తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'రాధే', 'లక్ష్మీ బాంబ్​'తో పోటీకి సై అంటున్న హాలీవుడ్​ చిత్రం! - ఫాస్ట్​ అండ్​ ఫ్యూరియస్​ 9

సాధారణంగా ప్రతీ రంజాన్‌కు బాలీవుడ్‌ స్టార్లు తమ సినిమాలు విడుదల చేయాలనుకుంటారు. తాజాగా ఆ జాబితాలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోలు సల్మాన్‌ ఖాన్‌, అక్షయ్‌ కుమార్‌లు ఇద్దరూ తమ సినిమాలను విడుదల చేసేందుకు పోటీపడుతున్నారు. అయితే, ఈసారి అనూహ్యంగా రేసులోకి ఓ హాలీవుడ్‌ స్టార్​ దూసుకొచ్చాడు. ప్రపంచంలో అత్యంత ఆదరణ ఉన్న సిరీస్‌ కావడం వల్ల బాలీవుడ్‌ వర్గాల్లో ఒకింత ఆందోళన నెలకొంది. ఏదేమైనా ఈసారి రేసు మరింత రసవత్తరం కానుంది.

Fast-and-Furious-9-The-Fast-Saga-to-clash-with-Salman-Khans-Radhe-on-Eid
'రాధే', 'లక్ష్మీ బాంబ్​'కు పోటీ పడుతున్న హాలీవుడ్​ చిత్రం..!

By

Published : Feb 2, 2020, 7:01 AM IST

Updated : Feb 28, 2020, 8:38 PM IST

'ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌..' దాదాపు రెండు దశాబ్దాలుగా యువతను ఉర్రూతలూగిస్తూ.. ప్రపంచంలోనే అత్యంత ఆదరణ సొంతం చేసుకున్న సినిమా. తొలిసారిగా 2001లో విడుదలైన ఈ అమెరికన్‌ చిత్రం.. సిరీస్‌లుగా మారి వేర్వేరు పేర్లతో అభిమానులను అలరిస్తోంది. విజయవంతంగా ఎనిమిది సిరీస్‌లు పూర్తి చేసుకొని 'ది ఈస్ట్‌ సాగా' అనే పేరుతో తొమ్మిదో సిరీస్‌ విడుదల కానుంది. అయితే, ఈసారి ఇంగ్లిష్‌లోనే కాకుండా.. హిందీ, తెలుగు, తమిళ భాషల్లోనూ రిలీజ్​ చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ట్రైలర్‌ను తన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేసింది చిత్ర బృందం.

ఈ సినిమాను ఈసారి రంజాన్‌కు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సిరీస్‌కు గతంలోనూ దర్శకత్వం వహించిన గ్యారీ మరోసారి డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండటం విశేషం. ఈ సిరీస్‌లో విన్‌ డీజిల్‌, మైకైల్‌ రొడ్రిగ్యూ, గిబ్సన్‌తో పాటు మాజీ వ్రెస్లింగ్‌ ఛాంపియన్‌ జాన్‌సీనా తెరపై కనిపించనున్నాడు. అన్నింటికంటే ప్రత్యేకత ఏంటంటే.. గ్రామీ అవార్డు విజేత సూపర్‌స్టార్‌ కార్డీ బి ఈ సిరీస్‌లో నటిస్తున్నాడని సమాచారం.

రాధే సినిమాలో సల్మాన్​ ఖాన్​, లక్ష్మీ బాంబ్​ సినిమాలో అక్షయ్​ కుమార్​

మరోవైపు.. బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ హీరోగా నటిస్తున్న 'రాధే' రంజాన్‌ సందర్భంగా అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. సినిమాలో క్లైమాక్స్‌కు సంబంధించిన 20 నిమిషాల సీన్‌ కోసం రూ.ఏడున్నర కోట్లు వెచ్చించారట. సల్మాన్‌ఖాన్‌, రణదీప్‌ హుడాల మధ్య చిత్రీకరించిన ఈ సన్నివేశంలో అత్యాధునిక సాంకేతికతను వినియోగించారని చిత్రసీమ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి ఇండియన్‌ మైకేల్‌ జాక్సన్‌ ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో దిశా పటానీ హీరోయిన్​గా, జాకీ ష్రాఫ్‌, తమిళ నటుడు భరత్‌ ఇతర కీలక పాత్రల్లో నటించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా ఏ మేరకు అభిమానులను అలరిస్తుందో రంజాన్‌ వరకూ వేచి చూడాల్సిందే.

మరోవైపు రంజాన్‌ కానుకగా 'లక్ష్మీబాంబ్‌'తో అభిమానుల ముందుకు రానున్నాడు అక్షయ్‌కుమార్‌. ఈ చిత్రానికి రాఘవ లారెన్స్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. కియారా అడ్వాణీ కథానాయిక. సూపర్‌ హిట్‌ సినిమా 'కాంచన'కు హిందీ రీమేక్‌గా రూపొందుతోంది. దీనికి తుషార్‌ కపూర్, షబీనా ఖాన్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఒకే సంవత్సరంలో నాలుగు భారీ బంపర్​ హిట్లు కొట్టిన అక్షయ్‌.. 2019ని అక్షయ్‌నామ సంవత్సరంగా మార్చేశాడు. మరి వరుస హిట్లతో దూసుకెళుతున్న ఈ పక్షిరాజు విజయం సాధించాలంటే సల్మాన్‌ఖాన్‌తో పాటు ఎఫ్‌9ను దాటాల్సి ఉంటుంది. ఏదేమైనా ఈ సారి రంజాన్‌ లో బాలీవుడ్‌ సూపర్‌స్టార్ల సినిమాలతో పాటు యాక్షన్‌ థ్రిల్లర్‌ 'ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌' కూడా రేసులోకి రావడం వల్ల ఏ సినిమా పైచేయి సాధిస్తుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇదీ చూడండి...నయన్​ ఖర్చులు భరించలేం.. నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌

Last Updated : Feb 28, 2020, 8:38 PM IST

ABOUT THE AUTHOR

...view details