దర్శకుడు ఆర్.నారాయణమూర్తి తెరకెక్కించిన 'రైతన్న' సినిమా సెన్సార్ కార్యక్రమాల్ని పూర్తి చేసుకుంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రవిశేషాలను తెలిపారాయన. ఆ విశేషాలేంటో చూద్దాం...
'రైతన్న'తో ఏం చెప్పనున్నారు?
మనదేశంలో ప్రస్తుతం సామాజికంగా వెనకబడినవాళ్లు ఎవరైనా ఉన్నారంటే అది రైతే. అప్పట్లో ఊళ్లోకి ఎవరొచ్చినా మొదట కలిసేది రైతునే. ఇప్పుడు తహసీల్దారు కార్యాలయానికి వెళ్లినా రైతు బయటే నిల్చోవాలిన పరిస్థితి. గుమాస్తా కూడా రైతును పట్టించుకోవడం లేదు. రోజు రోజుకీ కూలీ రేట్లు, ఇంధనాలు, ఎరువులు, విత్తనాల ధరలు పెరగడం, ఆ దామాషాలో రైతు తను పండించే పంటకు గిట్టుబాటు పొందకపోవడం వల్లే రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. అలా జరగకూడదంటే డా.స్వామి నాథన్ కమిటీ సిఫార్సుల్ని అమలు చేసి, గిట్టుబాటు ధరను కల్పిస్తే రైతే రాజు అవుతాడు. ఆ విషయాన్నే 'రైతన్న'తో చెప్పనున్నా.
రైతుల కోసం కేంద్రం కొత్త చట్టాల్ని తెరపైకి తీసుకొచ్చింది కదా?
ఆ చట్టాల్ని, వాటి పర్యవసనాల్ని ఇందులో చర్చించా. కర్షకుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నూతన వ్యవసాయ చట్టాల్ని తీసుకొస్తున్నామని చెబుతోంది కేంద్రప్రభుత్వం. రైతులు, నాయకులు, విపక్షాల కోణంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టాలు వరాలు కావు, శాపాలనీ.. ఈ నల్లచట్టాల్ని రద్దు చేయాల్సిందిగా పోరాటం చేస్తున్నామని చెబుతున్నారు. 11 సార్లు రైతులకూ, ప్రభుత్వానికీ మధ్య చర్చలు జరిగాయి. సమస్య కొలిక్కి రాలేదు. పోరాటం ఆగలేదు. ఒకే దేశం - ఒకే మార్కెట్, విదేశాలతో పోటీ కోసమే ఈ స్వేచ్ఛా వాణిజ్యం అంటోంది కేంద్రప్రభుత్వం. రైతులు మాత్రం 'ఈ విధానాలు ఇప్పుడు కాదు, 2006లోనే కాంగ్రెస్ ప్రభుత్వం బిహార్‌లో అమలు చేసింది. దానివల్ల అక్కడ మార్కెట్ వ్యవస్థ మొత్తం వ్యాపారుల చేతుల్లోకి వెళ్లింది. ఇప్పుడు మళ్లీ ఈ చట్టాలతో మిగతా రాష్ట్రాలు బిహార్‌లా కావాలా?' అంటున్నారు. ప్రభుత్వం రైతుల డిమాండ్లను నెరవేర్చి, ఈ చట్టాల్ని రద్దు చేయాలని చెబుతున్నారు. నేనొక కళాకారుడిగా ఆ విషయాన్నే ఈ చిత్రంలో చెప్పా.
సినిమా అనగానే రూపకర్తలు వాణిజ్యాంశాల్నే ఊహిస్తారు. కానీ మీరు సమస్యలే ప్రధానంగా సినిమాలు చేస్తుంటారు. దర్శకనిర్మాతగా ఆ విషయంలో మీకెలాంటి సవాళ్లు ఎదురవుతుంటాయి?
ఏ సమస్య కనిపించినా వాటిపై పాత్రికేయులు వ్యాసాలు రాస్తారు. ప్రజా సంఘాలు, ఉద్యమకారులు పోరాటం చేస్తారు. వాగ్గేయ కారులు, కళాకారులు రాయడం సహా పాడుతూ ఆడుతూ ప్రజల్ని చైతన్యం చేస్తారు. ఒక సినీ కళాకారుడిగా నేను సినిమాలు చేస్తాను. 36 యేళ్లుగా 'అర్ధరాత్రి స్వతంత్రం' నుంచి 'రైతన్న' వరకు దేశంలోని సమస్యలకి ప్రతిబింబాలుగా నా సినిమాలు నిలుస్తుంటాయి. విశ్వ విద్యాలయాల్లో పనిచేసే చాలా మంది ప్రొఫెసర్లు నారాయణమూర్తి సినిమాలు పాఠ్యాంశాలను చెబుతుంటారు. ఇక సవాళ్లంటారా? అవి అడుగడుగునా ఉంటాయి. గూడవల్లి రామబ్రహ్మం నుంచి ఎందరో మహానుభావులు ఇలాంటి సినిమాలు తీశారు, నేనూ తీస్తున్నా. 'రైతన్న' కథను ఎంతో ఆసక్తికరంగా తీర్చిదిద్దా. పతాక సన్నివేశాల్లో ఒక మంచి ముఖ్యమంత్రి స్వామినాథన్ కమిటీ సిఫార్సుల్ని అమలు చేస్తాడు. కేంద్రప్రభుత్వాన్ని కూడా అమలు చేయాలని కోరతానని చెబుతాడు. దాంతో రైతన్న తన పంటకి గిట్టుబాటు ధర పొందుతాడు, బిడ్డకి పెళ్లి చేస్తాడు. ఇలా ఒక మంచి కథను మలిచి ఈ సినిమాని తీశా.
ఇటీవల సినిమాటోగ్రఫీ చట్టంలో సవరణలు చేశారు. ఆ ప్రభావం సినిమాలపై ఏ మేరకు ఉంటుందంటారు?
మన వ్యవస్థలో స్వయంప్రతిపత్తి సంస్థలు కొన్ని ఉంటాయి. అందులో సెన్సార్ బోర్డ్ ఒకటి. అందులో ఎంతోమంది మేధావులు ఉంటారు. వాళ్లు సినిమాల్ని చూసే ధ్రువీకరిస్తారు. భిన్నాభిప్రాయాలు వ్యక్తమైతే రివైజింగ్ కమిటీకి పంపుతారు. అక్కడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమైతే ట్రైబ్యునల్‌కు వెళుతుంటాం. కానీ చట్టంలో సవరణల వల్ల రీ సెన్సార్ చేయాల్సి వస్తుంది. అది సరైంది కాదు. లోకో భిన్నరుచి అంటాం. ఒకొక్కరిదీ ఒక్కో భావజాలం. ఎవరి నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనా మళ్లీ రీ సెన్సార్ అంటే నిర్మాత ఏం కావాలి? ఎక్కడ భావప్రకటనా స్వేచ్ఛ ఉంటుంది? ఎక్కడ వాక్‌స్వాతంత్య్రం ఉన్నట్టు? దీనిపై ప్రభుత్వం పునరాలోచించాల్సిందే.
మీరు రైతు కుటుంబం నుంచే వచ్చారు కదా, వ్యవసాయం చేశారా?
హైస్కూల్ సెలవు రోజుల్లో చేలోకి వెళ్లేవాణ్ని. దున్నడం, గడ్డి కోయడం తెలుసు. వ్యవసాయం పనుల్ని ఇష్టంగా చేసేవాణ్ని. అందుకే ఈ రోజు రైతులు చేస్తున్న ఉద్యమం ధర్మమైనదని భావిస్తున్నా. కరోనానీ లెక్కచేయకుండా ఆరుగాలం కష్టపడి, మూడు పంటలు పండించి అందరికీ అన్నం పెడుతున్నాడు కర్షకుడు. ఆ అన్నదాతకి మనమంతా కృతజ్ఞులమై ఉండాలి.
ఇదీ చూడండి: 'పూరీ జగన్నాథ్ ఆఫర్‌ను అందుకే వద్దన్నా!'