లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగులు, రీ ప్రొడక్షన్లను దశల వారీగా పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. లాక్ డౌన్ నిబంధనలు, కొవిడ్ వ్యాప్తి నివారణ మార్గదర్శకాలు పాటిస్తూ షూటింగులు నిర్వహించాలని సూచించారు. ఎవరికి వారు నియంత్రణ పాటించాలని పేర్కొన్నారు. సినిమా షూటింగులు ఎలా నిర్వహించుకోవాలనే విషయంలో విధి విధానాలు రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధర్వంలో చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్, ఎస్.ఎస్. రాజమౌళి, దిల్‌రాజు, త్రివిక్రమ్, ఎన్.శంకర్, రాధాకృష్ణ, సి.కల్యాణ్, సురేశ్‌బాబు, కొరటాల శివ, జెమిని కిరణ్, మెహర్ రమేశ్, ప్రవీణ్‌బాబు తదితరులు ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. సినిమా షూటింగులు, రీ ప్రొడక్షన్ పునరుద్ధరణ, సినిమా థియేటర్ల పునఃప్రారంభం తదితర అంశాలపై చర్చించారు. సినిమా షూటింగులకు అనుమతి ఇవ్వాలని, సినిమా థియేటర్లు తెరిచే అవకాశం ఇవ్వాలని సినీ రంగ ప్రముఖులు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. దీనికి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు.
సినిమా పరిశ్రమపై ఆధారపడి లక్షలాది మంది జీవిస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్, షూటింగ్‌లు, థియేటర్ల ప్రదర్శనలు దశలవారీగా పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. మొదటి దశలో రీప్రొడక్షన్ పనులు ప్రారంభించుకోవాలి. జూన్‌లో సినిమా షూటింగులు ప్రారంభించుకోవాలి. పరిస్థితులకు అనుగుణంగా థియేటర్ల పునఃప్రారంభంపై నిర్ణయం. సినీ పరిశ్రమ బతకాలి.. అదే సమయంలో కరోనా వ్యాప్తి జరగవద్దు.
-సీఎం కేసీఆర్
షూటింగ్‌ల నిర్వహణ, జాగ్రత్తలపై సినిమాటోగ్రఫీ మంత్రి, సీఎస్‌తో చర్చించాలని సినీ ప్రముఖులకు సీఎం సూచించారు. చర్చల అనంతరం మార్గదర్శకాలు రూపొందించి షూటింగ్‌లకు అనుమతి ఇవ్వాలని పేర్కొన్నారు. షూటింగ్‌లు ప్రారంభమయ్యాక పరిస్థితులపై అంచనా వస్తుందని తెలిపారు. అంచనాల ఆధారంగా థియేటర్ల ప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని సీఎం వెల్లడించారు.
చిరు ట్వీట్
ముఖ్యమంత్రి స్పందనపై సినీ పరిశ్రమ తరఫున చిరంజీవి ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. సినిమా, టీవీ, డిజిటల్ మీడియాకు సంబంధించి సమస్యలు సానుకూలంగా విన్నారని, వేలాది మంది దినసరి వేతన కార్మికులకు ఊరట కలిగించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. వినోద పరిశ్రమ పునఃప్రారంభించే విధి విధానాలు త్వరలోనే ప్రభుత్వం రూపొందించి అందరికి మేలు కలిగేలా చూస్తుందని చిరంజీవి పేర్కొన్నారు.