కాబట్టి... దాన్ని ఇప్పటికీ అలాగే దాచుకున్నా.

కీర్తి సురేశ్

ABOUT THE AUTHOR

...view details