రాష్ట్రంలో సినీ ప్రముఖుల డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. నాలుగేళ్ల క్రితం హైదరాబాద్‌లో ఎక్సైజ్ అధికారులకు చిక్కిన కొందరు డ్రగ్స్ విక్రేతల విచారణలో పలువురు సినీ ప్రముఖుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. సినీ ప్రముఖులను ఎక్సైజ్ అధికారులు సుదీర్ఘ విచారణ జరిపారు. రక్తం, గోళ్లు, వెంట్రుకల శాంపిల్స్ సేకరించి లేబొరేటీలకు పంపించారు. అప్పుడు సినీ ప్రముఖులకు క్లీన్ చిట్ ఇచ్చిన ఎక్సైజ్ అధికారులు.. పలువురు డ్రగ్స్ విక్రేతలపై 12 ఛార్జ్ షీట్లను దాఖలు చేశారు.
డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులకు ఈడీ సమన్లు - పూరీ జగన్నాథ్‌కు ఈడీ నోటీసులు
నాలుగేళ్ల క్రితం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మాదకద్రవ్యాల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ ప్రముఖులకు ఈడీ సమన్లు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని చార్మి, రకుల్ ప్రీత్ సింగ్, రానా దగ్గుపాటి, రవితేజ, పూరి జగన్నాథ్, నవదీప్, ముమైత్ ఖాన్, తరుణ్, నందు, శ్రీనివాస్‌ను ఈడీ ఆదేశించింది.
అయితే, ఈ డ్రగ్స్ కేసును సీబీఐ, నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలని గతంలో రేవంత్ రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా ఈడీ కేసును విచారణ జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని.. ఎక్సైజ్ అధికారుల నుంచి వివరాలు అందడం లేదని ఈడీ ఆరోపించింది. చివరకు ఎక్సైజ్ శాఖ కేసుల ఆధారంగా డ్రగ్స్ కేసులపై మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసి రంగంలోకి దిగింది. డ్రగ్స్ కేసులో విచారణకు హాజరు కావాలని పలువురు సినీ ప్రముఖులను ఈడీ సమన్లు జారీ చేసింది.
ఈనెల 31న పూరీ జగన్నాథ్, సెప్టెంబరు 2న చార్మి, 6న రకుల్ ప్రీత్ సింగ్, 8న రానా దగ్గుపాటి, 9న రవితేజ శ్రీనివాస్, 13న నవదీప్, ఎఫ్-క్లబ్ జనరల్ మేనేజర్, 15న ముమైత్ ఖాన్, 17న తనీష్, 20న నందు, 22న తరుణ్ హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో సినీ ప్రముఖులతో పాటు.. డ్రగ్స్ విక్రేతలను ఈడీ బృందాలు ప్రశ్నించనున్నాయి.