"కరోనా వైరస్ విషయంలో మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. అతిగా ఆలోచిస్తే స్థిమితంగా ఉండలేం. మేం ఇప్పటివరకు ఎన్నో ఫైట్లు చేశాం. చూశాం. కానీ కరోనా విలన్‌తో ఫైట్ చాలా కొత్తగా ఉంది. మేం అసలు కరోనాకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఎప్పటిలాగే మా పనులు మేం చేసుకుంటున్నాం. ఇప్పుడు విలన్ కరోనా కాదు.. జనంలో ఉన్న భయమే పెద్ద విలన్ అని మా అభిప్రాయం. అందుకే ప్రతి ఒక్కరూ హీరోలై మనలో ఉన్న భయమనే విలన్‌ను చంపేయాలి" అంటున్నారు ప్రముఖ ఫైట్‌మాస్టర్లు రామ్‌లక్ష్మణ్. రూపాలే కాదు, భావాలు, జీవన విధానాలు ఒక్కటై సాగుతున్న రామ్ లక్ష్మణ్‌లు లాక్‌డౌన్‌లో ఎలా గడిపారు? కొవిడ్ నిబంధనల నేపథ్యంలో సినిమాల్లోని పోరాట దృశ్యాల్లో వచ్చే మార్పులేంటి? తదితర విషయాలపై వారి అభిప్రాయాలు తెలుసుకుందాం రండి.
లాక్‌డౌన్‌లో ఏం చేశారు?
ఈ మూడు నెలలు చీరాలలోని మామిడి తోటల్లోనే గడిపాం. చిత్ర పరిశ్రమలోని కార్మికులంతా ఆరోగ్యంగా ఉండాలి, ఎలాంటి ఇబ్బంది పడకూడదని దేవుణ్ని వేడుకుంటున్నాం. నెల రోజుల కిందటే హైదరాబాద్ వచ్చాం. కరోనా ఎంత తొందరగా పోతే అంత త్వరగా ఇండస్ట్రీలో పనులు మొదలవుతాయి.
తాకకుండానే విలన్లను కొట్టొచ్చు
గ్రాఫిక్స్ పెరిగాక విలన్లను తాకకుండానే హీరో ఫైట్ చేయొచ్చు. హీరో ఒక చోట ఉంటాడు. విలన్లు వేరే చోట ఉంటారు. చారిత్రక, పౌరాణిక సినిమాల్లో ఇది బాగా కుదురుతుంది. అలాంటి టెక్నాలజీ ప్రస్తుతం అందుబాటులోకి వచ్చింది. ఫైటర్స్ పై ఒకసారి, హీరోపై ఒకసారి కంపోజ్ చేసి కలపొచ్చు.
వ్యాక్సిన్ వస్తేనే... హీరోలు ముందుకొస్తారు
వ్యాక్సిన్ వస్తేనే హీరోలు షూటింగ్ చేయడానికి ముందుకొస్తారు. అయినా రిస్క్ తీసుకొని వచ్చి చేయాల్సినంత అవసరం లేదు. సాధారణంగా పెద్ద హీరోలు ఒక సినిమా రిలీజ్ అయ్యాక మరో సినిమాకు 6 నెలలైనా గ్యాప్ తీసుకుంటారు. ఆ గ్యాపే తెలియకుండా సంవత్సరం వచ్చిందని అనుకుంటే సరిపోతుంది. వాళ్లు ఇంట్లో కూర్చోవడం వల్ల ఎలాంటి సమస్య లేదు. ఈ సమయంలో చాలా మంది దర్శకులు కొత్త కథలు సిద్ధం చేసుకుంటున్నారు.