ఈ ప్రపంచంలో 'అమ్మ' ప్రేమకు ఏదీ సాటి రాదు. ఎందుకంటే తన పిల్లలకు ఆమె ఇచ్చే ధైర్యం, ప్రోత్సాహం, ఆమెకు ఉన్న సహనం, ఓర్పు అలాంటింది. సాధారణంగా పిల్లలకు ఏదైనా అయితే ఆ తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. వారికి ఏదైనా క్లిష్ట సందర్భం ఎదురైతే తోడుగా ఎవరు ఉన్నా లేకపోయినా చివరి వరకు ఉంటుంది. తాజాగా ఈటీవీలో నటుడు సాయికుమార్ వ్యాఖ్యాతగా ప్రసారమయ్యే 'వావ్' షోకు అతిథిగా హాజరైన అమ్మరాజశేఖర్ చెప్పిన ఓ విషయం 'అమ్మ ప్రేమ'కు అద్దం పడుతోంది(amma rajasekhar about his mother). అనారోగ్యం వల్ల నాలుగేళ్ల పాటు ఆస్పత్రిలోనే ఉండాల్సి వస్తే.. ఆ సమయంలో ఎంతో ఓర్పు, సహనంతో తనకు సేవ చేస్తూ బతికించుకుందని గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు రాజశేఖర్. తన తల్లి గురించి ఆయన చెప్పిన మాటలు మనసును కదలించాయి. అమ్మ మీద ప్రేమతోనే అమ్మ రాజశేఖర్ పేరు పెట్టుకున్నట్లు తెలిపారు!
"అసలు పేరు రాజవీర పాండియన్. ఆ తర్వాత అమ్మ రాజశేఖర్గా మార్చుకున్నా. నా జీవితంలో నాలుగేళ్లు ఆస్పత్రిలో ఉన్నా. నా కోసం మా అమ్మ కూడా హాస్పిటల్లోనే ఉంది. మా ఇల్లు మెయిన్రోడ్లో ఉంటుంది. అక్కడ ఇసుక ఉంటుంది. దాన్ని చిన్నప్పుడు తినేవాడిని. దీనితో అనారోగ్యం పాలయ్యా. నాలుగేళ్లప్పుడు ఆస్పత్రికి వెళ్లా. ఎనిమిదేళ్ల సమయంలో తిరిగి వచ్చాను. ఆ తర్వాత ఎల్కేజీ చదివాను. అనారోగ్యం వల్ల ఎత్తు కూడా పెరగలేకపోయా. నా ఫ్రెండ్(స్పోర్ట్స్ మెన్) వల్ల ఎక్సర్సైజ్లు నేర్చుకుని చేశాను. దాంతో ఈమాత్రం ఎత్తు పెరిగాను. లేకపోతే పొట్టిగానే ఉండిపోయావాడిని. దర్శకుడు కృష్ణవంశీ తొలిసారి 'గోవింద గోవింద' సాంగ్ కోసం నాపేరును అమ్మ రాజశేఖర్గా మార్చారు."