తెలంగాణ

telangana

ETV Bharat / sitara

చిరునవ్వుకు చిరునామా మురళీమోహనం - నటుడు మురళీమోహన్ బయోగ్రఫి

మధ్యతరగతి మందహాసం. వెండితెరపై సామాన్యుడి అసామాన్య విజయహాసం. ఆత్మవిశ్వాసమే పెట్టుబడి. కలల కట్టుబడి. యువత వ్యక్తిత్వ వికాసానికి ఆయన నటనే ఒక బడి. కుటుంబ కథా చిత్రాల ఒరవడి. చెదరని చిరునవ్వుకు చిరునామా. ఆయన నటిస్తున్నారంటే పరిశ్రమకు ఓ ధీమా. ఏ పాత్ర లభించినా ఆత్మ అద్దినట్లు నటించిన సినీ సమ్మోహనుడే మురళీమోహనుడు.

Murali Mohan news
మురళీ మోహన్

By

Published : Oct 7, 2021, 4:58 PM IST

విలక్షణ పాత్రల విశిష్టుడు, వెండి తెరమీద సగటు మనిషి కథా చిత్రాల నాయకుడు, సమ్మోహన కథానాయకుడు.. మురళీ మోహన్. బహు పాత్రలలో రాణించి తనకంటూ ఒక అభిమానలోకాన్ని సృష్టించుకున్నారు. హీరో, సెకెండ్ హీరో, క్యారెక్టర్ ఆర్టిస్టుగా 350 సినిమాల్లో నటించి తెలుగు సినీ ప్రేక్షక హృదయాలలో కొలువయ్యారు. వెండితెర వేల్పయ్యారు. శోభన్ బాబు తరువాత మహిళా ప్రేక్షకుల ఆదరణ పొందిన కొద్దిమంది హీరోలలో అగ్రగణ్యుడు చాటపర్రు చిన్నోడు.

మురళీమోహన్

మద్రాస్ ప్రెసిడెన్సీలోని పశ్చిమ గోదావరి జిల్లా.. ఏలూరు దగ్గర చాటపర్రు. అక్కడ మాగంటి మాధవరావుది స్వాతంత్ర్యోద్యమ నేపథ్య కుటుంబం. ఆయన పెద్ద కుమారుడే రాజాబాబు. ఏలూరు సీఆర్ఆర్ కాలేజీలో చదువుతుండగా.. సీనియర్లు పర్వతనేని సాంబశివరావు, తాతినేని రామారావు,చటర్జీ, విజయబాపినీడు సినీలోకం కబుర్లు చెప్పేవారు. తర్వాత కాలంలో సినీ హీరో అయిన ఘట్టమనేని కృష్ణ, చైతన్య చిత్రాలు తీసిన క్రాంతికుమార్ తన క్లాసుమేట్లే.

రాజాబాబు డిగ్రీలోకి రాకముందే చదువు మానేశారు. విజయవాడలో కిసాన్ ఎంటర్ ప్రైజెస్‌లో భాగస్వామిగా వ్యాపారంలో చేరారు. అయితే కళాశాల్లో వేసిన స్టేజి నాటికల తీపిగురుతులు మనసును వీడలేదు. భావసారూప్య మిత్రులతో కలసి అడపాదడపా నాటకాల్లో నటిస్తున్నారు.

చిరంజీవి, శరత్ కుమార్, మురళీమోహన్

రాజాబాబే మురళీమోహన్​గా

రెక్కలొచ్చిన ఊహలు సినీలోకం చుట్టూ తిరుగుతున్నాయి. స్టిల్ ఫొటోగ్రాఫర్ మన సత్యం తీసిన ప్రొఫైల్ ఫొటోలు తన శ్రేయోభిలాషి, సినీ నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావుకి నచ్చాయి. ఓ శుభవేళ ఉన్నపళంగా వచ్చేయాలంటూ మద్రాసు నుంచి ఆయన కబురు చేశారు. అలా 1973లో మద్రాసు వెళ్లిన రాజాబాబుకు అట్లూరి తన సినిమా 'జగమేమాయ'లో అవకాశమిచ్చారు. రాజాబాబు పేరును మురళీమోహన్​గా మార్చి హీరోగా పరిచయం చేశారు. ఆ సినిమా ఒకమోస్తరు విజయం సాధించింది. 1974లో కృష్ణ, శారద నటించిన దాసరి నారాయణరావు సినిమా 'రాధమ్మపెళ్లి'లో రాధమ్మను వివాహం చేసుకునే ఆపద్బాంధవుడి పాత్రలో మెరిశారు. (Play Radhama pelli visual: కృష్ణతో మురళీ మోహన్ ..నేను రాధను పెళ్లి చేసుకుంటాను అని చెబుతున్న డైలాగు ప్లస్ పెళ్లి సీన్ క్లైమాక్స్).

ఆకర్షణీయంగా, కళగా ఉన్న మురళీమోహన్ సినీ దర్శకుల దృష్టికి వచ్చారు. అలా 1975 జూలైలో ఆనాటి అగ్రనటుడు ఎన్టీరామారావు, ఆయన కుమారుడు బాలకృష్ణ సరసన 'అన్నదమ్ముల అనుబంధం'లో నటించే ఛాన్సు దక్కింది. కెరీర్‌కు పూలబాట వేసింది. అదే ఏడాది ఆగస్టులో శోభన్ బాబు, మంజుల, రోజారమణి నటించిన 'జేబుదొంగ'లో సెకెండ్ హీరోగా అవకాశం వచ్చింది. ఆనాటి రమణీయ గీతం ఈనాటికీ సుప్రసిద్ధమే.

'మోహావేశం' వేరు..'మోహనా వేశం' వేరు. ఇద్దరు మోహనులు వెండితెర మీద ఆవేశంగా నటిస్తే ఆపటం ఎవరితరం? ఒకరు మురళీమోహనం. మరొకరు చంద్ర మోహనం. ఇద్దరూ కలిస్తే సమ్మోహనం. 'భారతంలో ఒక అమ్మాయి' చిత్రంలో చిత్రంగా వీరు కలసి నటించారు. 1976లో దర్శకుడుగా కె. రాఘవేంద్రరావు ఖ్యాతిని పెంచిన చిత్రం 'జ్యోతి'. తను కాలిపోతూ చుట్టూ ఉన్న వారికి వెలుగునిచ్చే 'జ్యోతి'గా జయసుధ నటించారు. అనుకోని పరిణామాలతో తండ్రి వయసున్న పెద్దమనిషిని పెళ్లాడే పాత్ర. ఈ సినిమా మురళీమోహన్‌ సినీజీవితంలో మైలురాయిగా నిలిచింది. 1977లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన 'ఆమె కథ'లో మళ్లీ మురళీమోహన్, జయసుధ నాయకా, నాయిక పాత్రలు చేసి ప్రేక్షకలోకాన్ని అలరించారు. (Play Song: Puvvulanadugu. Navvulanadugu)

1977లోనే తెరకెక్కిన దాసరి నారాయణరావు చిత్రం 'చిల్లరకొట్టు చిట్టెమ్మ'. స్త్రీ పాత్ర ఔన్నత్యాన్ని అద్భుతంగా చిత్రీకరించిన సినిమా. ఇందులో మురళీమోహన్ రాజాబాబులా పంచెకట్టులో తెలుగుదనానికి తలకట్టులా అనిపించారు. చిల్లరకొట్టు చిట్టిపై ప్రేమపుట్టిన దత్తుగా పాత్రోచిత నటనలో జీవించారు.

అదే సంవత్సరం కృష్ణం రాజు కథానాయకుడుగా రాఘవేంద్రరావు తీసిన అమరదీపంలో సెకెండ్ హీరోగా ఓ ప్రధాన పాత్ర. భార్యను అపార్థం చేసుకున్న భర్తగా మురళీమోహన్, అతడి అనుమానానికి బలైన పాత్రలో కృష్ణంరాజు, సంఘర్షణకు గురైన పాత్రలో జయసుధ నటన పండించారు. కృష్ణంరాజు, మురళీ మోహన్ డైలాగులు ప్రేక్షకులను అలరించాయి.

ప్రసాద్ ఆర్ట్ ఫిలింస్ రజతోత్సవ చిత్రం 1977లో వచ్చిన 'అర్ధాంగి'. మురళీమోహన్, జయసుధ, చంద్రమోహన్ తదితరులు నటించారు. ఈ సినిమాలో వెన్నెల కురిపించిన పాట నా మనసే ఒక తెల్లని కాగితం గీతం (Play Song: Naa Manase Oka Thellani kagitham)

పరీక్షా సమయం

అది 1978. మురళీమోహన్​కు నిజంగా కెరీర్ లో ఓ పరీక్షా సమయం. తెలుగుచిత్రసీమలో అటు ఎన్టీఆర్, ఇటు ఏయన్నార్.. తిరుగులేని అగ్రనటులుగా మోహరించారు. 'నారీ నారీ నడుమ మురారి' పాత్రల శోభన్ బాబు, ఇక.. 'క్లాస్' స్ట్రగుల్ లేకుండా అందరినీ మెప్పిస్తున్న హీరో కృష్ణ, యాంగ్రీ యంగ్‌మేన్ తరహా పాత్రల కృష్ణంరాజు, కొంచెం కామెడీగా, కొంచెం సీరియస్‌ పాత్రలలో చంద్రమోహన్, అడపా దడపా రామకృష్ణ, రంగనాథ్ దూసుకెళుతున్నారు. వీరి మధ్యన హీరోగా నిలబడాలంటే నటనలో తనదైన ముద్రవేయాలని మురళీమోహన్ భావించారు. తన నటనను మరింత మెరుగుపర్చుకున్నారు. 1977లో వచ్చిన 'భద్రకాళి' సినిమాలో మురళీమోహన్ - జయప్రద మధ్య ప్రణయగీతం ఓ గొప్ప హిట్‌గా తెలుగునాట మార్మోగింది. మురళీమోహన్‌కు జేసుదాసు గొంతు ఇచ్చిన 'చిన్నిచిన్న కన్నయ్య' పాట మదిని పులకరింప చేస్తుంది. https://www.youtube.com/watch?v=ypcesZnBRPg

హీరోగా స్థిరపడ్డారు

1978లో మురళీ మోహన్, శ్రీప్రియ నటించిన దేవర్ ఫిలింస్ 'పొట్టేలు పున్నమ్మ'.. అఖండ విజయాన్ని అందుకుంది. దీంతో మురళీమోహన్ కథానాయకుడుగా స్థిరపడ్డారు. తర్వాత కొంతకాలానికి ప్రేక్షకులను పలకరించిన సరిగమల మధురిమ.. కల్యాణి చిత్రం. మురళీమోహన్, జయసుధ శృతి, లయల్లా పాత్రోచితంగా నటించారు.

ఎన్నో పాత్రలతో..

వెండితెరపై నాలుగున్నర దశాబ్దాల నటసమ్మోహనం మురళీమోహన్. మనింట్లో మనిషి నడిచి వచ్చి నడిమింటిలో కూర్చుని చిరునవ్వుతో పలకరిస్తున్నట్లు అన్పిస్తుంది. ప్రియమైన శ్రీవారు. బాధ్యత కలిగిన తండ్రి, ఆదరించే అన్నయ్య. స్వచ్ఛమైన ప్రేమికుడు. అచ్చమైన ప్రయోజకుడు. కష్టపడి పైకి వచ్చిన కార్యసాధకుడు. నిస్పృహతో ఉన్న నిరుద్యోగి. చాలీచాలని ఆదాయాల చిరుద్యోగి. నారీనారీ నడుమ మురారి.. ఎక్కువగా ఇలాంటి పాత్రలు పోషించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. .పోషించిన ప్రతి పాత్రతో మెప్పించారు. ఒప్పించారు.

1978లో కృష్ణంరాజు హీరోగా వచ్చిన ' మనవూరి పాండవులు' చిత్రంలో మురళీమోహన్ రాముడు పాత్రధారిగా నటించారు. గ్రామంలో ఆధునిక దుశ్శాసనుడు రాంభూపాల్ దుర్మార్గాలను ఎదిరించి సురాజ్యం నెలకొల్పే చిత్రం. ఐదుగురు యువకులలో ఒకరుగా మురళీ మోహన్ చైతన్య నగారా మోగించారు. నాటి వర్ధమాన హీరో చిరంజీవి మనవూరి పాండవులలో ఒకరుగా అభినయించారు..(Play:మనవూరి పాండవులులో మురళీమోహన్ డప్పుకొడుతూ వచ్చే విజువల్) 1978లో వచ్చిన కల్పన సినిమా మళ్లీ మురళీమోహన్, జయచిత్ర, రాఘవేంద్రరావు కాంబినేషన్లో సినిమాకు ఘన విజయం దక్కింది. హీరోగా మురళీమోహన్ క్రమంగా నిలదొక్కుకుంటున్నారు.

పెద్దల పంతాలు పట్టింపులు ప్రేమించుకున్న హృదయాల ఎడబాటు.. ప్రేమించి పెళ్లాడిన జంటగా మురళీమోహన్, జయసుధ నటనపండించారు. మధ్యవర్తుల చొరవతో సుఖాంతమయ్యే కథ 'జయసుధ'.

1980లో దాసరి రూపకల్పనలో వచ్చిన డబ్బు.. డబ్బు.. డబ్బు ఫ్యామిలీ డ్రామా. నడమంత్రపు సిరితో మనుషుల ప్రవర్తన ఎలా మారిపోతుందో ఈ సినిమా అద్దం పట్టింది.

దాసరి దర్శకత్వంలో 1981లో తెరకెక్కిన 'అద్దాలమేడ' ఓ సందేశాత్మక చిత్రం. రాజన్-నాగేంద్ర స్వరాల్లో చిత్రగీతాలు మధుర తుషారాల్లా మనసుతాకాయి.

విజయబాపినీడు రాసిన నవల కామరాజు కథ ఆధారంగా తీసిన 'వారాలబ్బాయి' ఒక సంచలనం. చెల్లిని మోసగించిన ప్రబుద్ధుడి ఆట కట్టించడానికి అతడి ఇంటికే వారాలబ్బాయిగా మురళీ మోహన్ నటించిన ఈ సినిమా భారీ హిట్‌ కొట్టింది. ప్రతిభ వుండీ..చదివించలేని పేద కుటుంబాల పిల్లలు పూర్వం వారానికో ఇంట్లో భోజనం చేసి చదువుకునేవారు. ఈ సినిమా విడుదల అయ్యాక మురళీమోహన్ అంటేనే వారాలబ్బాయికి ఐకాన్​గా మారిపోయారు.

ఇక 'అత్తగారి పెత్తనం' చిత్రంలో భార్యకు తల్లికీ మధ్య సంఘర్షణకు లోనైన కుమారుడుగా మురళీ మోహన్ నటన ప్రేక్షకులను మెప్పించింది.

మురళీమోహన్‌ కు ఎంతో గుర్తింపు తెచ్చిన సినిమా 'ఓ తండ్రి తీర్పు'. స్వార్ధంతో తల్లిదండ్రుల ఆస్తి కాజేసి వారిని వెళ్లగొట్టిన బిడ్డలు. మళ్లీ ఉన్నతంగా ఎదిగిన తండ్రి బిడ్డలకు బుద్ధిచెప్పే కథాశంతో తీసిన చిత్రం ఓ తండ్రి తీర్పు. బుద్ధిచెప్పే తండ్రిగా మురళీ మోహన్ నటన నభూతో నభవిష్యతి.

నిర్మాతగానూ..

ఇచ్చిన పాత్రలో, మెచ్చిన పాత్రలో వస్తున్నాయి. మెప్పించటం, ఒప్పించటం అయిపోయింది. కానీ అభిరుచి కలిగిన సినిమాలు తీయాలన్న కోరిక తీరలేదు. ఈ క్రమంలో స్వీయ అభిరుచితో సినిమాలు తీయాలని మురళీమోహన్ భావించారు. ఇందులో భాగంగా మురళీ చిత్ర సంస్థను స్థాపించి తొలియత్నంగా 'రామదండు' చిత్రం తీశారు. ఇందులో ఓ పాట సమకాలీన సమాజానికీ వర్తిస్తుంది. (Play: Bandi kadu mondi idi song)

1977లో గిరిబాబు 'జయభేరి ఆర్ట్స్' సంస్థను నెలకొల్పి 'దేవతలారా దీవించండి' లాంటి విజయవంత మైన సినిమాలు తీశారు. మిత్రుడు గిరిబాబు నుంచి జయభేరి ఆర్ట్స్ బ్యానర్​ను తీసుకొని మురళీమోహన్‌ తన మనోభీష్టానికి అనుగుణంగా పాతిక సినిమాలు నిర్మించారు. జయభేరి పతాకంపై నిర్మించిన 'పిచ్చిపంతులు' ఘనవిజయం సాధించింది.

జయభేరి ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిర 'శ్రావణ మేఘాలు' మహిళా లోకాన్ని ఆకట్టుకుంది. ఇద్దరు అతివలతో ఇరకాటంలో పడి..సంఘర్షణాత్మక పాత్రలో మురళీమోహన్.. మెప్పించారు.

'నిర్ణయం' సినిమాలో నాగార్జున, అమల మీద చిత్రీకరించిన హలో గురు ప్రేమకోసమే సాంగ్.. అప్పటి యువతరానికి ఆకర్షక గీతం (Play: హలోగురు సాంగ్‌).

2005 లో మహేశ్ బాబు కథానాయకుడుగా నిర్మించిన 'అతడు' సూపర్ డూపర్‌ హిట్‌గా హిస్టరీ క్రియేట్ చేసింది.'అతడు' సినిమా తర్వాత జయభేరి ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై మరో చిత్రం రాలేదు. అగ్రహీరో ప్రభాస్‌ తండ్రిగా 'రాఘవేంద్ర' సినిమాలో పండించిన ఎమోషన్‌ సీన్లు హైలెట్‌గా నిలుస్తాయి. https://www.youtube.com/watch?v=4UQom_u-FCM

ప్రేక్షకుల హృదయాల్లో సింహాసనం

మూడు వందల యాభై చిత్రాలలో హీరోగా, సైడ్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మురళీమోహన్ విలక్షణ పాత్రల్లో నటించి ప్రేక్షకలోకాన్ని ఆకట్టుకున్నారు. పెద్ద ధనికులు కారు. పైసా పైసా కూడబెట్టి వ్యాపారం చేసి రాణించారు. సినీలోకంలో ప్రవేశించి నటుడుగా మెప్పించటమే కాదు. ఆత్మవిశ్వాసంతోనే ముందుకెళ్లారు. శిఖరమంత ఎదిగారు. ప్రేక్షక హృదయ సామ్రాజ్యంలో సింహాసనం అధిష్టించారు. సినీ, వ్యాపార, రాజకీయ రంగాలలో రాణించిన స్ఫూర్తిదాత మురళీమోహన్.

ఇవీ చూడండి: ఇది అదే.. అదీ ఇదే.. ఒకే కథ, రెండు చిత్రాలు!

ABOUT THE AUTHOR

...view details