భారత సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు దర్శకుడు మణిరత్నం. సినిమాలు తెరకెక్కించడంలో ఆయన శైలే విభిన్నంగా ఉంటుంది. మణిరత్నం తీసిన ప్రేమకథా చిత్రాలు కుర్రకారు మదిలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. దర్శకుడిగా తొలి కన్నడ చిత్రం 'పల్లవి అనూ పల్లవి'తో పురస్కారం అందుకుని విజయపరంపర కొనసాగించారు. హిందీ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. తెలుగులో ఆయన తీసిన తొలి చిత్రం 'గీతాంజలి' బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాసింది. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది.
'రోజా'తో ప్రేమికుల మనసు దోచేశారు మణి. దేశవ్యాప్తంగా చాలా భాషల్లో ఈ చిత్రం విడుదలైంది. ఇది ఆయనకు జాతీయస్థాయి గుర్తింపు తీసుకొచ్చింది. మణిరత్నం ప్రేమ కథలను దేశానికి పరిచయం చేసి అఖండ విజయం నమోదు చేసిన చిత్రమది. తర్వాత దర్శకుడు రాంగోపాల్ వర్మ తీసిన 'గాయం' చిత్రానికి కథ రాసిందీ మణిరత్నమే. 'బొంబాయి' చిత్రంతో మంచి మెలోడీ హిట్టందుకున్నారు. 'తాజ్ మహల్' లాంటి ఎన్నో చిత్రాలకు కథ రాసి ప్రేక్షకుల మనసులో గుర్తుండిపోయారు.