మన హీరోలు ప్రేమ విజేతలు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే... వాటన్నిటినీ అధిగమించి మనసిచ్చిన అమ్మాయిని మనువాడతారు. తెరపైనే కాదు... నిజ జీవితాల్లోనూ అంతే. ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోలు ఎంతో మంది. అందులో నిఖిల్ ఒకరు. వైద్యురాలైన పల్లవి వర్మను ప్రేమించి, పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు నిఖిల్. ప్రేమికుల రోజు సందర్భంగా ఆయనతో 'ఈనాడు సినిమా' ముచ్చటించింది.
ప్రేమికుల రోజు సందర్భంగా మీ అర్ధాంగికి బహుమానం ఏం ఇవ్వనున్నారు?
మేం తరచూ ఒకరికొకరు బహుమానాలు ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటాం. నెలకోసారైనా తనకు సర్‌ప్రైజ్ ఇస్తుంటా. నా దృష్టిలో ప్రతి రోజూ ప్రేమదే. అలాగని వాలెంటైన్స్ డేను నమ్మనని కాదు. ప్రేమను ఆ ఒక్క రోజుకు పరిమితం చేయడం ఇష్టం ఉండదంతే. ఈ ప్రేమికుల రోజున పల్లవి, నేను కలిసి డిన్నర్‌కు బయటికి వెళ్లాలని ప్లాన్ చేశా.
మీకు ఎలాంటి బహుమానాలు అందుతుంటాయి?
కొత్తగా వచ్చిన ఫ్యాషన్ దుస్తులతో నాకు సర్‌ప్రైజ్ ఇస్తుంటుంది పల్లవి. మొన్న ఖరీదైన వాచీని ఇచ్చింది. అదీ తను పోగేసుకున్న డబ్బులతో. ఆ రోజే తనకు చెప్పా 'బహుమానాలు ఇచ్చే బాధ్యత అబ్బాయిలదే, నువ్వేం ఇవ్వకులే' అని చెప్పా.
మీ ఇద్దరూ 'ఐ లవ్ యూ' చెప్పుకొన్న సందర్భం?
మొదట నేనే చెప్పా. అదీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాకే. ఒక ఫ్రెండ్ పుట్టినరోజు వేడుకలో పల్లవిని చూశా. ఫోన్ నంబర్ తీసుకొని మాటలు కలిపా. కొన్ని నెలల మా సాన్నిహిత్యం తర్వాత తనతోనే నా జీవితం అనిపించింది. నాపైన తనకున్న ప్రేమ అర్థమైంది. పల్లవి తన స్నేహితుల్లో చాలా పాపులర్. తనకు శ్రేయోభిలాషులు ఎక్కువ. అందుకే తనని, ముప్పై మందిదాకా తన స్నేహితుల్ని నాతోపాటు గోవాకు రమ్మని ఆహ్వానించా. అక్కడికి వెళ్లాక పల్లవికి ప్రపోజ్ చేశా. అప్పుడే తొలిసారి తనకి 'ఐ లవ్ యూ' చెప్పా. నా జీవితాంతం గుర్తుండే జ్ఞాపకం అది. హైదరాబాద్‌కు వచ్చాక ఇక్కడ నిశ్చితార్థం చేసుకున్నాం. ఇదంతా గతేడాది ఫిబ్రవరిలోనే జరిగింది (నవ్వుతూ).
కాలేజీ రోజుల్లో 'ప్రేమికుల రోజు' సందడి ఎలా ఉండేది?
అసలు సిసలు సందడంటే అప్పుడే కదా. ఆ సమయంలో పనీ పాట, బాధ్యత ఏదీ ఉండేది కాదు. ప్రతి రోజూ పండగే అన్నట్టుగా ఒక రోజు హగ్ డే అని, ఒక రోజు కిస్ డే అని సంబరాలు చేసుకునేవాళ్లం. నాకు బాగా గుర్తు, ఇంటర్‌లో ప్రేమికుల రోజు వచ్చిందని మా స్నేహితులు ఎనిమిది మందిమి రెడ్ షర్ట్ వేసుకుని కాలేజీకి వెళ్లాం. విషయం ప్రిన్సిపల్‌కు తెలిసింది. అంతే... మా బ్యాచ్‌ని పిలిచి, వెంటనే కాలేజీ నుంచి బయటికి వెళ్లమని చెప్పారు.
ఎవరికైనా ప్రేమలేఖలు రాశారా? మీరు అందుకున్నారా?
ప్రేమలేఖలా... నాకంత ప్రతిభ లేదు. స్వీట్ బాక్సుల్లాంటివి మాత్రం తీసుకెళ్లి పంచేవాళ్లం. నాకు రహస్యంగా కొన్ని వచ్చేవి. అవి ఎవరు రాసేవాళ్లో ఇప్పటికీ తెలియదు. గమ్మత్తుగా రాసేవాళ్లా లేక, సీరియస్‌గా రాసినవో తెలియదు. మా ఇంటికే వచ్చేవి ఆ లేఖలు. ఒకసారి మా అమ్మకు దొరికాయి. అప్పటికి కాలేజీలో ఎక్కువ ఓవరాక్షన్ చేసే పాపులర్ అబ్బాయిని నేనే. ఆ విషయం మా అమ్మకు తెలిసి... 'నువ్వు కాలేజీకి వెళ్లేది చదుకోవడానికా? ఇలా అమ్మాయిల కోసమా' అని గట్టిగానే చివాట్లు పెట్టారు. ఇదంతా హీరోని కావడానికి కొన్నాళ్ల ముందే జరిగింది. హీరో అయ్యాక లేఖలు రాలేదు కానీ... సామాజిక మాధ్యమాల్లోనూ సందేశాలు కనిపిస్తుంటాయి.
ప్రేమకి మీరిచ్చే నిర్వచనం?
జీవితాంతం విడిపోకుండా ఉండటమే ప్రేమ అనేది నా అభిప్రాయం. కలిశామా, డేట్ చేశామా, వదిలేశామా అన్నట్టు ఉండకూడదు. లవ్ అనే మాట చెప్పే ముందు చాలా ఆలోచించి చెప్పాలనేది నా అభిప్రాయం. మనకు మనసిచ్చిన అమ్మాయిని చూసుకునే సామర్థ్యం ఉండాలి. మన చేయి పట్టుకుని నడిచే అమ్మాయికి జీవితాంతం కలిసుండేంత పరిణతి ఉండాలి. అప్పుడే తల్లిదండ్రులు ఒప్పుకొంటారు. నేను చేసిందదే. మా ఆలోచనల్ని విన్నాక... మాది టైమ్ పాస్ ప్రేమ కాదు, జీవితాంతం కలిసుంటారనే నమ్మకం ఏర్పడింది. అందుకే మా పెళ్లికి ఒప్పుకొన్నారు పెద్దలు.
పెళ్లి తర్వాత జీవితం ఎలా ఉంది?
చాలా సంతోషంగా గడుస్తోంది. ఇన్ని రోజులు పెళ్లి చేసుకోకుండా తప్పు చేశానా! అనిపించిన సందర్భాలు చాలానే. పొద్దున 7 గంటలకు షూటింగ్ అంటే... నా భార్యా 6 గంటలకే లేపేస్తుంది. ఇంకో అరగంట పడుకుంటా అంటే, 'లేదు, లేచి రెడీ కావాల్సిందే' అని లేపేస్తుంది. పెళ్లి తర్వాత సెట్‌కి ఒక్క రోజు ఆలస్యంగా వెళ్లలేదు. మన కోసం తీసుకునే చిన్న జాగ్రత్తలే, జీవితంపై చాలా ప్రభావం చూపిస్తుంటాయి. ఆ విషయంలో నేను సంతోషంగా ఉన్నా.
నాకు 'ఖుషీ' చిత్రం అంటే ఇష్టం. అందులో హీరోహీరోయిన్లు కొట్టుకుంటూనే ఉంటారు. కానీ కలిసుంటారు. ఇబ్బందులొచ్చాయని అంత సులభంగా విడిపోకూడదు. అప్పుడే బంధం నిలబడుతుంది. ఇప్పుడు చేస్తున్న '18 పేజీస్' సుకుమార్ రాసిన ప్రేమకథ. చాలా భిన్నంగా ఉంటుంది. దాన్ని అంతే కొత్తగా తీస్తున్నారు దర్శకుడు ప్రతాప్