తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Vijay: 'బండమొహం.. వీడు హీరో ఏంటి?'

డ్యాన్స్​లు, పాటలతో కుర్రకారును ఉర్రూతలూగించగల మాస్​హీరో, తనదైన శైలి నటనతో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న​ స్టార్​, కోలీవుడ్​లో రజనీకాంత్​ తర్వాత స్టైల్​కు కేరాఫ్ అడ్రస్​.. ఇదంతా ఎవరి గురించో అర్థమైందిగా.. ఆయనే ప్రముఖ కథానాయకుడు విజయ్​ దళపతి(Vijay Thalapathy). అయితే ఆయన కథానాయకుడిగా మారడానికి గల కారణమేంటి? హీరోగా నిలదొక్కుకునేందుకు విజయ్​ ఏమి చేశారు? అనే విషయాలను ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.

Exclusive Interview on Vijay Thalapathy Movie Journey
Vijay: 'బండమొహం.. వీడు హీరో ఏంటి?'

By

Published : Jul 11, 2021, 8:46 AM IST

దక్షిణాదిలోని మిగతా సినిమా పరిశ్రమల్లా తమిళ సీమకు నిన్నామొన్నటిదాకా 'మెగాస్టార్‌'లు ఎవరూ లేరు. ఇప్పుడా టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు విజయ్‌(Vijay Thalapathy)! సినిమా కలెక్షన్స్‌లోనే కాదు.. పారితోషికంలోనూ అక్కడి సూపర్‌స్టార్‌ను మించిపోతున్నాడు! తెలుగు-తమిళ భాషల్లో రాబోతున్న ఆయన తర్వాతి చిత్రం 'బీస్ట్‌'కు వందకోట్ల రెమ్యునరేషన్‌ తీసుకున్నాడని భోగట్టా. ఈ విజయ్‌ ఒకప్పుడు నష్టజాతకుడిగా ముద్రపడ్డవాడు.. నటించడానికే అర్హుడుకాడంటూ అవమానాలు ఎదుర్కొన్నవాడు. అలాంటివాడు మెగాస్టార్‌ ఎలా అయ్యాడో చూద్దామా..

హీరో విజయ్​

ఆ పాప పేరు విద్య. రెండున్నరేళ్లకు ముద్దులు మూటగట్టడమే కాదు.. తన మాటల ప్రవాహంలో ముంచెత్తుతుండేది. ఆ పాప తెలిసీతెలియకుండా పాడుతుంటే వాళ్లన్నయ్య పదేళ్ల విజయ్‌ వచ్చీరాకుండా గిటార్‌ వాయిస్తుండేవాడు. ఆ అన్నాచెల్లెలిది ప్రత్యేక ప్రపంచం. బడి నుంచి ఇంటికొస్తే తన చుట్టూనే తిరిగేవాడు. అమ్మతోపాటూ ఆ పాపకు తనూ స్నానం చేయించేవాడు, అన్నం తినిపించేవాడు. అప్పుడప్పుడూ బడి నుంచి ఇంటి గేటు ద్వారా కాకుండా వెనకవైపు పైపు గుండా కిచెన్‌ కిటికీలో నుంచి 'ఢా'మ్మంటూ దూకి అమ్మనీ చెల్లెల్నీ భయపెట్టడం విజయ్‌ సరదాల్లో ఒకటి. ఆ రోజు కూడా అలాగే దూకిన విజయ్‌కు కిచెన్‌లో ఎవ్వరూ కనిపించలేదు. ఇంట్లో ఎన్నడూలేని నిశ్శబ్దం. అమ్మ చెల్లెలితోపాటూ బెడ్రూమ్‌లో ఉంది. విద్య ఆ రోజు పడకపైన నీరసంగా పడుకుని ఉంది. చెల్లెల్ని అలా చూసిన విజయ్‌ తట్టుకోలేకపోయాడు. ఆ రోజు రాత్రి ఏమీ తినలేదు. ఉదయానికంతా విద్య పరిస్థితి విషమించింది. ఒకరిద్దరు వైద్యులొచ్చి వెళ్లారు. చివరిగా అమ్మ ఏడుస్తూ బెడ్రూమ్‌ నుంచి కిందకొచ్చింది.

'విజయ్‌ ఒకసారి చెల్లెల్ని చూసిరా..!' అంది. వెళితే.. ఆ పాప నిర్జీవంగా ఉంది! ఆ తర్వాత 'విజయ్‌ నోటి నుంచి 'విద్యా..' అన్న పెద్ద అరుపు వినిపించింది. అంతే, ఆ తర్వాత మాట్లాడటం మానేశాడు. ఎవరైనా కదిపితే ఏడుస్తుండేవాడు. ఆ బాధ నుంచి వాడే బయటకొస్తాడులే అనుకున్నాం కానీ.. ఆ విషాదం వాడి చిన్నిగుండెలో అలాగే గడ్డకట్టిపోయింది. మాట్లాడటం తగ్గించేశాడు. ఒకప్పటి అల్లరిపిల్లాడు కాస్తా వయసుకు మించిన నెమ్మదితనం అలవర్చుకున్నాడు. ఇప్పటికీ వాడు అంతే. కాకపోతే, చెల్లెలు చనిపోయిన ఏడాది తర్వాత వాడి ముఖాన తొలిసారి నవ్వులు పూయించింది మాత్రం సినిమాలే!' అంటారు విజయ్‌ వాళ్లమ్మ శోభ. ఆమె సినిమా గాయనీ, రచయిత్రి. నాన్న ఎస్‌ఏ చంద్రశేఖర్‌ పేరున్న దర్శకుడు. సినిమాలతో కొడుకులో మళ్లీ హుషారొస్తోందని గమనించిన ఆ ఇద్దరూ ఎన్నో చిత్రాల్లో చిన్నారి విజయ్‌కాంత్‌ గానూ, రజినీకాంత్‌ గానూ చేసే అవకాశాలు ఇప్పించారు. కానీ తల్లిదండ్రులుగా విజయ్‌ పైన వాళ్ల ఆశలు వేరే ఉండేవి.

ఇల్లు విడిచి వెళ్లిపోయాడు..

'చెల్లెలు ఎలా చనిపోయిందీ.. ఏదో తెలియని జ్వరంతో కదా! అలాంటి పరిస్థితి మరే పాపకు రాకూడదు. అందుకే నువ్వు డాక్టరువి కావాలి.. అవుతావా?' అని పదేళ్ల నుంచే చెప్పడం మొదలుపెట్టాడట వాళ్ల నాన్న చంద్రశేఖర్‌. అందుకోసమే అన్నట్టు విజయ్‌ చక్కగా చదివేవాడు. పదో తరగతికి వచ్చాక సినిమాల్లో నటించడం కాదు కదా చూడటమూ మానేశాడు. ఇంటర్‌కొచ్చాక చదువే ప్రపంచమైపోయింది. అది చూసి కొడుకు ఎలాగూ డాక్టర్‌ అవుతాడనే నమ్మకంతో వాళ్లనాన్న ఆసుపత్రి కట్టేందుకు రంగం సిద్ధం చేశాడు!

కానీ ఇంటర్‌ రెండో సంవత్సరంలో విజయ్‌ ట్రాక్‌ మారింది. అయితే సినిమా నటుడిగానో కాకుంటే దర్శకుడిగానో మారాలన్నదే లక్ష్యంగా మార్చుకున్నాడు. అది విని నాన్న అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. 'నువ్వు దారి తప్పుతున్నావ్‌.. ఇక బాగుపడవ్‌. నా కళ్లముందు ఉండొద్దు!' అన్నాడు. అంతే.. ఇల్లు విడిచి వచ్చేశాడు 'అమ్మానాన్నా నేను వెళ్లిపోతున్నా.. దయచేసి వెతక్కండి!' అని లెటర్‌ రాసిపెట్టి మరీ!

'మీవాడు పనికిరాడు'

ఎంత కోపం ఉన్నా.. ఒక్కగానొక్క కొడుకు అలా వెళ్లిపోయాడనగానే ఆ తల్లిదండ్రులిద్దరూ తల్లడిల్లిపోయారు. రోజంతా వెతికారు. రాత్రయినా దొరకలేదు. అపరాత్రివేళ చంద్రశేఖర్‌కు ఓ అనుమానం వచ్చింది. వాళ్లకు దగ్గర్లోని ఓ థియేటర్‌కి వెళ్లాడు. అక్కడో ఫ్లాప్‌ సినిమా నడుస్తోంది. చంద్రశేఖర్‌ ఇంటర్వెల్‌ దాకా బయటే ఉండి.. లోపలికెళితే అక్కడున్నాడట విజయ్‌. అంటే, రోజంతా ఆ థియేటర్‌లో అన్ని షోలూ ఒకే ఫ్లాప్‌ సినిమా చూస్తూ కూర్చున్నాడన్నమాట. వీడిది మామూలు సినిమా పిచ్చి కాదు అని అప్పుడు అర్థమైందట వాళ్లనాన్నకు. ఇంటికి తీసుకొచ్చి 'నీకు సినిమా అవకాశం ఇప్పిస్తాను కానీ.. కనీసం ఏదైనా డిగ్రీ చెయ్‌!' అని నచ్చచెప్పాడట. ఏదో డిగ్రీ ఎందుకని సినిమాల గురించి నేర్పించే 'విజువల్‌ కమ్యూనికేషన్‌'లోనే చేరాడు విజయ్‌.

మూడేళ్లపాటు ఎలా ఉగ్గబట్టుకున్నాడో తెలియదుకానీ.. డిగ్రీ చేతికి రాగానే 'నాన్నా.. ఇక నా దారి నేను చూసుకుంటా!' అన్నాడు. తన పోర్ట్‌ఫోలియో పట్టుకుని స్టూడియోల చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు. మరోవైపు, అతనికి తెలియకుండా, తండ్రి చంద్రశేఖర్‌ కూడా తన ప్రయత్నాలేవో చేయడం మొదలుపెట్టాడు. 'నేను పక్కా కమర్షియల్‌ డైరెక్టర్‌ని. కానీ మావాణ్ణి నా తరహా సినిమాల్లో కాకుండా ఓ మంచి క్లాసిక్‌ సినిమా ద్వారా పరిచయం చేయాలనుకున్నాను.

నాటి పేరున్న దర్శకులందరికీ వాడి ఫొటో చూపించి 'నేను కొంత డబ్బు పెడతానండీ.. మీరు సినిమా తీయండి!' అన్నాను. 'సారీ! మీవాడు హీరో ఏంటండీ, అసలు నటుడిగానే పనికిరాడు.. బండమొహం వాడిది!' అని మొహంమీదే చెప్పేశారు' అని గుర్తుచేసుకుంటారు చంద్రశేఖర్‌. తండ్రీకొడుకులిద్దరూ చెరో మార్గంలో ప్రయత్నించాక ఇక ఏదైతే అదవుతుందని ఓ పెద్ద సాహసానికి ఒడిగట్టారు.

'ఇతను హీరోనా!'

'విజయ్‌కేం! వాళ్లనాన్న డైరెక్టర్‌ కాబట్టి హీరో కాగలిగాడు..' అన్నది విజయ్‌ ఎదుగుదల మీదున్న ఆక్షేపణ. ఆ మాటల్లో కొంతవరకే నిజం ఉంది కానీ పూర్తిగా కాదు. చంద్రశేఖర్‌-శోభ దంపతులు సినిమా రంగంలో నిలదొక్కుకోవడానికి ముందు ఎన్నో కష్టాలుపడ్డారు. బాత్రూమ్‌లు కూడా లేని సింగిల్‌ రూమ్‌ అద్దె ఇంట్లోనే జీవితాన్ని ప్రారంభించారు. విజయ్‌ ఆ ఇంటే పుట్టాడు. అప్పట్లో శోభ గాయనిగా కచేరీలు చేస్తేకానీ ఇల్లు గడవని పరిస్థితి. అలా కచేరీలకు వెళ్లి ఆరుబయట ఏదైనా చెట్టుకు ఊయలకట్టి పడుకోబెట్టి ఆమె వెళ్లి పాటలు పాడి వచ్చేదట.

విజయ్‌కు ఏడేళ్లు వచ్చేదాకా ఆర్థికంగా ఇలా సతమతమవుతూనే వచ్చింది ఆ కుటుంబం. ఆ తర్వాతే దంపతులిద్దరూ విజయ్‌కాంత్‌తో 'చట్టం ఒరు ఇరుట్టరై' సినిమా తీశారు. తెలుగులో చిరంజీవి హీరోగా 'చట్టానికి కళ్లులేవు', హిందీలో అమితాబ్‌తో 'అంథా కానూన్‌'.. ఇలా కన్నడ, మలయాళంలోనూ ఆ సినిమాను రీమేక్‌ చేశారు. అన్నిచోట్లా బంపర్‌హిట్టు సాధించడం వల్ల ఆ కుటుంబం నిలదొక్కుకుంది. ఆ తర్వాత ఎన్నో సూపర్‌హిట్టు సినిమాలు అందించినా.. 1992 నాటికి వరుస ఫ్లాపులొచ్చాయి. సరిగ్గా అప్పుడే విజయ్‌ హీరోగా సినిమాల్లోకి వెళతానని పట్టుబట్టాడు. చేసేది లేక అప్పు తెచ్చి రూ.60 లక్షలతో విజయ్‌ను హీరోగా పెట్టి 'నాళయ తీర్పు' అనే సినిమా తీశారు. పన్నెండేళ్ల ఎం.ఎం.శ్రీలేఖను సంగీతదర్శకురాలిగా పరిచయం చేసి గిన్నిస్‌ రికార్డు సృష్టించిన ఆ చిత్రంలోని పాటలు సూపర్‌హిట్టయ్యాయి కానీ.. సినిమా పెద్ద ఫ్లాపయింది.

ఎద్దుపుండు కాకికి ముద్దన్నట్టు నాటి పత్రికలన్నీ విజయ్‌ నటనను చీల్చిచెండాడాయి. 'తండ్రి దర్శకుడైనంత మాత్రాన తగుదునమ్మా అని హీరోగా వస్తే ఎలా!' అంటూ ఏకిపారేశాయి. 'సరిగ్గా క్రిస్మస్‌ రోజు ఆ రివ్యూలు వచ్చాయి. ఆ రాతల్ని చూసి కొత్త బట్టలన్నీ విసిరేసి భోరుమని ఏడుస్తూ కూర్చున్నాను. దాదాపు రెండు నెలలపాటు ఫ్రెండ్స్‌నూ రానివ్వలేదు. అదెంత తప్పో ఆ తర్వాతే అర్థమైంది. నిజానికి, ఆ స్నేహితులే నన్ను మళ్లీ మనిషిని చేశారు. 'పొగొట్టుకున్న చోటే రాబట్టుకోవాలిరా విజయ్‌! ఇవే పత్రికలు రేపు నీ గురించి ఆహాఓహో అని రాసేలా చేయాలి..!' అని కసిని పెంచారు. ఆ కసితోనే ఈసారి ఇల్లు తనఖాపెట్టి మరి ఓ సినిమా తీయడం మొదలుపెట్టారు.

'కెప్టెన్‌' ఆదుకున్నారు..

'మా నాన్నగారి తొలి సినిమాతో స్టార్‌ అయిన కెప్టెన్‌' విజయ్‌కాంత్‌ నాకు సాయపడటం కోసం వచ్చారు. నా రెండో సినిమాకు పైసా పారితోషికం తీసుకోకుండానే అతిథిపాత్ర చేసేందుకు ఒప్పుకున్నారు. అలా సెందూరపాండి(తెలుగులో బొబ్బిలి రాయుడు) అనే సినిమా తీశాం. విజయ్‌కాంత్‌గారి ఆ అతిథిపాత్రే నన్నూ, నా సినిమానీ 'బీ' అండ్‌ 'సీ' ప్రేక్షకుల్లోకి తొలిసారి తీసుకెళ్లింది. సినిమా సూపర్‌హిట్టయింది. మొదటి సినిమాతో కోల్పోయిన నాన్న ఆస్తులు తిరిగొచ్చేశాయి. కానీ తర్వాతేమిటీ.. ప్రతిసారీ విజయ్‌కాంతో రజినీకాంతో వచ్చి ఆదుకోరుకదా! నన్ను మాత్రమే చూసి ప్రేక్షకులెలా థియేటర్లకు రావాలి?' అన్న ప్రశ్న మొదలైంది నాలో!' అంటాడు విజయ్‌. ఆ ప్రశ్నకు సమాధానంగానే డాన్స్‌పైన కసరత్తు మొదలుపెట్టాడు. కరాటే నేర్చుకున్నాడు. పగలూరాత్రీ ఇంకే ధ్యాసాలేకుండా సాధన చేశాడు.

అలా దాదాపు ఏడాది! ఆ తర్వాత సరికొత్త విజయ్‌గా 'రసిగన్‌' అనే సినిమా చేశాడు. ఒకప్పుడు బండమొహంగాడు అన్న ప్రేక్షకులే 'అరె.. వీడు డ్యాన్సు భలే చేస్తున్నాడ్రా, ఫైట్సు అదరగొడుతున్నాడ్రా!' అనడం మొదలుపెట్టారు. ఆ సినిమా 'సిల్వర్‌ జూబ్లీ' చేసుకుని, సూపర్‌హిట్ల పరంపరకు ప్రారంభంగా మారింది. రెండేళ్లపాటు వరస మాస్‌ సినిమాల తర్వాత 'పూవే ఉనక్కాగ'(తెలుగులో 'శుభాకాంక్షలు') చిత్రంతో క్లాస్‌ ప్రేక్షకుల్నీ కట్టిపడేశాడు. మరో మూడేళ్ల తర్వాత మలయాళ దర్శకుడు ఫాజిల్‌ తీసిన 'కాదలుక్కు మరియాదై'తో స్టార్‌ స్టేటస్‌ అందుకున్నాడు.

ఆ ఏడాది ఓ పత్రిక తమిళనాడు వ్యాప్తంగా ఉన్న మహిళా కళాశాలల్లో ఓ సర్వే నిర్వహిస్తే 70 శాతం మంది 'ఒకప్పుడు రజినీకాంత్‌. ఇప్పుడు మాత్రం మా ఫేవరేట్‌ విజయ్‌' అంటూ ఓటేశారు! ఇప్పటిదాకా ఆ స్థానంలో ఏ మార్పూ లేదు. ఇక వరసగా 'ఖుషీ', 'గిల్లీ'(తెలుగులో 'ఒక్కడు'), 'పోకిరి'(తెలుగు రీమేక్‌) వంటివి తమిళనాడు లోనే కాదు కేరళలోనూ అతణ్ణి స్టార్‌ను చేశాయి. కానీ.. ఎందుకో 2007 నుంచి ఆ ప్రాభవం తగ్గడం మొదలైంది.

ఐదేళ్లు.. నో హిట్‌!

ఏ స్థాయి హీరోకైనాసరే వరుసగా ఒకట్రెండు ఫ్లాపులొస్తేనే తట్టుకోవడం కష్టం. అలాంటిది విజయ్‌కు వరసగా ఐదేళ్లపాటు ఏడు సినిమాలు ఫెయిలయ్యాయి. కానీ విజయ్‌ కుంగిపోలేదు. కసిగా ఓ మంచి అవకాశం కోసం చూస్తూ వచ్చాడు. ఆ అవకాశం శంకర్‌ చిత్రం 'స్నేహితుడు' రూపంలో వచ్చింది. ఆ తర్వాత వచ్చిన 'తుపాకి' తెలుగులోనూ హిట్టు కొట్టింది. 'అదిరింది', 'సర్కార్‌', 'విజిల్‌'.. ఇప్పుడు 'మాస్టర్‌' వంటి సినిమాలు విజయ్‌ను మనకూ మరింత దగ్గరగా చేరువచేశాయి! ఆ మూడూ కలిసి వెయ్యికోట్ల పైచిలుకు కలెక్షన్స్‌ రాబట్టాయి. ఈ నేపథ్యంలోనే తొలిసారి 'బీస్ట్‌'తో తెలుగు-తమిళ ద్విభాషా చిత్రంలో నటించబోతున్నాడు. ఆ తర్వాత వంశీపైడిపల్లి దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మిస్తున్న మరో సినిమాకు సైన్‌ చేశాడు.

విజయ్​ దంపతులు

దానికీ మౌనమే..

విజయ్‌ తన అభిమాని సంగీతనే పెళ్లి చేసుకున్నాడు. వాళ్లకు ఇద్దరు పిల్లలు. అబ్బాయి జేసన్‌ యూట్యూబ్‌లో వీడియో జాకీగా కనిపిస్తుంటాడు. తన కూతురికి చెల్లెలు విద్య పేరును గుర్తుకు తెచ్చేలా దివ్య అని పేరుపెట్టాడు విజయ్‌. ఆ పాప బ్యాడ్మింటన్‌లో రాణిస్తోంది. ఇదిలా ఉంటే 'విజయ్‌ మక్కల్‌ ఇయక్కం'(విజయ్‌ ప్రజా సంఘం) పేరుతో గత 15 ఏళ్లుగా విద్య, వైద్యరంగాల్లో సేవలందిస్తున్నాడు. ఈ సంఘం రాజకీయపార్టీగా మారుతుందనే అంచనాలు గట్టిగా ఉన్నా విజయ్‌ దానిపైన పెదవి విప్పడం లేదు.. ఎప్పట్లాగే మౌనంగానే ఉండిపోతున్నాడు!

ఇదీ చూడండి..Toofaan: ఫర్హాన్​ అక్తర్​ సినిమాపై వ్యతిరేకత

ABOUT THE AUTHOR

...view details