Gangubai son fire on aliabhatt movie: బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ నటించిన 'గంగూబాయ్ కతియావాడీ' ప్రకటించినప్పటి నుంచి సమస్యలను ఎదుర్కొంటోంది. ఫిబ్రవరి 25న థియేటర్లలో సందడి చేయనున్న ఈసినిమాకు తాజాగా మరో ఊహించని షాక్ ఎదురైంది. ఈ సినిమాపై గంగూబాయి తనయుడు అసహనం వ్యక్తం చేశారు. గంగూబాయ్ కుటుంబం, ఆమె దత్తపుత్రుడు బాబు రావుజీ షా, ఆమె మనవరాలు భారతి ఈ చిత్రం పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు ఉన్నారు. ఓ ఇంటర్వ్యూలో తమ ఆందోళనను వెల్లడించారు. కాగా, ముంబయిలోని మాఫియా క్వీన్ గంగూబాయ్ జీవితం ఆధారంగా సంజయ్ లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
"నా తల్లిని వేశ్యగా మార్చారు.ఇప్పుడు అనేకమంది అమ్మ అసలు వేశ్యనా లేదా సామాజిక కార్యకర్తనా అంటూ అవమానిస్తున్నారు. ఇలాంటి మాటలు మమ్మల్ని బాధిస్తున్నాయి. మా అందరి మానసిక స్థితి బాగాలేదు. అమ్మగురించి అలాంటి మాటలు మాట్లాడుతుంటే ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం."
-గంగూబాయ్ తనయుడు.
గంగూబాయ్పై సినిమా రూపొందుతోందని వార్తలు వచ్చినప్పటి నుంచే ఆమె కుటుంబం అజ్ఞాతంలో ఉందని, తరచుగా ఇళ్లు మారుతోందని గంగూబాయ్ కుటుంబం తరఫు న్యాయవాది నరేంద్ర వెల్లడించారు. గంగూబాయి మనవరాలు భారతి కూడా మేకర్స్‌పై విరుచుకుపడింది. డబ్బు కోసం దురాశతో కుటుంబం పరువు తీశారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
"డబ్బుపై దురాశతో ఈ సినిమా మేకర్స్ అంతా నా కుటుంబం పరువు తీశారు. దాన్ని ఎట్టిపరిస్థితిలోనూ అంగీకరించలేం. ప్రాజెక్ట్‌తో ముందుకు సాగడానికి ముందు మీరు మా కుటుంబం అనుమతి అడగలేదు. మీరు పుస్తకం రాసేటప్పుడు మా దగ్గరికీ రాలేదు. సినిమా తీయడానికి ముందు మా అనుమతి తీసుకోండి. నా అమ్మమ్మ తన జీవితాంతం అక్కడ సెక్స్ వర్కర్ల అభ్యున్నతికి కృషి చేసింది. కానీ ఈ వ్యక్తులు మా అమ్మమ్మను అభ్యంతరకరంగా చూపిస్తున్నారు?" అంటూ ప్రశ్నించింది.
కాగా, గతేడాది 'గంగూబాయ్ కతియావాడీ' చిత్రంపై బాబూ రావుజీ షా పిటిషన్ దాఖలు చేయడం వల్ల ముంబయి కోర్టు సంజయ్ లీలా భన్సాలీ, అలియా భట్‌లకు సమన్లు జారీ చేసింది. ఆ తర్వాత సినిమా విడుదలపై స్టే విధించేందుకు ముంబయి హైకోర్టు నిరాకరించింది. అంతే కాదు చిత్ర నిర్మాతలపై క్రిమినల్, పరువు నష్టం కేసులపై మధ్యంతర స్టే కూడా ఇచ్చింది. ఇప్పుడు కేసు పెండింగ్‌లో ఉంది.
ఇదీ చూడండి: ఆలియా అదరగొట్టేసింది.. 'గంగూబాయ్' ట్రైలర్ కేక!