బాలీవుడ్ యంగ్హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో సినీ ప్రముఖుల విచారణ ముమ్మరంగా సాగుతోంది. తాజాగా హీరోయిన్ కంగనా రనౌత్ విచారణకు హాజరు కావాల్సిందిగా ముంబయి పోలీసులు సమన్లు జారీ చేయనున్నారు. అందుకు సంబంధించిన దస్త్రాలను సిద్ధం చేస్తున్నారు. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు. విచారణ విషయంలో పోలీసులు సరైన స్పష్టత ఇవ్వట్లేదని కంగనా సోదరి రంగోలి కొన్ని స్క్రీన్ షాట్లను బయటపెట్టిన అనంతరం.. అధికారులు ఈ చర్యకు పూనుకుంటున్నట్లు తెలుస్తోంది.
సుశాంత్ మరణించినప్పటి నుంచి అతడి మద్దతుగా నిలుస్తోంది కంగనా. చిత్రసీమలో బంధుప్రీతి వల్లే అతడు అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఆరోపించింది. దీనికి సంబంధించిన పలు దృశ్య సందేశాలను సామాజిక మాధ్యమాల వేదికగా పోస్ట్ చేసింది.