తమిళంలో రూపొందుతున్న 'నవరస'(Navarasa) కథా సంకలనం జాతీయ స్థాయిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అందుకు కారణం ఈ సిరీస్‌కు ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం నిర్మాత కావడమే! మరో దర్శకుడు జయేంద్రతో కలిసి మణిరత్నం(Mani Ratnam) రూపొందిస్తున్న ఈ కథా సంకలనం ఆగస్టు 6న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రదర్శనకు అందుబాటులో ఉంటుంది. తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన సినీ కార్మికులను ఆదుకోవడమే లక్ష్యంగా రూపుదిద్దుకున్న చిత్రాలివీ. హాస్యం, శృంగారం, కరుణ, శాంతం, రౌద్రం, బీభత్సం, భయానకం, అద్భుతం, వీరం.. ఇలా నవరసాలతో కూడిన చిత్రాలు ఇవి. ఒక్కో కథ ఒక్కో భావోద్వేగం నేపథ్యంగా సాగుతుంది. సూర్య, గౌతమ్ మేనన్, సిద్ధార్థ్, అరవింద్ స్వామి.. ఇలా పలువురు నటులు, సాంకేతిక నిపుణులు ఇందులో భాగమయ్యారు. ఈ సందర్భంగా మణిరత్నం, జయేంద్ర(Jayendra Panchapakesan)తో 'ఈనాడు సినిమా' ప్రత్యేకంగా ముచ్చటించింది. వారు చెప్పిన విషయాలివీ..
నవరసాల్లో మీరు ఏ భావోద్వేగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ సినిమా చేయడానికి ఇష్టపడతారు?
అది కథనిబట్టే ఉంటుంది. అన్ని భావోద్వేగాలూ ఒక సినిమాలో ఉండాలనేమీ లేదు. మన జీవితాల్లో నవరసాలు ఉన్నట్టే సినిమా కథలోనూ ప్రస్ఫుటిస్తుంటాయి.
'నవరస' వెబ్ సిరీస్ ఎక్కడ, ఎలా మొదలైంది?
అన్ని సినిమాలూ భావోద్వేగాల్ని ఉద్దేశించే తీస్తుంటాం. ఇక 'నవరస' సిరీస్ ఎక్కడ ఎలా మొదలైందంటే.. కరోనా మహమ్మారి వల్ల చితికిపోయిన సినీ కార్మికులకు అండగా నిలిచేందుకు ఏదైనా చేయాలనే ఆలోచన నుంచే పుట్టింది. నేను, జయేంద్ర ఇదివరకు సామాజిక కారణాల కోసం పలు కార్యక్రమాలు చేసి నిధులు సేకరించాం. తను పిలిచి మనం ఏదైనా చేయాలని చెప్పినప్పుడు ఇలా తొమ్మిది కథలతో ఓ వెబ్‌సిరీస్ చేద్దామని నిర్ణయించాం. అలా మొదలైందీ ప్రయాణం.
ఈ కథలన్నీ మీరు సమకూర్చినవేనా? దర్శకులుగా మీరెందుకు ఇందులో భాగం కాలేదు?
కథలు ఆయా దర్శకులు సిద్ధం చేసుకున్నవే. ఈ చిత్రాలన్నీ వాళ్ల శైలికి తగ్గట్టే సాగుతాయి. ఈ తొమ్మిది కథల్ని విని ఎంపిక చేయడం, అవసరమైనప్పుడు తగిన సలహాలు ఇస్తూ వాటి ప్రమాణాల్ని పర్యవేక్షిస్తూ, నిర్మాణాన్ని నడిపించడమే మా పనిగా భావించాం. తొమ్మిది మంది దర్శకులు, తొమ్మిది కథలు, ఎంతోమంది నటులతో కలిసి ప్రయాణంచేయడం సంతృప్తినిచ్చింది. దర్శకులుగా ఇందులో మేం భాగం కాకూsడదేని ముందే నిర్ణయించుకున్నాం. ఈ ప్రయాణం నవరసాలతో సమానమైన అనుభవాన్నే ఇచ్చింది.
భవిష్యత్తులో ఓటీటీ కోసం ఈ తరహా సిరీస్‌లు తెరకెక్కించే ఆలోచన ఉందా? ఓటీటీ వేదికలు మన ప్రేక్షకులకు అనూహ్యంగా చేరువ కావడంపై మీ అభిప్రాయం ఏమిటి?