బాలీవుడ్‌లోని యువ కళాకారులను ప్రశంసించారు బిగ్‌బీ అమితాబ్ బచ్చన్. ఇలాంటి ప్రతిభావంతులున్న యుగంలో తాను జీవించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. నటనలోనే కాకుండా చిత్రనిర్మాణంలోని అనేక విభాగాల్లోనూ ప్రతిభావంతులున్నారని అభిప్రాయపడ్డారు.
"ఈ యుగంలో జీవించడం చాలా కష్టం. అనేక మంది ప్రతిభావంతులు తెరకు పరిచయమవుతున్నారు. థియేటర్లలోనే కాకుండా బుల్లితెరపై కూడా వారి తెలివితేటలు చూస్తుంటే ఆశ్చర్యపోతారు. రచన, చిత్రీకరణ, కెమెరా పనితనంలో చూస్తే దేశంలో మునుపెన్నడూ చూడని ప్రాంతాలను ప్రేక్షకులకు చూపించడం సహా.. సహజ నటనతో అలరిస్తున్నారు. ఈ యువతరాన్ని చూసి నేను భయపడుతున్నా. అత్యద్భుతమైన నటనతో వారిలోని ప్రతిభను మరింతగా బయటపెడుతున్నారు. నన్ను నేను చూసుకుంటే చాలా నిస్సహాయంగా, చిన్నగా ఉన్నా. వారు ఈ ఏడాదే కాకుండా భవిష్యత్ కోసం మరిన్ని గొప్ప చిత్రాలను నిర్మిస్తున్నారు".