తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆర్యన్ ఖాన్ బెయిల్ విచారణ బుధవారానికి వాయిదా - ఆర్యన్ ఖాన్ బెయిల్ బాంబే హైకోర్టు

డ్రగ్స్ కేసులో అరెస్టయిన షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్​ ఖాన్​ బెయిల్​కు సంబంధించిన హైకోర్టు విచారణ బుధవారానికి వాయిదా పడింది. ఆర్యన్ తరఫున మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.

Aryan Khan
ఆర్యన్ ఖాన్

By

Published : Oct 26, 2021, 6:12 PM IST

Updated : Oct 26, 2021, 6:50 PM IST

క్రూజ్‌ నౌక డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన బాలీవుడ్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ రేపటికి (అక్టోబర్ 27) వాయిదా పడింది. బుధవారం మధ్యాహ్నం 2.30గంటలకు ఈ కేసు విచారణను కొనసాగించనున్నట్టు బాంబే హైకోర్టు తెలిపింది. దీంతో ఆర్యన్‌ ఈరోజు రాత్రికి కూడా ఆర్ధర్‌ రోడ్డులోని జైలులోనే ఉండనున్నారు. అక్టోబర్‌ 3న అరెస్టయిన ఆర్యన్‌ ఖాన్‌.. దాదాపు రెండు వారాలకు పైగా జైలులో ఉంటున్నాడు. ఆర్యన్‌ ఖాన్‌ తరఫున మాజీ అటార్నీ జనరల్‌, ప్రముఖ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ బాంబే హైకోర్టులో వాదనలు వినిపించారు. సుదీర్ఘంగా కొనసాగిన వాదనల సందర్భంగా పలు కీలక అంశాలను ప్రస్తావించారు. కుట్ర పూరితంగానే ఆర్యన్‌ను ఎన్‌సీబీ అధికారులు ఈ కేసులో ఇరికించారన్నారు.

ఆర్యన్‌ వద్ద ఎలాంటి డ్రగ్స్‌ లభించలేదని.. డ్రగ్స్‌ తీసుకున్నట్టు కూడా వైద్య పరీక్షల ఆధారాలేవీ లేవన్నారు. మరి అలాంటప్పుడు ఆర్యన్‌ ఏవిధంగా సాక్ష్యాధారాలను ప్రభావితం చేస్తారన్నారు. తనతో పాటు కలిసి వచ్చిన ఓ వ్యక్తి వద్ద డ్రగ్స్‌ దొరికితే.. ఆర్యన్‌ను ఎలా అరెస్టు చేస్తారు? 20 రోజులకు పైగా ఎలా జైలులో ఉంచుతారు? అని ప్రశ్నించారు. అతడి వయస్సును దృష్టిలో ఉంచుకొని ఆర్యన్‌కు బెయిల్‌ మంజూరు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. కాగా, డ్రగ్స్‌ రవాణాలో ఆర్యన్‌ పాత్ర ఉందని, అందువల్ల బెయిల్‌ ఇవ్వొద్దని ఎన్‌సీబీ వాదించింది. ఇరుపక్షాల వాదనలు విన్న బాంబే హైకోర్టు ఈ కేసు విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

ఇద్దరికి బెయిల్

ఈ కేసు విషయంలో అరెస్టయిన మనీష్ రజగారియా, అవిన్ సాహులక్ బెయిల్ మంజూరు చేసింది ఎన్​సీబీ ప్రత్యేక న్యాయస్థానం. వీరిద్దరూ పార్టీ జరిగిన నౌకలోకి గెస్టులుగా ప్రవేశించారు.

ప్రభాకర్ ఎవరో తెలియదు

కాగా.. ఈ కేసులో సంచలన ఆరోపణలు చేసిన ప్రత్యక్ష సాక్షి ప్రభాకర్ సాయీల్‌ ఎవరో తనకు తెలియదని ఆర్యన్‌ చెప్పడం గమనార్హం. బెయిల్‌ విచారణ సందర్భంగా ఆర్యన్ తరఫున న్యాయవాదులు బాంబే హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. ఇందులో నిందితుడి తరఫు నుంచి ఎన్‌సీబీ అధికారులతో ఎలాంటి ఒప్పందం జరగలేదని ఉంది. అంతేగాక, ప్రభాకర్‌ ఎవరో తనకు తెలియదని, ఆయనతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని ఆర్యన్‌ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. "ఈ కేసులో వస్తోన్న ఆరోపణలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇది పూర్తిగా ఎన్‌సీబీ అధికారులు, రాజకీయ నాయకుల మధ్య విషయం. ఎన్‌సీబీ అధికారులకు వ్యతిరేకంగా నేను ఎలాంటి ఆరోపణలు చేయలేదు" అని ఆర్యన్‌ అఫిడవిట్‌లో తెలిపినట్లు సమాచారం.

సమీర్​పై విచారణ

ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్‌సీబీ జోనల్‌ డైరెక్టర్ సమీర్‌ వాంఖడేపై విజిలెన్స్‌ కమిటీ విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే సమీర్‌ మంగళవారం దిల్లీలోని ఎన్‌సీబీ ప్రధాన కార్యాలయానికి హాజరయ్యారు.

Last Updated : Oct 26, 2021, 6:50 PM IST

ABOUT THE AUTHOR

...view details