గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతి భారత చిత్ర పరిశ్రమకు తీరని లోటని సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఇకలేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నామని సోషల్‌మీడియాలో పోస్ట్‌లు చేశారు. కె. రాఘవేంద్రరావు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, మహేశ్‌బాబు, ఎన్టీఆర్, రవితేజ, నాని, అక్షయ్ కుమార్, సల్మాన్‌ఖాన్ తదితరులు సంతాపం తెలిసిన వారిలో ఉన్నారు.
నా ప్రియమైన బాలు.. సంగీత ప్రపంచంలో నిశ్శబ్దం ఆవరించింది.. సరిగమలన్నీ కన్నీళ్లు పెడుతున్నాయి.. రాగాలన్నీ మూగబోయాయి.. నువ్వు లేని లోటు తీర్చలేనిది!! -కె. రాఘవేంద్రరావు, దర్శకుడు
ప్రపంచ సంగీతానికి ఇది చీకటి రోజు. మ్యూజిక్ లెజెండ్ ఎస్పీ బాలు గారి మరణంతో ఓ శకం ముగిసింది. వ్యక్తిగతంగా చెప్పాలంటే.. నా కెరీర్ విజయంలో బాలు గారి స్వరం పాత్ర ఎంతో ఉంది. ఆయన నా కోసం ఎన్నో మధురమైన గీతాలు ఆలపించారు. ఘంటసాల గారి తర్వాత ఈ సంగీత ప్రపంచాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్తారా?.. అనే తరుణంలో ఓ తారలా బాలు గారు మ్యూజిక్ గెలాక్సీలోకి అడుగుపెట్టారు. భాష, ప్రాంతం, హద్దులు.. అనేవి లేకుండా పలు దశాబ్దాలుగా ఆయన మధుర గాత్రం భారత దేశవ్యాప్తంగా ఉన్న ప్రజల్ని అలరిస్తోంది. భవిష్యత్‌లో మరో బాలసుబ్రమణ్యం రాడు.. కేవలం ఆయన పునఃజన్మ మాత్రమే ఆ లోటును భర్తీ చేయగలదు. ఆయన మరణ వార్త విని, నా గుండె పగిలింది. మీ ఆత్మకు శాంతి చేకూరాలి బాలు గారు. -చిరంజీవి
16 భాషల్లో 40 వేలకిపైగా పాటలు పాడిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి నిష్క్రమణ యావత్ సినీ, సంగీత ప్రపంచానికే తీరని లోటు. వ్యక్తిగతంగా నాకు బాలు గారితో ఎంతో అనుబంధం ఉంది. ఆయన పాడిన నాన్నగారి పాటలు, నా పాటలు వినని రోజంటూ ఉండదు. ముఖ్యంగా ‘భైరవ ద్వీపం’లో ఆయన ఆలపించిన ‘శ్రీ తుంబుర నారద నాదామృతం’ పాటను ఎప్పుడూ పాడుకుంటూనే ఉంటాను. అలా ప్రతి క్షణం ఆయన్ని తలుచుకుంటూనే ఉంటాను. అలాంటి గొప్ప గాయకుడు, గొప్ప వ్యక్తి మనతో లేకపోవడం ఎంతో విచారకరం. బాలు గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నా. -బాలకృష్ణ
ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు ఇక లేరనే వార్త నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇవాళ ఓ లెజెండ్‌ను కోల్పోయాం. నా కెరీర్‌లో హిట్లుగా నిలిచిన ‘ప్రేమ’, ‘పవిత్రబంధం’ వంటి సినిమాల్లో ఆయనతో కలిసి పనిచేయడం నా అదృష్టం. మీ ఖ్యాతి ఎప్పటికీ సజీవంగా ఉంటుంది. బాలు కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలుపుతున్నా.. -వెంకటేశ్
‘బాలు సర్.. గత కొన్నేళ్లుగా మీరు నా స్వరం అయ్యారు. మీ జ్ఞాపకాలు, మీ స్వరం నాతో ఎప్పటికీ ఉంటాయి. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నా.. -రజినీకాంత్